టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అకౌంట్‌లో డబ్బులు వేస్తామంటూ...

3 Dec, 2018 07:58 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌ ముందు ఉద్రిక్తత దృశ్యాలు (ఇన్‌సెట్‌) పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను చుట్టుముట్టిన కూటమి శ్రేణులు

ముదిగొండ: ముదిగొండ మండలంలో ఎన్నికల ప్రచారానికి ఆదివారం కూటమి మధిర అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క వచ్చారు. మండలంలోని సువర్ణాపురం గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. ఇదే గ్రామంలోకి ఆదివారం ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారు. వారు ఓటర్లు వద్దకు వెళ్ల ఆధార్‌ కార్డ్, బ్యాంక్‌ అకౌంట్, సెల్‌ నంబర్లు సేకరిస్తున్నారు. ‘టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలి. మీ అకౌంట్‌ లో మూడువేల రూపాయలు వేస్తాం’ అని వారు ప్రచారం చేస్తున్నారన్న సమాచారంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తులయ్యారు. ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకుని గట్టిగా నిలదీశారు. టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని.. డబ్బును అకౌంట్‌లో వేస్తామని చెబుతున్న మాట నిజమేనని ఒప్పుకున్నారు.

వారిద్దరినీ, భట్టి విక్రమార్క వద్దకు కాంగ్రెస్‌ కార్యకర్తలు తీసుకెళ్లారు. అప్పటికే, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న భట్టికి విషయం చెప్పారు. భట్టి తీవ్రంగా స్పందించారు. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, అటు నుంచి అటే పోలీస్‌ స్టేషన్‌కు వారిద్దరినీ తీసుకెళ్లారు. వారిద్దరితో పాటు మరో ముగ్గురిపై ఫిర్యాదు చేశారు. ‘‘వీళ్లు ప్రతి గ్రామానికి వెళుతున్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అకౌంట్‌లో డబ్బులు వేస్తామంటూ నంబర్లు తీసుకుంటున్నారు’’ అని, పోలీసులతో కాంగ్రెస్‌ కార్యకర్తలు చెప్పారు. తమ వాళ్లను (టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను) కాంగ్రెసోళ్లు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారన్న సమాచారంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో (స్టేషన్‌కు) వచ్చారు.

బయట బైఠాయించారు. అప్పటికే అక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉన్నారు. దీంతో, ఇరుపక్షాలు పరస్పరం దూషించుకున్నారు, ‘డౌన్‌.. డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. వారిని అక్కడి నుంచి దూరంగా తరిమేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఖమ్మం రూరల్‌ ఏసీపీ రామోజి రమేష్‌ ఆధ్వర్యంలో మగ్గురు సీఐలు, ఐటీబీటీ పోలీసు బలగాలు స్టేషన్‌ చుట్టూ పహరా కాశాయి. నాలుగు గంటలపాటు పోలీస్‌ స్టేషన్‌లోనే భట్టి ఉన్నారు.

ఆయనను వెంటనే బయటకు పంపించాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, డబ్బులు పంచుతామంటూ ప్రచారం చేస్తున్న వారిని (టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను) బయటకు పంపించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు గట్టిగా కేకలు వేశారు. ఈ దశలో ఇరు పక్షాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీలను పైకెత్తి వారిని దూరంగా తరిమేశారు. స్టేషన్‌లో విలేకరులతో భట్టి మాట్లాడారు. ఆ తరువాత, గట్టి బందోబస్తుతో ఆయనను పోలీసులు బయటకు తీసుకొచ్చారు. దీంతో, ఉద్రిక్తత సద్దుమణిగింది. కాంగ్రెస్‌ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు