పన్ను వసూళ్లలో భేష్‌

25 Jul, 2019 03:07 IST|Sakshi
ఆదాయ పన్ను శాఖ 159వ ఆవిర్భావ కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ ఇన్‌కంట్యాక్స్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ శంకరన్, నల్సార్‌ వర్సిటీ వీసీ ఫైజల్‌ ముస్తఫా తదితరులు

దేశంలో ఐదో స్థానంలో తెలుగు రాష్ట్రాలు  

ఏపీ, తెలంగాణ ఇన్‌కంట్యాక్స్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ శంకరన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నాయని ఏపీ, తెలంగాణ ఇన్‌కంట్యాక్స్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ శంకరన్‌ వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ 159వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శంకరన్‌ మాట్లాడుతూ, దేశంలో ఆర్థిక వనరులు పెరగాలన్నా.. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో భారత్‌ పోటీ పడాలన్నా.. నిజాయతీగా పన్నులు చెల్లించాలని ప్రజలకు సూచించారు. దేశంలో ప్రతీ పౌరుడు నిజాయతీగా, సులువుగా పన్నులు చెల్లించేందుకు వీలుగా సాంకేతికతను వాడుకుంటున్నామని చెప్పారు. ఈఫైలింగ్‌కు అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు.

2018–19 ఏడాదిలో 6.68 కోట్ల ఈఫైలింగులు రావడమే దీనికి నిదర్శనమని అన్నారు. దీన్ని మరింత సులభతరం చేస్తామని చెప్పారు. ప్రత్యక్ష పన్నుల విషయంలో దేశంలో గణనీయ వృద్ధి నమోదవుతోందని తెలిపారు. 2014–15లో రూ.6.95 లక్షల కోట్లు పన్ను రూపంలో వసూళ్లవగా 2018–19లో అది రూ.11.37 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. రూ.4.41 లక్షల కోట్ల అభివృద్ధితో 63.5 శాతం వృద్ధి రేటు నమోదవ్వడం విశేషమని కొనియాడారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణల్లో వృద్ధి రేటు కూడా బాగుందన్నారు. 2014–15లో వృద్ధి రేటు రెండు రాష్ట్రాల నుంచి రూ.31,762 వేల కోట్లు ఉండగా, 2018–19 వరకు అది రూ.52,040 కోట్లకు చేరిందని తెలిపారు. ఐదేళ్లలో 82 శాతం వృద్ధి నమోదు చేయడం రికార్డని కొనియాడారు.

దేశంలో ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ తరువాత తెలుగు రాష్ట్రాలు దేశానికి ఆదాయం ఇవ్వడంలో ఐదో స్థానంలో నిలిచాయని ప్రశంసించారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరుగుతుండటం దేశానికి శుభసూచకమని అన్నారు. ఐఏఎస్‌కు ఎంపికైన అంధ ఉద్యోగి కట్టా సింహాచలాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ డీజీఐటీ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ ఆర్‌.కె.పల్లికల్, డి.జి.ఇన్వెస్టిగేషన్‌ ఆర్‌.హెచ్‌.పాలీవాల్, చీఫ్‌ కమిషనర్‌ శ్రీ అతుల్‌ ప్రణయ్, నల్సార్‌ యూనివర్సిటీ వీసీ ఫైజల్‌ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.  అనంతరం పన్ను చెల్లింపులో అగ్రస్థానంలో నిలిచిన పలు కంపెనీలకు అవార్డులు అందజేశారు. 

మరిన్ని వార్తలు