టీడీఎల్‌పీ ఫ్లోర్‌లీడర్‌గా బీసీలు పనికిరారా?

10 Jun, 2014 01:50 IST|Sakshi
టీడీఎల్‌పీ ఫ్లోర్‌లీడర్‌గా బీసీలు పనికిరారా?

సీఎంగా పనికొచ్చే వ్యక్తి ఫ్లోర్‌లీడర్‌గా అనర్హుడా: బీసీ సంఘాల ప్రశ్న
 
తలసాని, ఆర్.కృష్ణయ్యలకుటీ టీడీఎల్‌పీలో ఏ పదవులు ఇవ్వని బాబు
ఉప నాయకులుగా రేవంత్, సండ్ర,విప్‌గా ప్రకాశ్ గౌడ్, కోశాధికారిగా మాగంటి
బాబు నిర్ణయంపై తలసాని తీవ్ర అసంతృప్తి
అసెంబ్లీ హాల్లో వెనకాల కూర్చొన్న తలసాని, ఆర్.కృష్ణయ్య

 
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే బీసీ నేత ఆర్.కృష్ణయ్యను సీఎం చేస్తా... ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణలోని బహిరంగసభల్లో చేసిన వాగ్దానమిది. సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని చెపుతూ అక్కడ బీసీ ఓట్లకు గాలం వేశారు. తీరా... తెలంగాణలో టీడీపీ 15 సీట్లు గెలుచుకొని మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో చంద్రబాబు తన వాగ్దానాన్ని పక్కనపెట్టారు. బీసీలకు సీఎం ఇస్తానన్న బాబు టీడీఎల్‌పీ ఫ్లోర్ లీడర్‌ను కూడా ఇవ్వలేదు. తెలంగాణ టీడీఎల్‌పీ నాయకుడి విషయంలో రోజుకోరకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరా సోమవారం రాత్రి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావును ఫ్లోర్‌లీడర్‌గా నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ పదవి కోసం పోటీ పడ్డ బీసీ నేతలైన కృష్ణయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు టీడీఎల్‌పీలో ఏ పదవులు ఇవ్వకుండా దూరం చేశారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లుగా ఎ.రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, విప్‌గా ప్రకాశ్ గౌడ్, కోశాధికారిగా మాగంటి గోపీనాథ్, టీడీఎల్‌పీ కార్యదర్శులుగా జి. సాయన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలను నియమించారు.

నేతల తీవ్ర అసంతృప్తి

పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ సీఎంగా బీసీ నేత ఆర్.కృష్ణయ్యను ప్రకటించిన బాబు ... తీరా ఇప్పుడు పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పనికిరాడన్న విధంగా వ్యవహరించడం ఏమిటని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల బీసీ ఉద్యమంలో ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర ఆర్.కృష్ణయ్యకు ఉందని ఎన్నికల్లో ప్రతిచోటా చెప్పిన బాబు... ప్రతిపక్షంలో ఫ్లోర్‌లీడర్‌గా కూడా వ్యవహరించ లేరని నిర్ధారణకు వచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీఎల్‌పీలో కృష్ణయ్యకు ఏ పదవి ఇవ్వకపోవడం బీసీలను అవమానపరచడమేనని మండిపడుతున్నారు.

ఏ పదవీ వద్దన్న తలసానికి ఉత్తి చేతులే!

చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీకే టీడీఎల్‌పీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఆర్.కృష్ణయ్య కాకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కే ఆ పదవి దక్కుతుందని భావించారు. కానీ శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఎర్రబెల్లిని ఖరారు చేస్తున్నట్లు తలసానికి చెప్పారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనకు ఏ పదవులు వద్దని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పి వెళ్లిపోయారు. ఆయన ఆవేశంలో అన్న మాటలనే ని జం చేస్తూ ఉప నాయకుడి హోదా కూడా ఇవ్వకుండా చంద్రబాబు పక్కన పెట్టారు. కాగా సోమవారం అసెంబ్లీ హాలులో ఆర్.కృష్ణయ్య ఒంటరిగా వెనుక సీట్లలో కూర్చొని తన అసంతృప్తి వ్యక్తం చేయగా, తలసాని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో కలిసి మూడో బెంచీపై కూర్చోవడం గమనార్హం.
 
 

మరిన్ని వార్తలు