టి. ఇంక్రిమెంట్ ప్రత్యేకం..!

14 Aug, 2014 02:17 IST|Sakshi

రూ.300 నుంచి రూ.1000 వరకు చెల్లింపు
2010 పే స్కేలు ఆధారంగా.. వర్తింపు
నాలుగు లక్షల మంది ఉద్యోగులకు లాభం


హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్.. మూలవేతనంలో విలీనం చేయకుండా ప్రత్యేకంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంక్రిమెంట్‌ను మూలవేతనంలో విలీనం చేస్తే.. దాన్ని మరిచిపోతారని, వారికి నెలనెలా వచ్చే వేతన స్లిప్పుల్లో.. తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఉండేలా చూస్తారు. ఈ ఇంక్రిమెంట్‌తో డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ వంటి అలవెన్సులు పొందడానికి అవకాశం లేదని, అలాగే వేతన సవరణ ఒప్పందం జరిగినప్పుడు, ఈ ఇంక్రిమెంట్‌లో పెరుగుదల ఉండదని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగులు పదవీ విరమణ చేసే వరకు వారి పే స్లిప్పుల్లో ప్రతీనెలా తెలంగాణ ఇంక్రిమెంట్ (ప్రస్తుతం నిర్ణయించిన మేరకు మాత్రమే) వస్తుంది. ప్రత్యేక ఇంక్రిమెంట్‌తో నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్దిచేకూరనుంది. తెలంగాణ కోసం ఉద్యోగ సంఘాలు చేసిన సుదీర్ఘ సమ్మెను ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.

ఉద్యోగ సంఘాల పోరాటానికి గుర్తింపుగా ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనివివరించారు. ఉద్యోగులు తాజాగా పొందిన ఇంక్రిమెంట్‌తో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఉంటుందన్నారు.  2010 వేతన సవరణ ఒప్పందం ద్వారా రెగ్యులర్ వేతనం పొందే వారికి ఇది వర్తిస్తుంది. స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, వర్క్‌చార్జ్‌డ్ ఉద్యోగులు, యూనివర్సిటీల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతరులకు కూడా వర్తిస్తుందన్నారు. శాశ్వతంగా తెలంగాణకు కేటాయించే ఉద్యోగులకు కూడా.. వారు తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్టు చేసే తేదీ నుంచి వర్తింప చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఇంక్రిమెంట్ మొత్తం శాశ్వతమని, ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. తెలంగాణ ఇంక్రిమెంట్‌ను పెన్షన్ నిర్ణయంలో పరిగణలోకి తీసుకోరని, ఆగస్టు వేతనం నుంచి ఈ ఇంక్రిమెంట్ అమలులోకి వస్తుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి స్పష్టం చేశారు.

కాగా, ఈ ఇంక్రిమెంట్‌తో దిగువ స్థాయిలోని ఉద్యోగులకు నెలకు రూ. 300, ఉన్నతస్థాయిలోని ఉద్యోగులకు నెలకు రూ.వెయ్యి వరకు అదనంగా వేతనంతోపాటు లభించనున్నట్లు తెలిసింది. ఈ ఇంక్రిమెంట్ కోసం ప్రతీనెలా రూ. 15 కోట్లు వ్యయం అవుతుందని, ఏటా రూ. 180 కోట్లు భారం పడుతుందని అధికారవర్గాలు వివరించాయి.
 

మరిన్ని వార్తలు