2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు త్వరలో టెండర్లు

26 Sep, 2014 00:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రానికి 2015 నుంచి 8 ఏళ్ల పాటు 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు నిర్ణయించాయి. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. రెండుమూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి లభించే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి మధ్యకాలిక బిడ్డింగ్ ద్వారా 5 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేయాలని ఆగస్టు 6న ప్రభుత్వం డిస్కంలను  ఆదేశించింది.

అయితే, మధ్యకాలిక బిడ్డింగ్‌లో విదేశీ బొగ్గుపై ఆధారపడిన ప్లాంట్లు మాత్రమే పాల్గొనాలని కేంద్ర నిబంధనలు చెబుతున్నాయి. తద్వారా కంపెనీలు కోట్‌చేసే యూనిట్ ధర అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 8 ఏళ్లకాలానికి అంటే దీర్ఘకాలిక బిడ్డింగ్‌ను పిలవడం ద్వారా దేశీయ బొగ్గుతో నడిచే ప్లాంట్లు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. అందువల్ల విద్యుత్ ధరలను కంపెనీలు తక్కువగా కోట్ చేసే అవకాశం ఉందంటున్నారు. దీంతో 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే టెండర్లను పిలవనున్నారు.

మరిన్ని వార్తలు