ఉపాధికి ‘కారిడార్’

28 Nov, 2014 04:33 IST|Sakshi
ఉపాధికి ‘కారిడార్’

* హైదరాబాద్- నల్లగొండ మధ్య పరిశ్రమల ఏర్పాటుకు సీఎం హామీ
* రెండో దశలో చేపడతామని అసెంబ్లీలో ప్రకటన
* ఫార్మా అనుబంధ పరిశ్రమలకు ఎక్కువ అవకాశం
* ఇప్పటికే 11వేల ఎకరాలను సర్వే చేసిన
* జిల్లా యంత్రాంగం
* అన్నీ అనుకూలిస్తే మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర రాజధానికి సమీపంలోని జిల్లాకు మరో కారిడార్ మంజూరైంది. హైదరాబాద్-నల్లగొండ మధ్య ఇండ స్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. ప్రభుత్వ పరిశ్రమల విధానంలో భాగంగా తెలంగాణలో కారిడార్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, అందులో హైదరాబాద్-నల్లగొండ కారిడార్‌ను రెండో దశలో చేపడతామని ఆయన వెల్లడించారు. సీఎం ప్రకటనతో జిల్లాకు చెందిన ఔత్సాహిక పారి శ్రామికవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, అన్నీ అనుకూలిస్తే ఈ కారిడార్ మూడేళ్లలో పూర్తి కావచ్చని పరిశ్రమల అధికారులంటున్నారు.
 
ఇప్పటికే భూమి చూసేశారు..
వాస్తవానికి మన జిల్లాలో ఫార్మా, సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. సిమెంటు పరిశ్రమలు కృష్ణానది తీరంలో, రాష్ట్ర సరిహద్దులో ఎక్కువగా ఉండగా, హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై చౌటుప్పల్ సమీపంలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. పరిశ్రమల కారిడార్ సీఎం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు ఫార్మా అనుబంధ పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఫార్మా పరిశ్రమ ఇప్పటికే ఉన్నందున దాని అనుబంధ ఉత్పత్తులకు చెందిన పరిశ్రమలతోపాటు హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఔషధ, జూట్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని జిల్లాకు చెందిన పరిశ్రమల శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక  కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో ఎంత భూమి అందుబాటులో ఉందన్న దానిపై రెండు నెలల క్రితం అధికారులు ఓ సర్వే నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ)తో పాటు జిల్లా పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 11వేల ఎకరాలను గుర్తించారు. అయితే, అందులో 3వేల ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉంటాయని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాల్సి వస్తే ఈ భూముల్లో టీఎస్‌ఐఐసీ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అంటే రోడ్డు సౌకర్యం, కరెంటు, ఇతర మౌలిక అవసరాలను సమకూరుస్తుంది. ఆ తర్వాత పరిశ్రమల శాఖ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించి ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తుంది. ఈ పార్కులన్నింటినీ కలిపి ఇండస్ట్రియల్ కారిడార్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మూడేళ్లు పడుతుందని ప్రాథమిక సమాచారం.

మరిన్ని వార్తలు