ఇలా  చేద్దాం...!

15 Dec, 2017 03:28 IST|Sakshi

వలస పాలన నుంచి విముక్తి చెందిన మనం ఇంగ్లిష్‌ ఆదిపత్య ప్రభావం నుంచి బయటపడితే తప్ప తెలుగు సంపూర్ణ వికాసం చెందదు. ఇలా చెప్పడం అంటే, ఇంగ్లిష్‌ను అంటరాని భాషగా దూరం పెట్టి మడికట్టుకోమని కాదు. ప్రాథమిక స్థాయిలో తల్లి భాషలో విద్యాబోధన జరుపుతూ, తదనంతరం ఆంగ్లం నేర్పించాలి. దేశమేదయినా.. స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నిక గన్న మేధావుల్లో అత్యధికులు అలా వచ్చినవారే. ఆంగ్లంలో సాధించే ప్రావీణ్యం తెలుగును పణంగా పెట్టి కావొద్దు. రెండో ప్రాధాన్యతతోనే ఇంగ్లిష్‌ నేర్చుకోవాలి. ప్రపంచీకరణ రోజుల్లో అదంత తేలిక కాకపోవచ్చు. కష్టమైనా అదే జరగాలి, అప్పుడే తెలుగు బతుకుతుంది. ప్రభుత్వాలు పూనిక వహిస్తే అసాధ్యమేమీ ఉండదు.

అన్ని కాలాల్లోనూ భాషను బతికించడం, వృద్ధి పరచడంలో పౌర సమాజంతోపాటు పాలకులదే ప్రధాన పాత్ర. రాజరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య పాలన వరకు ఇదే జరుగుతోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ఆ మేరకు సంకల్పం ఉంటేనే తెలుగు భాషాభివృద్ధికి అండ. ఓట్ల రాజకీయాలకు పెద్దపీట వేస్తున్న ఈ రోజుల్లో ఎవరు ఒత్తిడి తెచ్చారని రాష్ట్రంలో ఇంతపెద్ద తెలుగు పండుగ జరుపుతున్నారు? సంకల్పం అంటే ఇదే! కానీ, ఆచరణలో లోపాలున్నాయి. సభా వేదిక వద్ద ‘మీడియా మీటింగ్‌ హాల్‌’ అని ఆంగ్లంలో తాటికాయంత అక్షరాలతో రాయడమే పరభాషా అనుచిత ప్రభావం. ఇది రాష్ట్రమంతా ఉంది. అన్ని నామఫలకాలదీ అదే గతి. ఒకోసారి తెలుగే ఉండదు. ఆశించే మార్పు ప్రభుత్వం నుంచి మొదలవాలి. పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాలు తల్లిభాషను పకడ్బందిగా అమలు పరుస్తాయి. రాయితీ కొనసాగిస్తూ సినిమా పేరు ‘రోబో’ అనుమతించాలన్న ప్రముఖ నటుడు రజనీకాంత్‌ విజ్ఞప్తిని తమిళ ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇతర భాషలో అయినా ‘రోబో’గానే విడుదలయిన ఆ సినిమా తమిళనాట మాత్రం ’యెన్తిరన్‌’ (యంత్రం)గా విడుదలయింది. అదీ భాష పట్ల కచ్చితత్వం. అదుండాలి.    
..: దిలీప్‌రెడ్డి

మరిన్ని వార్తలు