వక్ఫ్‌ భూములు హాంఫట్‌

29 Apr, 2018 01:15 IST|Sakshi

వేల కోట్ల కుంభకోణం.. సీబీఐతో విచారణ జరిపించాలి

సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ తనిఖీ బృందం

నివేదికలో సంచలన అంశాలు 

భూములను కాపాడటంలో బోర్డు పూర్తిగా విఫలం 

77,677 ఎకరాల్లో 89 శాతం అన్యాక్రాంతం 

హైకోర్టులో 12,628 కేసులు పెండింగ్‌ 

కబ్జా కేసులు ఎదుర్కొంటున్న వారికి వక్ఫ్‌ కమిటీలో చోటు.. అడ్డగోలుగా అద్దెలు, లీజులు 

బోర్డు చైర్మన్‌ సలీం పనితీరు ఏమాత్రం బాగోలేదు

సాక్షి, హైదరాబాద్‌ : వక్ఫ్‌ భూములను కాపాడుకోవడంలో తెలంగాణ వక్ఫ్‌ బోర్డు ఘోరంగా విఫలమైందని సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ సభ్యుల తనిఖీ బృందం దుయ్యబట్టింది. 32,596 మసీదులు, దర్గాలు, ఆషర్ఖానాలు, ఇతర సంస్థలకు సంబంధించి రాష్ట్రంలో 77,677 ఎకరాల వక్ఫ్‌ భూములుండగా.. అందులో 89 శాతం భూములు అన్యాక్రాంతమయ్యాయని పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వక్ఫ్‌ బోర్డులకు సంబంధించి హైకోర్టులో 12,628 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 8 వేల కేసుల విషయంలో వక్ఫ్‌ బోర్డు కౌంటర్లు, అప్పీళ్లు కూడా దాఖలు చేయలేకపోయిందని తెలిపింది. 

రెండు రాజకీయ పార్టీల ప్రమేయంతో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల వక్ఫ్‌ భూముల కుంభకోణం చోటుచేసుకుందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సిఫారసు చేసింది. ఈ మేరకు తనిఖీ బృందం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌కు ఈ నెల 23న నివేదిక సమర్పించింది. కౌన్సిల్‌ సభ్యుడు నౌషాద్‌ నేతృత్వంలోని బృందం ఇటీవల రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులో తనిఖీలు జరిపి నివేదిక రూపొందించింది. వక్ఫ్‌ బోర్డు పనితీరుపై తనిఖీ బృందం అడిగిన ప్రశ్నలకు బోర్డు కమిటీ సభ్యులు హాస్యాస్పద సమాధానాలిచ్చారని పేర్కొంది. వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ మహమ్మద్‌ సలీం పనితీరు ఏమాత్రం బాగోలేదని, ఆయన ఈ పదవికి అనర్హుడని స్పష్టంచేసింది. 

రాష్ట్ర వక్ఫ్‌ కమిటీలోని నలుగురు సభ్యులపై వక్ఫ్‌ భూముల ఆక్రమణకు సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. సాక్షాత్తూ వక్ఫ్‌ బోర్డు చైర్మన్, సభ్యులు నిధులు దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. వక్ఫ్‌ చట్టంలోని 14(డి) నిబంధన ప్రకారం.. సున్నీ, షియా మత గురువులను నియమించాల్సి ఉండగా, వారి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నాయకులను నియమించిందని తప్పుబట్టింది. వక్ఫ్‌ బోర్డుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సూచించింది. 

నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ.. 
– పని తీరు, ఆదాయ వ్యయాలు, సర్వే, వక్ఫ్‌ డీడ్‌లు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఆస్తుల ఆక్రమణలు, వార్షిక నివేదికలను తనిఖీ బృందానికి సమర్పించడంలో వక్ఫ్‌ బోర్డు విఫలమైంది 

– మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీంకు ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు ఇన్‌చార్జి సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. రెగ్యులర్‌ సీఈవో లేకపోవడం వల్ల వక్ఫ్‌ బోర్డు పనితీరుపై ప్రభావం పడింది 

