ఆస్ట్రేలియాలో తెలుగుకు పట్టం

17 Jul, 2020 08:23 IST|Sakshi

స్కూళ్లలో ఆప్షనల్‌గా  తెలుగు భాష  

శాశ్వత నివాసానికి కూడా ప్రామాణికంగా తెలుగు

ఆమోదించిన ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వం

ఇది తెలుగు వారికి గర్వకారణమన్న అసోసియేషన్‌లు

సాక్షి, సిటీబ్యూరో:  విభిన్న సంస్కృతులకు, సాంప్రదాయాలకు నిలయమైన ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషకు అరుదైన గౌరవం లభించింది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలుగు భాషకు పట్టం కట్టింది. అంతేకాకుండా  తెలుగు భాషను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో  5 పాయింట్‌లు  అదనంగా వస్తాయి. చదువులోనే కాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లు శాశ్వత నివాసం కోసం కూడా తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్‌ అక్రిడిటేషన్‌ అథారిటీ ఫర్‌ ట్రాన్సిలేటర్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటర్స్‌ (నాటి) నిర్వహించే పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు 5 పాయింట్లు అదనంగా కలుస్తాయి.

ఇది శాశ్వత నివాసానికి ప్రామాణికం. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో ఉన్న సుమారు లక్ష మందికి పైగా తెలుగు వాళ్లకే కాకుండా ఉన్నత చదువుల కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం  తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్లేవాళ్లకు చక్కటి అవకాశమని ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య వ్యవస్థాపకులు, మీడియా, కమ్యూనికేషన్స్‌ విభాగం కార్యదర్శి మల్లికేశ్వర్‌రావు కొంచాడ హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో తెలుగు భాష గుర్తింపు కోసం తాము చేసిన కృషికి ఫలితం లభించిందని  ‘సాక్షి’తో చెప్పారు. ఇప్పటి వరకు  వివిధ నగరాల్లో ఉన్న తెలుగు అసోసియేషన్‌లు మన పిల్లలకు తెలుగును బోధించేందుకు  ప్రత్యేకంగా ‘మన బడి’వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, ఇక నుంచి ఆ అవసరం ఉండబోదన్నారు.  ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ,తమిళ భాషలకు అక్కడి ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించగా, 4వ భాషగా  తెలుగు  ఆ   గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం. దీంతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ, విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్,సౌత ఆస్ట్రేలియా, తదితర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి ప్రయోజనం లభించనుంది.  

భావి తరాలకు బాటలు....
ఆస్ట్రేలియాలో  తెలుగు  భాషా వికాసం కోసం చాలాకాలంగా అనేక సాహిత్య, సాం స్కృతిక సంస్థలు కృషి చేçస్తూ భావి తరాలకు బాటలు వేస్తున్నాయి.‘తెలుగుమల్లి’ సాహిత్య మాసపత్రిక, ‘భువనవిజయం’ వంటి సాంస్కృతిక సంస్థలు ఈ క్రమంలో  తెలుగు ప్రజల అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. తెలుగు ప్రజల సాంస్కృతిక జీవితాన్ని, చరిత్రను దశదిశలా చాటేలా గత పదేళ్లుగా భువనవిజయం అనేక కార్యక్రమాలను నిర్వహించింది. మరోవైపు వివిధ నగరాల్లో పని చేసే తెలుగు అసోసియేషన్లు ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్యగా ఏర్పడి గత ఆరేడేళ్లుగా తెలుగు భాష గుర్తింపు కోసం అక్కడి కేంద్ర  ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి.  దీంతో విభిన్న సంస్కృతులకు నిలయమైన ఆస్ట్రేలియాలో మన తెలుగు సైతం మరో కలికితురాయిగా నిలిచింది.

2014లో దరఖాస్తు...
‘‘  తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి  2014లోనే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు  అందజేశాం.కానీ అప్పటి జనాభా లెక్కల ప్రకారం మన సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీన్ని సవాల్‌గా తీసుకొని  విస్తృతంగా ప్రచారం చేపట్టాం. తెలుగు వాళ్లనందరినీ ఒక్కటి చేయగలిగాం.సుమారు లక్ష మందికి పైగా ఉన్నట్లు తేలింది. దీంతో తెలుగు భాషకు సమున్నతమైన గుర్తింపు లభించింది.ఇది తెలుగు వారికి ఒక పర్వదినం’’ అని మల్లికేశ్వర్‌రావు చెప్పారు. ఈ కృషిలో  డాక్టర్‌ కృష్ణ నడింపల్లి, శివ శంకర్‌ పెద్దిభొట్ల, వాణి మోటమర్రి తదితరులు కూడా ఉన్నారు. 

మరిన్ని వార్తలు