‘ఉక్క’రిబిక్కిరి 

27 May, 2019 07:34 IST|Sakshi

ఖమ్మంవ్యవసాయం: ఈ వేసవి కాలంలో గత కొద్దిరోజులుగా ఎండలు తీవ్రస్థాయికి చేరి..చెమటలు పట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతుండడంతో కనీసం ఇళ్లలోనూ ఉండలేనంతగా వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో సగటున గరిష్టంగా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇక మిట్ట మధ్యాహ్నం వేళయితే సూర్య భగవానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మే నెల అంటేనే ఎండలనేవి సహజం. ఇక ప్రస్తుతం రోహిణి కార్తె కూడా ప్రారంభమవడంతో రోళ్లు పగిలే స్థాయిలో ఎండలు పెరుగుతున్నాయి. ప్రజలు ఉదయాన్నే బయటకు వచ్చి తమ పనులను పూర్తి చేసుకొని 11 గంటల వరకు ఇళ్లకు చేరుకునేలా చూసుకుంటున్నారు. అయితే..రోజువారీ జీవనోపాధికి కూలి, ప్రైవేట్‌ పనులు చేసుకునేవారు అవస్థలు పడుతున్నారు. ఎండదెబ్బ బారిన పడి అస్వస్థతకు గురవుతున్నారు.

చాలావరకు పగటిపూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక ఇళ్లలో వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్నా, కూలర్లు నడుస్తున్నా చల్లదనం ఆశించిన          స్థాయిలో లేక, కాసేపు కరెంట్‌పోతే విపరీతమైన ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాతనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. సూర్య ప్రతాపానికి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. మే నెల ఆరంభం నుంచి ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 18వ తేదీన జిల్లాలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది.

గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికమే. గత మే నెలలో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా..ఈ ఏడాది అంతకు మించి నమోదవుతున్నాయి. ఇక ఎండ తీవ్రత నుంచి ఉపశమనానికి ప్రజలు శీతల పానీయాలను తాగుతున్నారు. కొబ్బరి బొండాలు, చెరకు రసం తదితరాలను తీసుకుంటూ, పిల్లలు ఐస్‌క్రీమ్‌లను తింటూ కొంత ఉపశమనం పొందుతున్నారు. పలుచోట్ల ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాలను, మజ్జిగ పంపిణీ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి
.  
జనజీవనం అతలాకుతలం 
ఎండ తీవ్రతకు రెక్కాడితే డొక్కాడని పేదల పరిస్థితి దయనీయంగా ఉంది. పనికి వెళ్లంది ఇంట్లో గడవని పరిస్థితిలో పనికి పోయి..వడదెబ్బకు గురవుతున్నారు. ఈ పరిస్థితి ఖమ్మం నగరంతో పాటు, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా నెలకొంది. ఒక్కరోజు పనికి పోతే ఎండ తీవ్రతతో నీరసపడి రెండు రోజులు ఇంటివద్ద ఉండాల్సివస్తోంది. ప్రధానంగా నిర్మాణ రంగంలో కూలీలు డీలా పడుతున్నారు. గృహ నిర్మాణ పనులు ఆగిపోతున్నాయి. నీడలో చేసే పనులే సాగుతున్నాయి. కొందరు కాంట్రాక్ట్‌ పద్ధతికి తీసుకొని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చేసి వెళ్లిపోతున్నారు.

వడదెబ్బకు విలవిల 
అధిక ఉష్ణోగ్రతలు చోటు చేసుకోవడంతో అక్కడక్కడా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వడగాలులు వీస్తుండడంతో వయో వృధులు తీవ్ర అస్వస్థత చెందుతున్నారు. పగటి వేళల్లో ద్విచక్రవాహనాలపై ప్రయాణించే వారు, పనులపై కాలినడకన వెళ్లేవారు వడదెబ్బకు గురవుతున్నారు. గ్రామాల్లో పశువుల కాపరులు, జీవాల పెంపకందార్లు ఎండదెబ్బ బారిన పడుతున్నారు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించడం కూడా ఎండ తీవ్రతకు ఇబ్బందికరంగా ఉంది.
 
అడుగంటుతున్న భూగర్భ జలాలు 
ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో బోర్లలో, బావుల్లో నీరు ఇంకుతోంది. వేసవిలో నీటి వినియోగం అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలు పడిపోయి..గ్రామాల్లో సుదూర ప్రాంతాల నుంచి నీటిని మోసుకురావాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు