చంద్రముఖి వాంగ్మూలమే ఫిర్యాదు 

30 Nov, 2018 01:15 IST|Sakshi

హైకోర్టు జ్యుడీషియల్‌ రిజిస్ట్రార్‌ వద్ద వాంగ్మూలం ఇవ్వాలి 

దాని ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌ 

పోలీసులకు హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: గోషామహల్‌ నియోజకవర్గం బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి ట్రాన్స్‌జండర్‌ చంద్రముఖి హైకోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాన్నే ఫిర్యాదుగా పరిగణించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని తెలంగాణ పోలీసుల్ని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు భద్రత కావాలని చంద్రముఖి కోరితే ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రముఖిని పోలీసులు గురువారం హైకోర్టు ధర్మాసనం ఎదుట హాజరుపర్చారు. ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన తన కుమార్తె ఈ నెల 27 నుంచి అదృశ్యమైందని, ఆమె ఆచూకీ తెలియజేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ చంద్రముఖి తల్లి మువ్వల అనిత హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ పరిష్కారమైనట్లుగా ప్రకటించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిల ధర్మాసనం గురువారం ప్రకటించింది.

ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించి దౌర్జన్యంగా ఆటో ఎక్కించి తీసుకువెళ్లారని చంద్రముఖి విచారణ సందర్భంగా చెప్పారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వ్యక్తి అదృశ్యానికి సంబంధించినది మాత్రమేనని, దీనితో బెదిరింపులకు సంబంధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతోపాటుగా చంద్రముఖిని బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌ కల్పించుకుని..తనను బెదిరిస్తున్నారని చంద్రముఖి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి చెబుతున్నారని, తీరా అదే విషయంపై వాంగ్మూలం ఇవ్వడం లేదని చెప్పారు. దానికి ధర్మాసనం స్పందిస్తూ.. హైకోర్టు జ్యుడీయల్‌ రిజిస్ట్రార్‌ వద్ద బెదిరింపులు–అదృశ్యం కావడంపై చంద్రముఖి వాంగ్మూలం ఇవ్వాలని, దీని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది.   
 

మరిన్ని వార్తలు