విలీనం మా విధానం కాదు: పువ్వాడ

12 Oct, 2019 13:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారని, వారి ఆందోళన అసంబద్ధబమని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని, అది తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చర్చల నుంచి ఏకపక్షంగా వైదొలగి సమ్మెను బలవంతంగా ప్రజలపై రుద్దారని విమర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను తరలించడంలో విజయవంతం అయ్యామని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా 7,358 వాహనాలు నడుపుతున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రభుత్వంపై విపక్షాలు చేసే విమర్శలను ప్రజలు ఈసడించుకుంటున్నారని పేర్కొంటున్నారు.

ఆర్టీసీకి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తప్పుడు ప్రచారం సరికాదని, రూ.4,416 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఆర్టీసీ బతకాలంటే లాభాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్ష పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు. 5 వతేదీ సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉన్నవాళ్లనే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రతిపాదికన మరింత మంది ఉద్యోగులను తీసుకుంటామని, బస్సు సర్వీసులను పెంచుతామని ప్రకటించారు. అన్ని రకాల బస్సు పాస్‌లను అనుమతించాలని ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

విలీనం చేస్తామని అనలేదు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రస​క్తే లేదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పునరుద్ఘాటించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మెరుగైన జీతాలు ఇస్తామని కేసీఆర్‌ హామీయిచ్చారు తప్పా విలీనం చేస్తామని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆర్టిసి కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆర్టీసీ కార్మికులందరూ సమ్మె చేస్తున్నా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులు తిప్పుతున్నందుకు తమ ప్రభుత్వాన్ని అభినందించాలన్నారు. స్కూల్‌, కాలేజీ బస్సులను వినియోగించాల్సిన అవసరం లేదన్నారు.

(చదవండి: దారుణంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌)

మరిన్ని వార్తలు