తెలుగుకు పట్టం కట్టండి

12 Jun, 2019 01:27 IST|Sakshi

ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి 

ఉపాధ్యాయులకు వర్క్‌షాపులు, శిక్షణపై దృష్టి  

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ నందిని సిధారెడ్డి  

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగు భాషకు పట్టం కట్టాలని, అందులో భాగంగా నేటి నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్న దృష్ట్యా ప్రతి స్కూల్లో పిల్లలు తెలుగు భాషను తప్పనిసరి నేర్చుకునేవిధంగా ప్రోత్సహించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ నందిని సిధారెడ్డి సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకూ తెలుగును తప్పనిసరిగా చదవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీతో కలసి తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త కార్యాచరణ చేపట్టింది. గతేడాది నుంచి అన్ని స్కూళ్లలో తెలుగు అమలు దిశగా రెండు సంస్థలు దృష్టి సారించాయి. తెలంగాణ ప్రజల భాష, సాహిత్యం, చారిత్రక, సాంస్కృతిక జీవితం ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలనే లక్ష్యంతో తెలుగును తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఆ లక్ష్యం అన్ని పాఠశాలలకు చేరుకునేవిధంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ నందిని సిధారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు పిల్లలకు తెలుగు నేర్పించే ఉపాధ్యాయుల కోసం ఎస్‌సీఈఆర్‌టీతో కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను, వర్క్‌షాపులను నిర్వహించనున్నట్లు చెప్పారు.
 
‘తెలుగు తప్పనిసరి’కి అడుగులు ఇలా 
ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించింది. కానీ ఇంటర్మీడియెట్‌ స్థాయిలో అమలుపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. తమిళనాడులో పదో తరగతి వరకే తమిళం తప్పనిసరి భాషగా అమలు కావడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కూడా ఒకటి నుంచి పదోతరగతి వరకు పరిమితం చేశారు. తెలుగు భాషేతరుల కోసం ఎస్‌ఈఆర్‌టీ గతేడాది ఒకటి, ఆరోతరగతి పాఠ్యపుస్తకాలను ముద్రించి అందజేయగా, ఈ ఏడాది రెండు, ఏడో తరగతులకు కూడా అందజేశారు. ‘‘తెలుగు అమలు తీరును పర్యవేక్షించేందుకు గతేడాది నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాం, కొన్ని స్కూళ్లు మినహా చాలా వరకు తెలుగును తప్పనిసరి చేశాయి. కేంద్రీయ విద్యాలయ వంటి విద్యాసంస్థల్లో మాత్రంపై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా అమలు చేయనున్నట్లు చెప్పారు’’అని సిధారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. 

పాఠ్యపుస్తకాల్లో ఏముంది?
హిందీ, కన్నడం, తమిళం, మరాఠీ వంటి ఇతర మాతృభాషల విద్యార్థులు కూడా తెలుగు నేర్చుకొనేందుకు వీలుగా వర్ణమాల, గుణింతాలు, ఒత్తులు, చిన్న చిన్న పదాలతో పుస్తకాలను ముద్రించారు. ఏడో తరగతి స్థాయిలో చిన్న చిన్న గేయాలను పరిచయం చేశారు. తెలంగాణ సంస్కృతి, పండుగలు, ఆచార సాంప్రదాయాలు, తెలంగాణ కళలను కూడా పరిచయం చేయనున్నట్లు సిధారెడ్డి తెలిపారు. 2023 నాటికి ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తిస్థాయిలో తెలుగు అమలులోకి వస్తుందన్నారు. ‘‘తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పించడాన్ని ఒక బాధ్యతగా భావించాలి. ఏ ప్రాంతం వారైనా సరే ఇక్కడి వారైనప్పుడు ఈ ప్రాంత ప్రజల భాషలోనే మమేకం కావడం వల్ల మానవసంబంధాలు బలపడు తాయి. అందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీ స్కూళ్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేసేందుకు సిద్ధంగా ఉంది’’అని చెప్పారు. 

మరిన్ని వార్తలు