మనమే ‘బీర్‌’బలులం

3 Dec, 2017 01:15 IST|Sakshi

బీర్ల విక్రయంలో తెలంగాణ టాప్‌

సాక్షి, హైదరాబాద్‌ :  చలికాలంలోనూ బీరు బాబులు రెచ్చిపోతున్నారు. వేసవి కాలానికి మించి బీర్లను గుటకేస్తున్నారు. బీరు బాబుల తాకిడి పెరగడంతో పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. బీర్ల విక్రయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణే నంబర్‌ వన్‌గా నిలిచినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. సగటున నెలకు 37.5 లక్షల కేసుల బీర్లను మందు బాబులు లాగిస్తున్నారు. అంచనాలకు మించి డిమాండ్‌ పెరగడంతో బీర్ల ఎగుమతులు తాత్కాలికంగా నిలిపేసి.. పక్క రాష్ట్రాల నుంచి రోజుకు 20 వేల కేసుల చొప్పున టీఎస్‌బీసీఎల్‌ దిగుమతి చేసుకుంటోంది.  

6  బ్రూవరీలు.. 6,096 బీఎల్‌ఎస్‌
రాష్ట్రంలో ప్రస్తుతం 6 బ్రూవరీలు (బీరు ఉత్పత్తి పరిశ్రమలు) ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 507.91 లక్షల బల్కు లీటర్ల (బీఎల్‌ఎస్‌) చొప్పున ఏడాదికి 6,096 బీఎల్‌ఎస్‌ల బీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 5,500 బీఎల్‌ఎస్‌లు రాష్ట్రంలోనే వినియోగ మవుతుండగా.. మిగిలిన బీరును పొరుగు రాష్ట్రాలకు టీఎస్‌బీసీఎల్‌ ఎగుమతి చేస్తోంది. ఈ ఏడాది డిమాండ్‌ పెరగడంతో ఎగుమతులు నిలిపేసి పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో 6 గంటలకోసారి వాతావరణంలో మార్పులొస్తున్నా యని.. నవంబర్‌లో పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవడం, రాత్రి 8 వరకు పాక్షికంగా ఉక్కపోతగా ఉండటంతోనే జనం బీర్ల వైపుకు మళ్లినట్లు టీఎస్‌బీసీఎల్‌ భావిస్తోంది.

బీరుతోనే మొదలు..
బీర్ల విక్రయాలు పెరుగుతుండటంతో సామాజిక పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీర్లు తాగేవాళ్లలో 95% యువతేనని, అప్పుడప్పుడే మద్యం అలవాటు చేసుకునే వాళ్లు మొదట బీరు తాగుతున్నట్లు పరిశీలనల్లో తేలినట్లు చెబుతున్నారు. తెలంగాణ పల్లెల్లో యువశక్తి సంవృద్ధిగా ఉందని, అంచనాకు మించి బీర్ల విక్రయాలు పెరుగుతున్నాయంటే యువత తాగుడు వైపు మొగ్గుతున్నట్లు అర్థమని పేర్కొంటున్నారు. గ్రామాల్లో బతుకుదెరువు లేక ఉపాధి కోసం పట్టణానికి వచ్చిన యువత మెల్లగా మద్యం వైపు మొగ్గుతున్నట్లు గమనించామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్‌ తాటి రమేశ్‌ వెల్లడించారు.

వాతావరణ మార్పుల వల్లే..
రాష్ట్రంలో బీర్లకు డిమాండ్‌ ఎక్కువే ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బీర్లు దిగుమతి చేసుకుంటున్నది నిజమే. బీర్ల డిమాం డ్‌ పెరగడానికి హైదరాబాద్‌లో వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు పెరగడం కారణం కావచ్చు.  – దేవీప్రసాద్, టీఎస్‌బీసీఎల్‌ చైర్మన్‌


8 లక్షల మంది.. 13 లక్షల సీసాలు
రాష్ట్రంలో రోజుకు 8 లక్షల మంది 13 లక్షల సీసాల బీర్లు తాగుతున్నట్లు టీఎస్‌బీసీఎల్‌ నివేదికలు చెబుతున్నాయి. ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య 296 లక్షల కేసుల బీర్లు వినియోగమయ్యాయి. గతేడాది విక్రయాలతో పోలిస్తే ఇది 27% అధికం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి పొరుగు రాష్ట్రాల్లో బీర్ల వినియోగం తెలంగాణలో సగం కూడా లేదు. గతేడాదితో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో బీర్ల విక్రయాలు మైనస్‌లో పడిపోయాయి.

రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో బీర్ల విక్రయాలు ఎక్కువగా ఉండి.. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో భారీగా పడిపోతాయి. ఆ సమయంలో విస్కీ, బ్రాందీల వినియోగం పెరుగుతుంది. కానీ ఈ ఏడాది శీతాకాలంలోనూ బీర్ల వినియోగం పెరిగింది. ఎంతగా అంటే..! ఎండలు మండే ఏప్రిల్‌లో 44 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా.. నవంబర్‌లో 36.95 లక్షల కేసులను జనం లాగించారు. కాగా.. టీఎస్‌బీసీఎల్‌ వద్ద నివేదికలు లేవుగానీ బీర్ల విక్రయంలో దేశంలో మనం నంబర్‌ వన్‌ స్థానంలో ఉంటామని ఓ ఎక్సైజ్‌ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.


బీర్ల వినియోగం (లక్షల కేసుల్లో)
రాష్ట్రం              201617    201718    పెరుగుదల(%)
తెలంగాణ           206         261.96       26.89
ఆంధ్రప్రదేశ్‌      114.56       138.67        21.09
తమిళనాడు    162.84       141.55       13.07
కర్ణాటక          144.80       149.88        03.51
కేరళ              88.55         62.84         29.03  


రాష్ట్రంలో బీర్ల వినియోగం (కేసుల్లో.. కేసు=12 సీసాలు)
నెల           201617           201718  
ఆగస్టు      25,86,331       30,81,306
సెప్టెంబర్‌   18,27,103       28,41,557
అక్టోబర్‌    30,15,071       37,67,421
నవంబర్‌   29,20,960      36,97,269

మరిన్ని వార్తలు