రాష్ట్రంలోనూ 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా! 

25 Dec, 2019 03:13 IST|Sakshi

ఉన్నత విద్యాసంస్థల్లోవచ్చే ఏడాది నుంచి అమలు 

చర్యలు చేపట్టిన ఉన్నత విద్యామండలి 

10 శాతం సీట్లు పెంచికోటా అమలు చేయాలని నిర్ణయం 

 ప్రభుత్వానికి ప్రతిపాదనలుపంపామన్న మండలి చైర్మన్‌ పాపిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) కోటా అమలు చేయడానికి ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఆయా సంస్థల్లో 10 శాతం సీట్లను పెంచి ఈ కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర విద్యా సంస్థల్లో గతేడాది నుంచి ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేస్తున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ).. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2020–21) అన్ని రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో ఈ కోటా అమలు చేయాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 

ప్రభుత్వ కాలేజీలకు ప్రయోజనం 
ఈడబ్ల్యూఎస్‌ కోటా అమల్లోకి వస్తే రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్లు పెరగనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, లా, పీజీ కాలేజీల్లో సీట్లు పెరుగుతాయి. 15 ఏళ్లుగా ఒక్క సీటు కూడా పెరగని ప్రభుత్వ కాలేజీల్లో 10 శాతం సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 300కు పైగా సీట్లు అదనంగా లభిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 14 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 3,071 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

ప్రైవేటు కాలేజీల్లోనూభారీ పెరుగుదల 
కోటా అమలుతో ప్రైవేటు కాలేజీల్లో కూడా భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ నిబంధనను ప్రైవేటు విద్యా సంస్థల్లో అమలు చేయాలా.. వద్దా అనేది సర్కారు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల్లో మొత్తం 6,52,178 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో డిగ్రీలోనే 4,43,269 సీట్లు ఉండగా.. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో 2,08,909 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం డిగ్రీ కోర్సులకు సంబంధించిన సీట్లు సగం కూడా భర్తీ కావడం లేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ సీట్ల పెంపు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇక వృత్తి విద్యా కోర్సుల్లో 10 శాతం సీట్లను పెంచితే అదనంగా 20,890 సీట్లు అందుబాటులోకి వస్తాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా