పంటకు ‘పంచ’ప్రాణాలు!

8 Mar, 2016 02:50 IST|Sakshi
పంటకు ‘పంచ’ప్రాణాలు!

ఐదు కీలక ప్రాజెక్టులపై నేడే ‘మహా’ ఒప్పందం
మేడిగడ్డ, తుమ్మిడిహెట్టి, ఛనఖా-కొరాటా, పిన్‌పహాడ్, రాజాపేట బ్యారేజీలకు లైన్ క్లియర్
ముంబై చేరుకున్న కేసీఆర్ బృందం
నేటి ఉదయం 10.15 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు
కీలకంగా మారనున్న మేడిగడ్డ బ్యారేజీ ఎత్తు
ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఒప్పందం ఉండాలన్న కేసీఆర్

 సాక్షి, ఆదిలాబాద్/హైదరాబాద్:
 ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసే క్రతువులో భాగంగా నేడు కీలక అడుగు పడబోతోంది. గోదావరిపై నిర్మించనున్న ఐదు అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం ఒప్పందం చేసుకోనున్నాయి. ఈ ఒప్పందంతో మేడిగడ్డతోపాటు ప్రాణహితపై తుమ్మిడిహెట్టి, పెన్‌గంగపై ఛనఖా-కొరాటా, పిన్‌పహాడ్, రాజాపేట బ్యారేజీల నిర్మాణాలకు లైన్ క్లియర్ కానుంది. వీటికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో రెండు రాష్ట్రాల అధికారులు సంతకం చేయనున్నారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో మంగళవారం ఉదయం 10.15 గంటలకు ఈ ఒప్పందం కుదరనుంది. ఇందుకోసం సోమవారం మధ్యాహ్నం 12.40 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ముంబై బయల్దేరిన సీఎం కేసీఆర్ బృందం.. మధ్యాహ్నం 2.30 గంటలకు ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి చేరుకుంది.

మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆహ్వానం మేరకు సీఎం నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ రాజ్‌భవన్‌లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో, రెండు రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉండే రీతిలో అవగాహన ఒప్పందాలుండాలని ఆయన పేర్కొన్నారు. సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, సలహాదారులు విద్యాసాగర్‌రావు, డి.శ్రీనివాస్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్, సీఈలు వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు ఉన్నారు.

 మేడిగడ్డ ఎత్తుపై ఏం చేస్తారో?
 మహారాష్ట్రతో ఒప్పందం సందర్భంగా అందరి దృష్టి కాళేశ్వరం దిగువన నిర్మించనున్న మేడిగడ్డ బ్యారేజీ ఎత్తుపైనే కేంద్రీకృతమైంది. ఈ బ్యారేజీని 103 మీటర్ల వద్ద నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎత్తులో 3 వేల ఎకరాల వరకు ముంపు ఉంటుందని తేల్చారు. దీనిపై సర్వే చేయించిన మహారాష్ట్ర.. ముంపును ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉంది. దీంతో తెలంగాణ చెప్పినట్లు 103 మీటర్ల ఎత్తుకు ఒప్పుకుంటారా? లేదా తగ్గించాలని పట్టుబడుతారా అన్నది కీలకంగా మారనుంది. ‘‘మహారాష్ట్ర అభ్యంతరం చెబితే ఒకట్రెండు మీటర్లకు తగ్గించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎంవోయూ కుదిరిన వెంటనే ఇద్దరు సీఎంలు చర్చలు జరుపుతారు. అవి కొలిక్కి వచ్చినా, రాకున్నా తెలంగాణ నిర్ణయించిన ఎత్తు మేరకు పనులు ప్రారంభమవుతాయి. చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత ఏ ఎత్తుపై ఒప్పందం కుదిరితే.. అంత ఎత్తులో నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటాం. దీని ద్వారా మహారాష్ట్రలో ముంపును నివారించడం, తద్వారా ఒప్పందాలను గౌరవించడం రెండూ జరుగుతాయి’’ అని అధికారులు చెబుతున్నారు.

 ఒప్పందాల అమలుపై అంతర్రాష్ట్ర బోర్డు
 మేడిగడ్డ మినహా ఇతర ప్రాజెక్టులపై 2012 మే 5న ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ మధ్య ఒప్పందం కుదిరింది. అప్పుడు జల వనరుల శాఖ అంతర్రాష్ట్ర ఒప్పందాల విభాగం ముఖ్య కార్యదర్శి హోదాలో ఎస్‌కే జోషి సంతకం చేశారు. ఇప్పుడు రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి హోదాలో రెండోసారి సంతకం చేయనున్నారు. అంతరాష్ట్ర ఒప్పందాల అమలుకు సీఎం అధ్యక్షతన, మంత్రులు, ఇరు రాష్ట్రాల అధికారులు సభ్యులుగా ఉండే అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండే బోర్డులో ఒక ఏడాది తెలంగాణ సీఎం సీఎం చైర్మన్‌గా ఉండే, మరో ఏడాది మహారాష్ట్ర సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

 సంబరాలకు భారీ ఏర్పాట్లు
 సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న గోదావరి జలాల వివాదానికి సీఎం ప్రత్యేక చొరవ చూపడంపై టీఆర్‌ఎస్ నేతల్లో అనందం వ్యక్తమవుతోంది. ఒప్పందం తర్వాత మంగళవారం మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న సీఎంకు ఘన స్వాగతం పలకాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం అధికారిక నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని డివిజన్ల నుంచి ప్రజలను సమీకరించడంతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
 
 నాలుగు దశాబ్దాల కల
 పెన్‌గంగ ప్రాజెక్టు 1975 నుంచి ప్రతిపాదన దశలోనే ఉంది. నాలుగు దశాబ్దాలుగా పనులు కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా మూడు బ్యారేజీలు నిర్మించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇందులో భాగంగానే కొరటా-చనాఖా, పిన్‌పహడ్, రాజాపేట బ్యారేజీల నిర్మాణాలు తెరపైకి వచ్చాయి. 1.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొరటా-చనాఖా బ్యారేజీతో ఆదిలాబాద్ జిల్లాలో 13,500 ఎకరాలను సాగులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల రైతులకు ఈ బ్యారేజీ ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే ఈ బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండరు ప్రక్రియను పూర్తి చేసింది.

 తగ్గిన ఎత్తు.. పెరగనున్న ఆయకట్టు
 ప్రాణహితపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... దీని ద్వారా ఆదిలాబాద్ జిల్లా ఆయకట్టును 2 లక్షల ఎకరాలకు పెంచాలని భావిస్తోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు సాగు నీరందించాలనే ప్రతిపాదన ఉంది. అయితే.. ఈ బ్యారేజీ ఎత్తు తగ్గించడం, బ్యారేజీని మేడిగడ్డకు తరలించడం వంటి ప్రతిపాదనతో జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఈ బ్యారేజీ ఆయకట్టును 2 లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలోని భూములకు సాగు నీరందే అవకాశాలున్నాయి. ఇక పెన్‌గంగపై మూడు బ్యారేజీల నిర్మాణంతో జిల్లాలో 20 వేల ఎకరాలు సాగులోకి రానుంది.
 

మరిన్ని వార్తలు