ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు

25 Sep, 2019 05:31 IST|Sakshi
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న హరికృష్ణ, సౌజన్య, శీతల్‌రెడ్

తెలంగాణకు మూడు, ఏపీకి నాలుగు అవార్డులు

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ సేవా పథకం ద్వారా అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు, వలంటీర్లు రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డు గ్రహీతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి శ్రేయస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారి ఎం.శీతల్‌రెడ్డి, వర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌కు చెందిన వలం టీర్లు మెంత్రి సౌజన్య, వి.హరికృష్ణ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు.

ఏపీ నుంచి నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ కోఆరి్డనేటర్, ప్రస్తుతం డిప్యుటేషన్‌పై రాష్ట్ర సచివాలయంలో స్టేట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డా.రమేష్‌రెడ్డి, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆదిరెడ్డి పరదేశి నాయుడు పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీ హిందీ విభాగానికి చెందిన వాలంటీర్‌ బందుల మహేంద్రనాథ్, ట్రైనింగ్‌ ఓరియెంటేషన్‌ సెంటర్‌కు చెందిన వాలంటీర్‌ కొటికలపూడి జగదీశ్వరి అవార్డులు దక్కించుకున్నారు.

అవార్డు స్ఫూర్తిని నింపింది..
ఈ అవార్డు ఎంతో స్ఫూర్తిని నింపిందని, ప్రజలకు ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో 44 వేల మంది ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు ఉంటే అవార్డు దక్కించుకున్న 10 మందిలో తాను ఉండటం ఆనందాన్ని ఇచ్చిందని ఆదిరెడ్డి పరదేశి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు