టీవీ9, ఏబీఎన్ ప్రసారాలు నిలిపివేత

17 Jun, 2014 00:15 IST|Sakshi
టీవీ9, ఏబీఎన్ ప్రసారాలు నిలిపివేత

తెలంగాణ సంస్కృతిని కించపరిస్తే సహించం  
భాష, యాసను గౌరవించకుంటే అన్ని చానళ్లకు అదేగతి
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులు, శాసనసభను అగౌరవపరిచేలా ప్రసారాలు చేయడంతోపాటు, ఇక్కడి సంస్కృతిని దెబ్బతీసేలా ఉన్న టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నట్టు మల్టీసిస్టమ్ ఆపరేటర్స్ ఆర్గనైజేషన్ (ఎంఎస్‌ఓ), కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీఓఏ) ప్రతినిధులు ప్రకటించారు. సోమవారం సికింద్రాబాద్‌లో తెలంగాణ రాష్ర్ట ఎంఎస్‌ఓ, సీఓఏ ప్రతినిధుల సమావేశం జరిగింది. అనంతరం ఎంఎస్‌ఓ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కావేటి సమ్మయ్య, పూర్వ అధ్యక్షుడు కులదీప్ సహానీ, నల్లగొండ అధ్యక్షుడు ఏచూరి భాస్కర్, కేబుల్ ఆపరేటర్ల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఈ రెండు చానళ్లు గతంలో శతవిధాలా ప్రయత్నించాయని చెప్పారు.
 
 ఉద్యమ సమయంలో వీటి ప్రసారాల ఫలితంగానే ఎందరో విద్యార్థులు, ఉద్యమకారులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటై కొత్త ప్రభుత్వం వచ్చాక సైతం ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కించపరిచేలా విష ప్రసారాలు చేస్తూ తెలంగాణ  ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసారాలు చేస్తున్నాయని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దళిత మహిళ బొడిగ శోభ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కించపరిచేలా ప్రసారం చేయడం తెలంగాణ ప్రజల మనసును గాయపరిచిందన్నారు. తెలంగాణ ప్రజలను అవమాన పరిచే తరహాలో ఈ రెండు చానళ్లు పనిగట్టుకుని ప్రసారాలు చేస్తుండడంతో గత్యంతరం లేకే వాటి ప్రసారాలను నిలిపేస్తున్నామన్నారు.  ఈ చానళ్ల యాజమాన్యాలు దిగివచ్చి, తమ డిమాండ్లను అంగీకరిస్తేనే ప్రసారాలు పునరుద్ధరిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రసారాలు చేస్తున్న సీమాంధ్ర చానళ్లు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేలా ప్రసారాలు చేయాలని, భాష, యాసను గౌరవించాలని వారు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో సీమాంధ్ర చానళ్లన్నింటికీ ఇదేగతి పడుతుందని వారు హెచ్చరించారు.

 

పాతరేట్లనే చెల్లిస్తాం..
 
 పే చానళ్లకు పాత పద్ధతుల్లోనే చార్జీలు చెల్లిస్తామని ఎంఎస్‌ఓ, సీఓఏ ప్రతినిధులు ప్రకటించారు. కొత్తగా రూపొందించిన చార్జీలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
 

 

 

>
మరిన్ని వార్తలు