 వక్ఫ్‌ ఆస్తుల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ సైతం 2016లో హైకోర్టులో కేసు వేసింది 

– హైదరాబాద్‌ ఐటీ హబ్‌ పరిధిలో ఉన్న అత్యంత విలువైన వక్ఫ్‌ భూములను అభివృద్ధిపరచడంలో వక్ఫ్‌ బోర్డు విఫలమైంది. ఈ భూములను అభివృద్ధి పరిస్తే బోర్డు వార్షిక ఆదాయంలో 40 శాతం వృద్ధి ఉంటుంది 

– వక్ఫ్‌ బోర్డులోని రెంట్లు, లీజుల విభాగం పనితీరు సందేహాస్పదంగా ఉంది. కమర్షియల్‌ ఏరియాల్లో మార్కెట్‌ విలువతో పోలిస్తే కేవలం 3 శాతం అద్దెతోనే కీలకమైన ఆస్తులను అద్దెకిచ్చారు. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.25,000 అద్దె వచ్చే షాపులను కేవలం రూ.150 అద్దెకు ఇచ్చారు 

– వక్ఫ్‌ బోర్డులో సూపరింటెండెంట్లు, క్లర్కులు, ఆఫీస్‌ సబార్డినేట్, ఇతర పోస్టుల్లో అర్హతలు లేని ఎంతో మంది ఉద్యోగులు పని చేస్తున్నారని మైనారిటీల సంక్షేమ శాఖపై ప్రభుత్వం నియమించిన సభా కమిటీ అసెంబ్లీకి నివేదించింది. వీరిలో కొందరు ఇంకా ఉద్యోగాల్లో ఉండగా, మరికొందరు ఇప్పటికే పదవి విరమణ చెంది ప్రయోజనాలు అందుకుంటున్నారు. కొందరు ఉద్యోగులు పలుకుబడితో తమ బంధువులకు సైతం ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ అభ్యంతరం తెలిపినా.. వక్ఫ్‌ బోర్డు తన స్వయం ప్రతిపత్తిని ఉపయోగించుకొని ఎలాంటి రాత పరీక్ష జరపకుండానే నియామకాలు జరిపింది 

– వక్ఫ్‌ బోర్డులో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పని చేసేందుకు 200 మందికిపైగా ఉద్యోగులను తక్షణమే నియమించాలి. పదవీ విరమణ చేసి ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిని తొలగించాలి. ఉన్న 106 మంది ఉద్యోగుల్లో 60 మంది అటెండర్లు, తొమ్మిది మంది సూపర్‌వైజర్లు. సీనియర్‌ ఉద్యోగులకు కనీసం ఒక లేఖ రాయడం కూడా రాదు. 

– మొహర్రం కోసం ఆషుర్ఖానాలు, ఇమాంబాడలకు వక్ఫ్‌ బోర్డు నిధులు ఇవ్వడం లేదు 

– హైదరాబాద్‌లోని అత్యంత విలువైన వక్ఫ్‌ భూములు, ఆస్తులను తనిఖీ బృందం సందర్శించింది. సికింద్రాబాద్‌లోని కోహే మౌలాలి దర్గాకు చెందిన 384 ఎకరాలు, సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని కొహే ఇమామ్‌ జామిన్‌ దర్గాకు చెందిన రూ.200 కోట్లు విలువ చేసే 210 ఎకరాలు, కార్వాన్‌లోని టోలీ మసీదుకు చెందిన 27.30 ఎకరాలు, చార్మినార్, పత్తర్‌గట్టీలోని ఆషూర్ఖానా నాల్‌–ఏ–ముబారక్‌కు చెందిన 1300 ఎకరాలు, మణికొండలోని దర్గా హుస్సేన్‌ షావలీ దర్గాకు చెందిన 1,654 ఎకరాలు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. శంషాబాద్‌ విమానాశ్రయం కోసం బాబా షర్ఫొద్దీన్‌ పహాడీ దర్గాకు చెందిన 1100 ఎకరాలను సేకరించగా, ఇంకా వక్ఫ్‌ బోర్డుకు ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు.  
 

మరిన్ని వార్తలు