అచ్చ తెలుగు లైవ్‌ బ్యాండ్‌

3 Aug, 2019 11:38 IST|Sakshi
రామ్‌ గోపాల్‌ వర్మతో..చౌరాస్తా టీమ్‌

నలుగురు స్నేహితుల సృష్టి

జానపదాలతో దుమ్మురేపుతున్న యువత

నగరంలో సరికొత్త సంస్కృతికి బీజం

నాలుగు రహదారులు కలిస్తే కూడలి.. అదే ‘చౌరస్తా’. నలుగురు కలిసే చోటు కూడా అదే. అక్కడకు చేరితే ఎన్నో ముచ్చట్లు.. మరెన్నో విషయాలు, విశేషాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నగరంలోని ఓ ‘చౌరస్తా’ సంగీత ప్రియుల మనసుదోచుకుంది.. దోచుకుంటూనే ఉంది. సుతిమెత్తని తెలుగు జానపదాలను వినిపిస్తుంది. చైతన్య గీతాలతో రక్తాన్ని పరుగులెత్తిస్తుంది. వర్తమాన కాలంలో మనసులను బాధపెట్టే సంఘటనల పైనా స్పందిస్తుందా కూడలి.. అదే ‘చౌరస్తా’ బ్యాండ్‌. ఈ టీమ్‌ సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో లైవ్‌ మ్యూజిక్‌ను వినిపిస్తూ అచ్చ తెలుగు పదాలతో ఉర్రూతలూగిస్తోంది.  ప్రపంచంలో మేటి సింగర్స్, సంగీతకారులు బ్యాండ్స్‌ నుంచి పుట్టుకొచ్చినవారే. నగరంలోనూ ఒకప్పుడు పబ్స్, స్టార్‌ రెస్టారెంట్స్‌లో మ్యూజిక్‌ బ్యాండ్స్‌ ఉండేవి. కానీ అవి హాలీవుడ్, బాలీవుడ్‌ పాటలు, ఆల్బమ్స్‌కే పరిమితయ్యేవి. ఎక్కడా తెలుగు పాటలకు చోటు ఉండేది కాదు. ఇప్పుడు అందుకు భిన్నం. బ్యాండ్‌ అంటేనే ‘తెలుగు’ అని మారిపోయింది. ఎంతగా అంటే హార్ట్‌రాక్‌ వంటి రెస్టారెంట్లలో సైతం తెలుగు మ్యూజిక్‌ బ్యాండ్‌ బజానే ఉండాలని పట్టుబడుతున్నారంటే మన బ్యాండ్‌ కల్చర్‌కి ఉన్న పాపులారిటీ ఏంటో అర్థంచేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ‘చౌరాస్తా’ బ్యాండ్‌ కూడా భిన్నంగా రెగ్గి మ్యూజిక్‌తో, జాపపద పాటలతోదూసుకెళుతోంది. అంతేకాదు సమాజంలో జరిగేవిషయాలను, సమస్యలను తెలిపేలా సొంతపాటలతో చైతన్యం తీసుకొస్తున్నారు ఇందులోనిసంగీతకారులు తమ చౌరస్తా ప్రయాణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలువారి మాటల్లోనే..     – సత్య గడేకారి

రామ్, శ్రీనివాస్, యశ్వంత్, బాలా.. మేం నలుగురం స్నేహితులం.. ఒకప్పుడు రేడియోలో కలిసి పనిచేశాం. మా అందరివీ వేర్వేరు ప్రాంతాలు. ప్రస్తుతం నలుగురం వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నాం. కానీ అందరికీ సంగీతమంటే ప్రేమతో పాటు దానిపై మంచి పట్టు ఉంది. యశ్వంత్‌ మ్యూజిక్‌ కంపోజింగ్‌ కూడా చేశాడు. రామ్‌ పాటలు రాయడంతో పాటు సింగర్‌ కూడా. వైవిద్యాన్ని, కొత్తదనాన్ని అందించాలని తెలుగు మ్యూజిక్‌ బ్యాండ్‌ ఏర్పాటు చేయాలనుకున్నాం. మా నలుగురితో మొదలైన ఈ ఆలోచన విభిన్న సంగీతాల సంగమంగా ఉండాలనుకున్నాం. అందుకుతగ్గట్టుగా ‘చౌరాస్తా’ అనిపేరుపెట్టాం. హాలీవుడ్‌లో సింగర్‌ బాబ్‌ మార్లే.. తెలుగులో గోరటి వెంకన్న మాకు ఆదర్శం. కానీ మాకు మరింత టీం, ఎక్విప్‌మెంట్‌ అవసరం వచ్చింది.  సోషల్‌ మీడియా ద్వారా మా ఆలోచనలకు దగ్గరగా ఉన్న డ్రమ్మర్‌ అక్షయ్, బేస్‌ గిటారిస్ట్‌ అనంత్‌ మాతో జత కలిశారు. అలా చౌరాస్తా బ్యాండ్‌లైవ్‌ ప్రదర్శనలకు సిద్ధమైంది.

చౌరాస్తా టీమ్‌
మరిన్ని బ్యాండ్స్‌ రావాలి
సినిమా పాటలే కాకుండా వైవిద్యమైన జానపద పాటలను వినేందుకు మా ప్రదర్శనకు ప్రత్యేకంగా ప్రేక్షకులు వస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంటుంది. రైతులు, మహిళలు, సమాజంలో జరిగే సోషల్‌ ఇష్యూస్‌ అవేర్‌నెస్‌ కోసం పాటలు చేస్తున్నాం. మనలో మనం కలిసిసోయే సరికొత్త పాటలను అందించాలన్నదే మా తాపత్రయం. మనదేశంలో మ్యూజిక్‌ బ్యాండ్స్‌ చాలా వరకూ కేవలం సినిమా పాటలకే పరిమితమవుతున్నాయి. అలా కాకుండా భిన్నంగా ప్రాంతాల సంస్కృతి, అక్కడి భాష.. మాండలికాల్లో సొంత సంగీతం పుట్టుకురావాలి. అప్పుడే ఇండియన్‌ బ్యాండ్స్‌కు అంతర్జాతీయ ప్రాచుర్యం వస్తుంది అంటూ ముగించారా మిత్రులు.  

వైవిధ్యం కోసం..
మా బ్యాండ్‌తో కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని అందించాలనే తపనతో ‘రెగ్గి మ్యూజిక్‌’ని స్టార్ట్‌ చేశాం. పలు సినిమా పాటలను కంపోజ్‌ చేసిన తర్వాత మంచి స్పందన వచ్చింది. ఈ ఉత్సాహంలో సరికొత్తగా.. కేవలం సినిమా పాటలే కాకుండా తెలంగాణ జానపదాలు, సొంత ట్యూన్స్‌ను చేశాం. మాకున్న అడ్వాంటేజ్‌ మా టీంలో ప్రొఫెషనల్‌ మ్యూజిక్‌ కంపోజర్లు, రైటర్లు, సింగర్లు ఉన్నారు. అందరికీ అర్థమయ్యేలా సాహిత్యం, సంగీతం సింపుల్‌గా ఉండేలా పాటలను ప్లాన్‌ చేశాం. దీంతో సినిమా పాటలతో పాటు, జానపదాలు, సొంతంగా భిన్నమైనరీతిలో రూపకల్పన చేసిన పాటలకు మ్యూజిక్‌ లవర్స్‌ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రైతులు, పల్లెటూరి అందాలు, యువత, స్నేహం, జీవితం, సమాజంలో మనం చూస్తున్న మానవీయ కోణాలను పరిగణలోకి తీసుకొని పాటలు చేస్తున్నాం. గోరటి వెంకన్న పాటలను పాడాం. ఆయన కొన్ని సలహాలు–సూచలను ఇచ్చారు. నగరంలోని ప్రముఖ పబ్స్, రెస్టారెంట్స్‌లో మా ప్రదర్శనలు ఇచ్చాం. కార్నివాల్స్, కాలేజ్‌ డేస్‌కు కూడా ప్రదర్శనలు చేశాం.

చౌరస్తా టీమ్‌ ఇదీ..
యశ్వంత్‌నాగ్‌ : కీబోర్డ్, సింగర్‌
రామ్‌ మిర్యాల: ప్లూట్, సింగర్‌
బాల           :  సింగర్‌
శ్రీనివాస్‌     :   గిటారిస్ట్‌
అనంత్‌    :   బేస్‌ గిటారిస్ట్‌
అక్షయ్‌ ఆత్రేయ :డ్రమ్మర్‌

మరిన్ని వార్తలు