మేము సైతం.. 

30 Jan, 2019 13:27 IST|Sakshi

అమెదక్‌ అర్బన్‌: మెదక్‌ జిల్లాలో ఓటరు నమోదుకు మంచి స్పందన లభిస్తోంది. ఓటరు జాబితాలో పేర్లు లేని వారు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువునిచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని వారు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఒకవైపు గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి ఉండగా ఓటరు నమోదు ప్రక్రియ సైతం ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వపరంగా సంబంధిత దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకితీసుకువచ్చారు.

ఇదిలా ఉండగా వివిధ రాజకీయ పార్టీలు సైతం ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించడానికి ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలో పార్టీల నాయకులు, బాధ్యులు ఓటరు నమోదుకు సంబంధించిన ఫారాలను, మార్గదర్శకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల హడావుడి, అది పూర్తి కాగానే గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో ఓటుహక్కుకోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 4వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 19,993 మంది నూతనంగా ఓటరు లిస్టులో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

నమోదు చేసుకున్న వారిలో 18సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారు. ఓటరు నమోదుపై జిల్లా యంత్రాంగం ఆయా కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం, ఓటు హక్కు విలువ తెలియజేయడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. దీంతో కళాశాలల్లోని యువతీయువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మెదక్‌ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా మొత్తం 3,97,999 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్‌ నియోజకవర్గంలో 1,95,649, నర్సాపూర్‌ నియోజకవర్గంలో 2,02,350 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన నూతన ఓటరు నమోదు ప్రక్రియతో 19,993 మంది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా ఓటు హక్కుకు నూతనంగా నమోదు చేసుకున్నారు. వాటిలో మెదక్‌ నియోజకవర్గం నుంచి 10,757, నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి 9,236 మంది కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఫిబ్రవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రకటించడం జరుగుతుంది.

మరిన్ని వార్తలు