తెలుగు మహాసభలను అడ్డుకుంటాం

8 Dec, 2017 04:37 IST|Sakshi

విరసం నేత వరవరరావు  

హైదరాబాద్‌: ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభలను అడ్డుకుంటామని విరసం నేత వరవరరావు అన్నారు. కవులు, కళాకారులు, మేధావులు ఈ మహాసభలను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ మహాసభలను వ్యతిరేకిస్తూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు.

అనంతరం వరవరరావు మాట్లాడుతూ పాలకులను వ్యతిరేకించడం అనేది కవులకుండే లక్షణం అని, అందుకే ఈ మహాసభలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 1975లో జలగం వెంగళరావు హయాంలో జరిగిన తెలుగు మహాసభలను కూడా వ్యతిరేకించడం జరిగిందన్నారు. 2012లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నిర్వహించిన తెలుగు మహాసభలనూ వ్యతిరేకించామని.. కేసీఆర్‌తో పాటు నందిని సిధారెడ్డి కూడా ఈ సభలను వ్యతిరేకించారని గుర్తు చేశారు. అప్పుడు ఈ మహాసభలను వ్యతిరేకించిన వారి గొంతులు ఇప్పుడు మెత్తబడ్డాయని అన్నారు.  

సంస్కృతి దోపిడీకే..
దేశంలో ఉన్న సంపదను దోచుకోవడానికే మొన్న పారిశ్రామికవేత్తల సమావేశాన్ని నిర్వహించారని, మన సంస్కృతిని దోచుకోవడానికే ఇప్పుడు మహాసభలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. 1997లో తెలంగాణ లొల్లి అనే సీడీని రూపొందించారని, అందులో సిధారెడ్డి రాసిన ‘నాగేటి చాలల్లో నా తెలంగాణ’అనే పాట కూడా ఉందన్నారు. దాన్ని రూపొందించిన ప్రజాకళామండలి నాయకుడు ప్రభాకర్‌ను ఎన్‌కౌంటర్‌ చేశారంటూ.. ఇది చాలదా ఈ మహాసభలను వ్యతిరేకించడానికి అని ప్రశ్నించారు. గీతాంజలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు, భూపతి వెంకటేశ్వర్లు, సరోజిని బండ, రత్నమాల, సినీ నటుడు కాకర్ల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు