ఇంటర్‌ కాదు.. టెన్త్‌ వరకే తెలుగు

21 Mar, 2018 02:01 IST|Sakshi
మంగళవారం ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

ఇంటర్‌ వరకు ఓ సబ్జెక్టుగా తెలుగు తప్పనిసరిపై ప్రభుత్వం వెనక్కి

ప్రైవేటు స్కూళ్లలోనూ తెలుగు పండిట్‌ ఉండాలి 

ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు 

అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా బోధించాలనే నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇంటర్‌కు బదులు పదో తరగతి వరకే పరిమితం చేయాలని నిశ్చయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా బోధించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు చేసేందుకు బడ్జెట్‌ సమావేశాల్లోనే చట్టం తెస్తున్నట్లు వెల్లడించారు. మాతృభాష బోధన అమలుకు సంబంధించి తమిళనాడు విధానాన్ని అధ్యయనం చేసి వచ్చిన అధికారులతో కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై రూపొందించాల్సిన విధి విధానాలపై చర్చించారు. 

తొలి దశలో టెన్త్‌ వరకు.. 
‘మాతృభాష తెలుగును రక్షించుకోవడం, మన సంస్కృతిని కాపాడుకోవటం లక్ష్యంగా తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో తెలుగును ఓ సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించాం. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లిష్‌ మీడియంలో చదవడం అందరికీ అనివార్యమవుతోంది. పిల్లల భవిష్యత్తును దెబ్బతీయవద్దు. అదే క్రమంలో తెలుగు కనుమరుగు కావద్దు. అందుకే ఇంగ్లిషు మీడియంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నాం. మొదట ఇంటర్మీడియెట్‌ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించాం. అయితే ఇంటర్‌ (10+2) అన్ని విద్యాసంస్థల్లో ఒకే మాదిరిగా లేదు. దీంతో ఇంటర్‌లో తెలుగును అమలు చేయడం ఇబ్బందిగా మారుతుంది. తమిళనాడు, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో మాతృభాష బోధన అమలును పరిశీలించిన అనంతరం మొదటి దశలో పదో తరగతి వరకు తెలంగాణలో తెలుగును తప్పనిసరిగా సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించాం’అని సీఎం వెల్లడించారు. 

సిలబస్‌ రూపొందించండి 
తరగతుల వారీగా తెలుగులో బోధించాల్సిన అంశాలకు సంబంధించి సిలబస్‌ రూపొందించాల్సిందిగా తెలుగు యూనివర్సిటీ, సాహిత్య అకాడమీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. భాషను కాపాడుకోవడంతోపాటు, మాతృభాష ద్వారా జీవితంలో ఉపయోగపడే విషయాలను విద్యార్థులకు బోధించాలని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశ భక్తిని పెంచే అంశాలు ఉండాలని వివరించారు. తెలుగు చదివే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా ఓ తెలుగు పండిట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను సీఎం ఆదేశించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కె.తారక రామారావు, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రంజన్‌ ఆచార్య, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా డైరెక్టర్‌ జి.కిషన్, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, తెలుగు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఎస్‌.వి.సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, ఎస్‌.ఇ.ఆర్‌.టి. అధికారి సువర్ణ వినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు