ఇంద్రగంటి కన్నుమూత

26 Jul, 2019 01:27 IST|Sakshi

అనారోగ్యంతో శ్రీకాంతశర్మ తుదిశ్వాస 

సాహితీవేత్తగా,అభ్యుదయ కవిగా తెలుగు సాహిత్యంపై ముద్ర 

రచయితగా, సంపాదకునిగా జర్నలిజంలోనూ రాణింపు

హైదరాబాద్‌ : దాదాపు నాలుగున్నర దశాబ్దాలు సాహిత్య, పత్రికా రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖ రచయిత, కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లోని ఆయన స్వగృహంలో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులతోపాటు బంధువులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వెంకటరత్నమ్మ దంపతుల మూడో కొడుకు శ్రీకాంత శర్మ. విజయవాడలో చాలా కాలంపాటు ఆయన జర్నలిస్టుగా పనిచేశారు. ఇంద్రగంటి భార్య ప్రముఖ రచయిత్రి జానకీబాల, కొడుకు ప్రముఖ సినీ దర్శకులు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ. కాగా, బంధువులు, సన్నిహితుల సమక్షంలో గురువారం సాయంత్రం అల్వాల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీనటులు నరేష్, తనికెళ్ల భరణి, షఫి, పవిత్రలోకేష్, సాహిత్య రంగ ప్రముఖులు శ్రీరమణ, పతంజలిశాస్త్రి, సుధామ, శారదాశ్రీనివాస్‌ తదితరులు ఇంద్రగంటి పార్థివ దేహం వద్ద నివాళులర్పించి, మోహన్‌కృష్ణ, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

అభ్యుదయ కవి, సాహితీవేత్త.. 
1944 మే 29న జన్మించిన ఇంద్రగంటికి.. తండ్రి హనుమత్‌ శాస్త్రి సుప్రసిద్ధ కవి కావడంతో సహజంగానే సాహిత్యం ఒంటబట్టింది. విద్యార్థి దశనుంచే ఆయన రచనావ్యాసాంగాన్ని చేపట్టారు. చిన్నవయసులోనే అభ్యుదయ కవిగా ప్రసిద్ధులయ్యారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్‌ఎడిటర్‌గా పనిచేశారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. రేడియోలో నాటికలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలకు ప్రాణం పోశారు. ఆ తర్వాత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకులుగా కూడా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పనిచేశారు. ఇటీవలే ఆయన ’ఇంటిపేరు ఇంద్రగంటి’పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. గత యాభై సంవత్సరాల్లో తానెరిగిన సాహిత్య జీవితాన్ని, అలాగే తన కుటుంబ విశేషాలను, రచయితగా తన అనుభవాలను కలగలిపి ఈ ఆత్మ కథ రాసి 2018 జనవరిలో విడుదల చేశారు.

దాదాపు నాలుగున్నర దశబ్దాల సాహితీ ప్రస్థానంలో కవిత్వం, విమర్శలు, నాటకాలు, నవలలు 20కిపైగా పుస్తకాలు రాశారు. రచయితగా, కవిగా, పాత్రికేయుడిగా, సంపాదకులుగా ఆయన సాహిత్యరంగంలో చేసిన సేవలకుగాను పలు జాతీయ స్థాయి పురస్కారాలు, వివిధ సంస్థల నుంచి అవార్డులను అందుకున్నారు. తెలుగు సాహిత్యంలో గుడిపాటి వెంకటాచలం, కృష్ణశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీశ్రీ, బుచ్చిబాబు, బాల గంగాధర్‌ తిలక్, విశ్వనాథశాస్త్రి, అజంతా రచనలతో ఆయన బాగా ప్రభావితమయ్యారు. ‘ఈ ప్రపంచంలో సర్వవిశ్వాసాలకి, చర్యలకి, వ్యక్తి కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్‌ కావచ్చు, సిన్నర్‌ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం అయితే ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యమే. అందుచేత సాహిత్య పఠనం, రచనా వ్యాసంగంలోకి మనసు పెట్టే వాళ్లు, తమ మనసులకుండే కిటికీలు తెరిచిపెట్టడం అవసరం. పాత విశ్వాసాలు కొట్టుకుపోవాల్సి రావచ్చు. కొత్త విశ్వాసాలు దూసుకురావచ్చు. మనసులోకి వెలుతురుతాకే అవకాశం ముఖ్యం. దాన్ని మూసి పెట్టకూడదు’అని ఓ సందర్భంలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ చేసిన ప్రతిపాదన నేటి రచయితలకు ఓ దీపస్తంభం లాంటిది.  

నెలవంక నుంచి సమ్మోహనం వరకు 
శ్రీకాంత శర్మ 20కి పైగా సినిమాలకు పాటలు కూడా రాశారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ’నెలవంక’చిత్రంలో 6పాటలు రాశారు. ఇందులో ’ఏది మతం’పాటకు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నారు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే ’పుత్తడిబొమ్మ’సినిమాకు రెండు పాటలు, ’రావు–గోపాల్రావు’చిత్రంలో ఓ పాట రాశారు. ’కృష్ణమూర్తి కుక్కపిల్లలు’అనే టెలీఫిలిం కోసం ఓ పాట రాశారు. తనయుడు మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ’గోల్కొండ హైస్కూల్‌’సినిమాలో ’ఏనాటివో రాగాలు’పాటను, ‘అంతకు ముందు ఆ తర్వాత’చిత్రంలో ’నా అనురాగం’పాటను, ’సమ్మోహనం’లో ’మనసైనదేదో’పాటను రాశారు. 74 సంవత్సరాల వయసులో ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ ’సమ్మోహనం’కోసం ఆయన రాసిన ఫుల్‌ రొమాంటిక్‌ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంది.  

మరిన్ని వార్తలు