అమాత్యులెవరో..?

17 Feb, 2019 07:09 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించిన నేపథ్యంలో పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు, రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్న నేపథ్యంలో జిల్లా నుంచి ఎవరు అమాత్యులవుతారు.. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగగా.. ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ హవా కొనసాగింది. జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయగా.. నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధించింది.

ఇందులో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులు విజయం సాధించగా.. టీడీపీ అభ్యర్థులు సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. దీంతో జిల్లాలోని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎవరికి పట్టం కట్టాలనే అంశంపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఒక్కరే విజయం సాధించారు.

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన లావుడ్యా రాములునాయక్‌ టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలం జిల్లాలో రెండుకు చేరిన్నా.. పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్‌కుమార్‌ మాత్రమే గెలిచారు. దీంతో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు మంత్రిగా అవకాశం లభిస్తుందని పువ్వాడ అనుచర వర్గం, పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. 

జిల్లా టీడీపీలో సీనియర్‌ నేతగా ఉండి.. వరుసగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్యను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణలోపు సండ్ర టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. టీడీపీ శ్రేణులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా గత డిసెంబర్‌లో పోటీ చేసేందుకు అనువుగా ఆయన టీటీడీ బోర్డు సభ్యత్వ పదవికి రాజీనామా కూడా చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని పునరుద్ధరించినా.. ఆయన తిరిగి స్వీకరించలేదు. అధికార టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా టీటీడీ బోర్డు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో వెంకటవీరయ్య రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నందున.. టీటీడీ బోర్డు సభ్యత్వం వంటి కీలక పదవిని సైతం వదులుకోవడం.. ఆయనకు తెలంగాణ మంత్రివర్గంలో స్థానంపై భరోసా లభించడమే కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో సండ్ర వెంకటవీరయ్య తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని, కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌తో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు అందలం ఎక్కిస్తాయని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు. దీంతో జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది? అసలు తొలి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం ఉందా? లేదా? అనే అంశంపై రాజకీయ వర్గాలు ఎవరికి తోచిన విధంగా వారు తమ అనుకూల.. ప్రతికూల వాదనలు వినిపిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది.

ఇక సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని.. మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా రాష్ట్రంలో టీడీపీని బలహీన పరచడంతోపాటు శాసనసభలో ఆ పార్టీ తరఫున గళమెత్తే బలమైన నేత లేకుండా అవుతారనే వ్యూహంతో పార్టీ అధిష్టానం పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై ఆచితూచి స్పందిస్తున్న సండ్ర.. భవిష్యత్‌ వ్యూహంపై మాత్రం నోరు మెదపడం లేదని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సానుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వంలో తాము కీలకంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని సండ్ర అభిమానులు వ్యాఖ్యానిస్తుండడం విశేషం. సామాజిక రాజకీయ అంశాలను, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గెలిపించగలిగే సమర్థతను సైతం పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని టీఆర్‌ఎస్‌లోని మరికొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక జిల్లా టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్‌పై సైతం పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు