ఐక్యంగా ముందుకు సాగుదాం

14 Oct, 2019 09:22 IST|Sakshi
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న నాయీ బ్రాహ్మణులు

సాక్షి, హైదరాబాద్‌: ఐక్యమత్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని నాయీ బ్రాహ్మణ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆబిడ్స్‌లోని జయ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో జరిగిన దసరా ఆత్మీయ సమ్మేళనంలో నాయీ బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

నాయీ బ్రాహ్మణులు ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల్లో తమకు సరైన అవకాశాలు దక్కడం లేదని, తమ వాటా తమకు ఇవ్వడం లేదని వాపోయారు. ఎన్నికల్లోనూ బీసీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ వర్గీకరణ కోసం న్యాయ పోరాటం చేస్తూనే, రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకోస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని కోరారు. తమను అత్యంత వెనుకబడిన బలహీన వర్గాల జాబితాలో చేర్చాలని జస్టిస్‌ రోహిణి కమిషన్‌కు వినతులు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నాయీ బ్రాహ్మణులు తమ సంఘీభావం తెలిపారు.

25న ధన్వంతరి జయంతి వేడుకలు
వైద్య వృత్తికి ఆదిదేవుడు, నాయీ బ్రాహ్మణుల కులదైవమైన ధన్వంతరి జయంతి వేడుకలను ఈ నెల 25న నిర్వహించనున్నామని డాక్టర్‌ బీర్ఆర్‌కేఆర్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌. సారంగపాణి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసి నాయీ బ్రాహ్మణుల ఐక్యతను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ధన్వంతరి స్ఫూర్తితో అన్ని రంగాల్లో ముందుడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. తమ సంఘీయుల మధ్య సృహృద్భావ సంబంధాలు ఏర్పాలడాలన్న ఉద్దేశంతో దసరా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్‌, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేంద్రచంద్ర, కె. వెంకటేశ్వరరావు, జి. అశోక్‌, గంగాధర్‌, సీఎల్‌ఎన్‌ గాంధీ, రామానందస్వామి, నాగన్న, మద్దికుంట లింగం, సీనియర్‌ కార్టూనిస్ట్‌ నారూ, రాపోలు సుదర్శన్‌, వెంకట్రాయుడు, సూర్యనారాయణ, బాలరాజు, ధనరాజ్‌, శ్రీధర్‌, రాజేశ్‌, పసుపుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు