అయోమయంలో.. ‘తమ్ముళ్లు’!

14 Oct, 2018 10:27 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీడీపీ శ్రేణులు పూర్తి నిరాశలో మునిగిపోయాయి. ఆ పార్టీనుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడిన నేతలు అయోమయంలో పడిపోయారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని మహాకూటమిలో చేరిన టీడీపీ.. తమకు కేటాయించే స్థానాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. పొత్తులో భాగంగా పోటీచేసే స్థానాలపై స్పష్టత రాకపోవడంతో  టికెట్లు ఆశిస్తున్న నాయకులు నిరాశ చెందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో ప్రధాన పార్టీగా వెలుగొందిన టీడీపీ పరిస్థితి ఇప్పుడు దైన్యంగా తయారైంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఒక్క చోటా విజయం సాధించలేక పోయింది. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయకుండా కాంగ్రెస్, ఇతర పక్షాలతో కలిసి మహా కూటమిని కట్టిన టీడీపీ తమకు కేటాయించాల్సిన స్థానాలపై కాంగ్రెస్‌ దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతోంది. జిల్లాలో కనీసం నాలుగు స్థానాలు కావాలని కోరుతున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎవరెక్కడ..?
నల్లగొండ నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్‌చార్జి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ పోటీ చేయాలని ఆశపడ్డారు. ఇన్‌చార్జి పదవిని ప్రకటించాక ఆయా మండలాల్లో కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల్లో పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో కాంగ్రెస్‌ టీడీపీల మధ్య పొత్తు ఉంటుందని తేలడంతో నిరాశలో పడిపోయారు. నల్లగొండ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ సీటును పార్టీ కోరడం, కాంగ్రెస్‌ కేటాయించడం వంటి అంశాలు అసాధ్యం కావడంతో ఒకింత వెనక్కి తగ్గారు. మరోవైపు టీడీపీ కోదాడ, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలనూ కోరుతోందని చెబుతున్నారు. కోదాడలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ పద్మావతిని పక్కన పెట్టి టీడీపీకి టికెట్‌ కేటాయిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. కోదాడనుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌ ఈసారి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ కేటాయిస్తే తప్ప ఆయన టీడీపీ పక్షాన పోటీకి దిగే అవకాశమే లేదు. తమ సిట్టింగ్‌ సీటును కాంగ్రెస్‌ త్యాగం చేస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. నకిరేకల్‌లోనూ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ తరఫున ఇప్పటికే  ప్రచారం చేపట్టారు. ఇక్కడినుంచే మహా కూటమి భాగస్వామ్య పక్షం తెలంగాణ ఇంటి పార్టీ కూడా  ఈ స్థానం ఆశిస్తోంది. దీంతో టీడీపీ తరఫున పోటీకి దిగాలని భావిస్తున్న పాల్వాయి రజనీ కుమారి డైలమాలో పడిపోయారు.

ప్రధానంగా ఈ స్థానాలే కాకుండా మిర్యాలగూడ, ఆలేరు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలు పోటీ చేయాలని భావిస్తున్నారు. అన్ని చోట్లా కాంగ్రెస్‌ నుంచి ముఖ్యమైన నేతలే ఉండడంతో టీడీపీకి అసలు జిల్లాలో ఒక్క స్థానమన్నా కేటాయిస్తారా .. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి కేటాయించే సీట్లు తేలకపోవడంతో, జిల్లాలోనూ ఆదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుందామనుకున్న టీడీపీ నాయకులు నిరాశలో మునిగిపోయారు.   

మరిన్ని వార్తలు