ఫీజులు మనోళ్లకే

17 Jun, 2014 01:02 IST|Sakshi
ఫీజులు మనోళ్లకే

అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవ నిర్ణయం
ఇతర రాష్ట్రాల్లో చదివే తెలంగాణ విద్యార్థులకూ చెల్లింపు
రాష్ర్టంలో చదివే సీమాంధ్ర విద్యార్థులకు మాత్రం వర్తించదు
కేంద్ర విధానాల మేరకే నిర్ణయం
సంతృప్త స్థాయిలో అమలు చేయాలని కోరిన విపక్షాలు
2వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారుల వెల్లడి
నివేదిక కోరిన సీఎం కేసీఆర్
పోలవరం ముంపు గ్రామాల విద్యార్థుల భవిష్యత్తుపై వైఎస్సార్ కాంగ్రెస్ ఆందోళన
 
 సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగింపుపై తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది. రాష్ర్టంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకూ ఫీజులు చెల్లించాలని సర్కారు నిర్ణయించింది. తెలంగాణలో చదివే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మాత్రం ఈ పథకం వర్తించదని తేల్చి చెప్పింది. గత ప్రభుత్వాల హయాంలో చోటుచేసుకున్న లోపాలను సవరించి మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ఈ సందర్భంగా తీర్మానించింది.
 
 సోమవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశానికి మంత్రులు రాజయ్య, ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, ఎమ్మెల్యే గీతారెడ్డి, టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, బీజేపీ నుంచి కె.లక్ష్మణ్, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లు, ఎంఐఎం నుంచి రిజ్వీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధా తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో 14 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తిస్తుందని, ఫలితంగా రూ.2,500 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 39 వేల మంది ఇతర రాష్ట్రాల (ప్రధానంగా సీమాంధ్ర) విద్యార్థులు తెలంగాణలో చదువుతున్నారని, వీరికి ఏటా రూ. 196 కోట్లు ఫీజుల రూపంలో చెల్లించాల్సి ఉంటుందని వివరించినట్లు సమాచారం. అలాగే దాదాపు 9 వేల మంది తెలంగాణ విద్యార్థులు సీమాంధ్రతో పాటు ఇతర ప్రాంతాల్లో చదువుతున్నట్లు కూడా అఖిలపక్షం దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చదివే విద్యార్థులకే కాకుండా ఇతర రాష్ట్రాలు, జాతీయ స్థాయి విద్యాలయాల్లో చదివే తెలంగాణ విద్యార్థులందరికీ ఫీజుల పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులతో పాటు ఈబీసీ విద్యార్థులకూ ఇది వర్తిస్తుందని చెప్పారు. విద్యార్థులు సమర్పించే ఆదాయ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. దీనికి అఖిలపక్ష నేతలంతా ఆమోదం తెలిపారు.  కేంద్ర ప్రభుత్వ విధివిధానాలకు లోబడి ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఆ రాష్ట్రమే ఫీజులు భరించాలనే ఏకాభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది.
 
 తెలంగాణేతరులకు నో!
 
 తెలంగాణలోని కళాశాలల్లో చదివే సీమాంధ్ర(ఆంధ్రప్రదేశ్) విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఫీజులు చెల్లించడం వీలుకాదని కేసీఆర్‌తో పాటు అన్ని పార్టీల నేతలూ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల స్థానికతను సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా అధికారులు నిర్ణయిస్తారని, హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఇతర రాష్ట్రాల వారందరినీ స్థానికులుగానే పరిగణించాలని కూడా ఈ సందర్భంగా అఖిలపక్షం నిర్ణయించింది.
 
 తెలంగాణలోని కాలేజీలకు ప్రస్తుత సంవత్సరంతో పాటు పాత బకాయిలు కలిపి రూ. 2000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు చెప్పడంతో వాటిని చెల్లించాలని అఖిలపక్ష సభ్యులు ముఖ్యమంత్రికి సూచించారు. ముందుగా కళాశాలలకు ఫీజు బకాయిలు చెల్లించి, అందులో సీమాంధ్ర విద్యార్థులకు సంబంధించిన ఫీజులు ఏమైనా ఉంటే ఆ ప్రభుత్వం నుంచి వసూలు చేయించుకోవాలని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ కోరారు. కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి ఎఫ్‌ఆర్‌సీ నివేదిక, బకాయిలు, చెల్లింపుల వివరాలను అందజేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఇక ఈ పథకాన్ని నీరుగార్చేందుకు రోశయ్య, కిరణ్ ప్రభుత్వాల హయాంలో 18 రకాల ఆంక్షలు పెట్టారని, చివరికి ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకే ఫీజుల పథకం అమలయ్యేలా చూశారని విపక్ష నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆంక్షలు ఎత్తివే సి, సంతృప్త స్థాయిలో ప్రతి పేద విద్యార్థికీ ఫీజు అందించాలని కోరారు.
 
 పైవేట్ కళాశాలలు కన్సార్షియంగా ఏర్పాటై సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే విధానాన్ని టీడీపీ నేత ఆర్. కృష్ణయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. దీనివల్ల పరిణామాలు తీవ్రంగా మారుతాయని, ఈ విధానంలో విద్యార్థులను చేర్చుకునే కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకూడదని కోరారు. ఆయనకు ఇతర పార్టీల నేతలు కూడా మద్దతు పలికారు. మైనారిటీ కళాశాలల విషయంలో మాత్రం మినహాయింపునివ్వాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. కాగా, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని విద్యార్థుల పరిస్థితి ఏంటని అశ్వరావుపేట వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ‘పోలవరం ఏడు ముంపు మండలాల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ మండలాల్లోని వందలాది గ్రామాల్లో ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులు ఎందరో ఉన్నారు. వారికి ఫీజులు చెల్లించేది ఎవరు? 90 శాతం ఎస్టీలే ఉన్న ఈ గ్రామాల్లోని విద్యార్థుల పరిస్థితి ఏంటి?’ అని ఆయన కేసీఆర్‌ని అడిగారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఇప్పటికే ముంపు మండలాల విషయంలో కోర్టుకు వెళ్లామని, మరో నాలుగు రోజుల్లో ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వెళుతున్నామని, త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు.
 
 వైఎస్ నాటి ఫీజుల పథకం అమలు కావాలి:
 జూనియర్ లెక్చరర్ల సంఘం
 
 తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫీజుల పథకాన్ని కొనసాగించాలని ఆయన అక్కడి ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో చదివే విద్యార్థులు ఎక్కడివారైనా రెండు ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి ఫీజులు వర్తింపజేయాలని కోరారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలైన విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో సాచురేషన్ విధానాన్ని అనుసరించాలని రెండు ప్రభుత్వాలకు సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా