తెలుగుపై మమకారం.. సామాజిక రుగ్మతలపై చైతన్యం

5 Jul, 2019 11:37 IST|Sakshi
సినారేతో ప్రశంసపత్రం అందుకుంటున్న ఖాజామైనొద్దీన్‌ (ఫైల్‌)

తెలుగు సాహిత్యంలో రాణిస్తున్న ఖాజామైనొద్దీన్‌

వివిధ కవి సమ్మేళనాల్లో కవితాగానం

పలు సంస్థలతో సత్కారాలు, బహుమతులు

సామాజిక మార్పు లక్ష్యం 

సాక్షి, మహబూబ్‌నగర్‌ : సామాజిక రుగ్మతలు వెలుగు చూసినా.. అమానవీయ సంఘటన జరిగినా.. వాటి కుళ్లును తన కవితల ద్వారా ఇట్టే కడిగేస్తారు కవి ఖాజామైనొద్దీన్‌.. తెలుగు భాష కవి సమ్మేళనాలు ఎక్కడ జరిగినా తన కవితాగానంతో భాషాభిమానుల హృదయాలను చూరగొంటున్నారు.. వివిధ రాష్ట్రాల్లో పలు సంస్థలు నిర్వహించే తెలుగు, ఇంగ్లిష్, హిందీ సాహిత్య సభల్లో అనువాదకుడిగా పాల్గొంటూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు. 

జిల్లాకు చెందిన ప్రముఖ కవులు నరసింహమూర్తి, వల్లభాపురం జనార్దన, సోదరుడు మహమూద్‌ల స్ఫూర్తితో కవిగా రాణిస్తున్నాను. మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని చవిచూశాను. సామాజిక మార్పే లక్ష్యంగా రచనలు రావాలి. సాహిత్యరంగం ద్వారా నేటికీ సేవ చేయడం గర్వంగా భావిస్తున్నాను. త్వరలో మరో తెలుగు కవితా సంపుటిని వెలువరిస్తాను. 
– ఖాజామైనొద్దీన్, కవి 

కుటుంబ నేపథ్యం.. 
పెబ్బేరు మండల కేంద్రానికి ఖాజామైనొద్దీన్‌ తన విద్యాభ్యాసం పెబ్బేరు, వనపర్తి, మహబూబ్‌నగర్‌లో పూర్తి చేసుకున్నారు. బీఎస్సీ పూర్తి చేసిన ఆయన హిందీ విద్వాన్‌లో పాసై టీటీసీలో శిక్షణ పొందిన అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకమై 2014లో రిటైర్డ్‌ అయ్యారు. సాహిత్యసేవను ప్రవృత్తిగా మార్చుకొని కవిత్వంపై ఉన్న ఉత్సాహంతో కవిగా, రచయితగా ఎదిగి కవి సమ్మేళనాల్లో పాల్గొని తనదైన బాణిలో కవితాగానం చేస్తూ సాహిత్యాభిమానుల మన్ననలు పొందుతున్నారు. 

బహుమతులు, సన్మానాలు..
ఖాజామైనొద్దీన్‌ కవితలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందడమే కాకుండా అనేక మ్యాగజైన్లు, పత్రికల్లో ప్రచురించబడ్డాయి. విద్యార్థి దశలో రచించిన కవితలకు నగదు బహుమతులు, ప్రశంసపత్రాలు లభించాయి. పాలమూరు గోస, పాలమూరు కవితలు అనే సంకలనాల్లో కొన్ని చోటు దక్కించుకున్నాయి. 

  • 1972లో పాఠశాల స్థాయిలో మినీ కథను రాసి ప్రథమ బహుమతి అందుకున్నారు. 
  • 1973లో జూనియర్‌ కళాశాల స్థాయి మ్యాగజిన్‌లో మొదటి కవిత ప్రచురణ అయ్యింది. 
  • 1977లో డిగ్రీలో ఖాజామైనొద్దీన్‌ సంపాదకత్వంలో పత్రిక విడుదల చేశారు. 
  • 1978లో    ఉపాధ్యాయ    శిక్షణ కళాశాలలో నిర్వహించిన    కవితలలో మొదటి బహుమతి దక్చించుకున్నారు. 
  • 2006లో పాలమూరు జిల్లాతోపాటు హైదరాబాద్, కర్నూలు, కృష్ణ, ఖమ్మం, వరంగల్, విజయనగరం, కడప జిల్లాల్లో జరిగిన కవి సమ్మేళనాలకు హాజరై ప్రతిభచాటారు. 
  • 2008    హర్యానా  రాష్ట్రంలోని అంబాలలో నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలోనూ పాల్గొన్నారు. 
  • 2009 నాగార్జునసాగర్‌లో నిర్వహించిన సజన సంగమం కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే భువనేశ్వర్, వార్దా, చెన్నైలో జరిగిన ఇంటర్నేషనల్‌ రైటర్స్‌ ఫెడరేషన్‌ సదస్సుల్లో పాల్గొన్నారు.
  • డెహ్రడూన్‌లో జరిగిన లాంగ్వేజెస్‌ ట్రాన్స్‌లేషన్‌ సెమినార్‌ వారి వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పలు రాష్ట్రస్థాయి తెలుగు సమ్మేళనాల్లో పాల్గొన్నారు. 
  • 2014లో ‘చెమట ప్రవాహమై పారినా’ కవితా సంపుటిని రచించారు. హైదరాబాద్‌లో ప్రసిద్ధ రచయిత సినారేచే ప్రశంసాపత్రం అందుకున్నారు. 
  • 2016లో చత్తీస్‌గడ్‌ రాష్ట్రం దుర్గ్, 2017లో విశాఖపట్నంలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. 
  • 2017లో కరీంనగర్, అనంతపూర్‌లలో జరిగిన గిన్నిస్‌ రికార్డు కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితాగానాన్ని వినిపించారు. 
  • 2018లో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో, బెంగుళూర్‌లో జరిగిన ఇండోఏషియన్‌ అకాడమీ శతాధిక కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ ఏడాదిలో పలుచోట్ల జరిగిన కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితలు వినిపించారు. ప్రస్తుతం తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.  
మరిన్ని వార్తలు