తారలు దిగివచ్చిన వేళ..

19 Dec, 2017 02:39 IST|Sakshi

తెలుగు మహాసభల్లో సందడి చేసిన సినీ ప్రముఖులు  

ప్రభుత్వం తరఫున సన్మానించిన గవర్నర్, మంత్రులు

తెలుగును రక్షించేందుకు మహాసభలు తోడ్పడతాయి  

ఇకపై నేను ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుతా: చిరంజీవి

మాతృభాషను రక్షించే ప్రయత్నం అభినందనీయం: మోహన్‌బాబు  

అలరించిన సినీ సంగీత విభావరి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభల్లో సోమవారం సినీ ప్రముఖులు సందడి చేశారు. ఒకరు ఇద్దరు కాదు 40 మందికిపైగా ఒకే వేదికపైకి చేరి అలరించారు. సోమవారం రాత్రి లాల్‌ బహుదూర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘సినీ సంగీత విభావరి’లో సినీ ప్రముఖులు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబు, రాఘవేంద్రరావు, సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, అశ్వినీదత్, రాజమౌళి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, ఆర్‌.నారాయణ మూర్తి, విజయ్‌ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. సినీ దిగ్గజాలతోపాటు గవర్నర్‌ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్‌లు హాజరయ్యారు. తొలుత వేదికపై పలువురు గాయనీగాయకులు ఆ పాత మధురపు పాటలతో ప్రేక్షకులను అలరించారు.

సినీ ప్రముఖులకు సన్మానం
వేదికపై కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, జమున, వెంకటేశ్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రాఘవేంద్ర రావు, బి.నర్సింగ్‌రావు, రాజమౌళి, జయసుధ, ఎన్‌.శంకర్‌లను గవర్నర్, మంత్రులు సన్మానించారు.

తెలుగే మాట్లాడుతా..: చిరంజీవి
సీఎం కేసీఆర్‌ తెలుగు భాషను రక్షించేందుకు ఓ బాధ్యతగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ఆయన సంస్కారానికి నిదర్శనమని చిరంజీవి పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఇంత గొప్పగా సభలు జరుగుతున్నాయంటే దానికి ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషే కారణమని చెప్పారు. తెలుగును సంరక్షిస్తూ ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన ఆలోచనలు ఏ భాష ద్వారా వస్తాయో.. అదే మన మాతృభాష అని పేర్కొన్నారు. ‘‘ఈ మహాసభలకు మంత్రి కేటీఆర్‌ నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. అప్పుడు నేను కేటీఆర్‌ చేసిన అభివృద్ధి పనులను ఇంగ్లిష్‌లో చెబుతూ అభినందిస్తున్నాను. వెంటనే కేటీఆర్‌ స్పందించి.. ‘‘అన్నా.. నేను తెలుగు సభల కోసం మిమ్మల్ని పిలవడానికి వస్తే.. మీరేంటి ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారనడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాను. నిజమే నేను ఆ క్షణంలో సత్యాన్ని గ్రహించాను. ఇకపై అన్ని సందర్భాల్లో తెలుగే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను..’’ అని చిరంజీవి వెల్లడించారు.

కేసీఆర్, కేటీఆర్‌లను సత్కరించాలి...
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే సామెతను గుర్తు చేస్తూ కేసీఆర్‌ ఈ సభలను ఏర్పాటు చేయడం అభినందనీయమని నటుడు మోహన్‌బాబు పేర్కొన్నారు. ఇంగ్లిష్‌ నేర్పించాలని ఒత్తిడి వస్తున్న రోజుల్లో ఈ సభలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన తమను పిలిచి సత్కరించడం నిజంగా అభినందనీయమన్నారు. కేటీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులకుగాను ఆయనను సత్కరించేందుకు సొంతంగా శాలువా తెచ్చానని చెప్పారు. తాను తెచ్చిన శాలువా కప్పి కేటీఆర్‌ను సత్కరించారు.

అలరించిన సినీ సంగీత విభావరి
- కార్యక్రమంలో మహిళా దర్శకురాలు నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ‘బతుకమ్మ’ పాటను ఈ సభల్లో చూపారు. ప్రముఖ యాంకర్లు ఉదయభాను, ఝాన్సీ, సుమలు ప్రధాన భూమిక పోషించిన ఈ పాట బాగా ఆకట్టుకుంది.
- ప్రముఖ దర్శకుడు పైడిపల్లి వంశీ దర్శకత్వం వహించిన ‘హోలీ’ పాటను కూడా చూపారు. అందులో  యువ నటుడు విజయ్‌ దేవరకొండ, మెర్లీన్‌ చోప్రాలు ప్రేక్షకులను అలరించారు.
- దర్శకుడు హరీశ్‌శంకర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణ చరిత్ర’ పాట వీక్షకుల్ని కట్టిపడేసింది. ఈ పాటను తెలంగాణ చరిత్రకు సంబంధించిన చరిత్రకారుల్ని, తెలంగాణలో ప్రాచుర్యం పొందిన ప్రదేశాలను గుర్తు చేస్తూ తీశారు. ఇందులో నటులు మెర్లీన్‌ చోప్రా, లావణ్య త్రిపాఠి, వరుణ్‌తేజ్, రాజ్‌తరుణ్, సింగర్‌ రేవంత్, సాయిధరమ్‌తేజ్, హెబ్బా పటేల్, షాలినీ పాండే, సునీత, సునీల్, చంద్రబోస్‌లు మెరిశారు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు.
-  కార్యక్రమంలో నటులు కాంతారావు, ప్రభాకర్‌ రెడ్డి, శ్రీహరి కుటుంబాలను సత్కరించారు.

మరిన్ని వార్తలు