చావుదెబ్బ..!

27 May, 2019 07:45 IST|Sakshi

భానుడు భగభగమంటున్నాడు.. ఉదయం 7 గంటలనుంచే తన ప్రతాపం చూపిస్తున్నాడు.. మధ్యాహ్నం 12 దాటిందంటే నిప్పులు కక్కుతున్నాడు. సాయంత్రం 5 గంటలైనా వగడాల్పులు, సెగలు తగ్గడంలేదు. ఎండలో పనిచేసే కూలీలు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు ఎండ దెబ్బకు చావుదెబ్బ తింటున్నారు. అత్యవసర పనిమీద బయటికి వచ్చిన వారు ఎండ వేడిమిని తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సుమారు పది మందికి పైగా వడదెబ్బతో చనిపోయారు. ఎందరో ఆస్పత్రుల పాలయ్యారు. ఈ మూడు నెలల్లోనే సుమారు 50కి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారంటే నమ్మశక్యం కాదు. 

పాలమూరు: ఉమ్మడి జిల్లాల్లో మండుతున్న వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు.సోమవారం  గత మూడు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో 43 నుంచి 44 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యం లో రోజువారీ పనులకు ఎప్పటిలాగే వెళ్తున్న ప్రజలు.. వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారు. మార్చి నుంచి జిల్లాలో వడదెబ్బకు గురై మృతిచెందిన వారు 50కిపైగా ఉన్నా అధికారికంగా ఒక్కటీ నమోదు చేయలేదు.

మార్చి నుంచే మార్పులు 
ఈ ఏడాది భానుడు ఉగ్రరూపం దాల్చాడు. జిల్లావ్యాప్తంగా భానుడు భగభగలాడుతూ ప్రజలను ఉక్కిరిబిక్కరి చేస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ముందుగానే ఎండల తీవ్రత మొదలైంది. మా ర్చి నుంచి వేసవి ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పు చోటుచేసుకుంది. దీంతో మే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఓవైపు వైద్య ఆరోగ్య శాఖ వడదెబ్బ నివారణకు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా.. మరణ మృదంగం మాత్రం మోగుతూనే ఉంది. బాధితుల్లో యువత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది గణాంకాలను పరిశీలిస్తే వడదెబ్బ బాధితుల్లో 15 నుంచి 35ఏళ్లలోపు యువతే అధికంగా ఉన్నట్లు తేలింది. గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉంది. తీవ్ర అనారోగ్యం గల వ్యక్తులు, చిన్నారులు, వృద్ధులు ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు.

వీరి లెక్కలేవీ..?
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 16న వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటకు చెందిన బాలకిష్టమ్మ(48), 17న కొల్లాపూర్‌ పట్టణంలోని జమ్మాన్‌గండ్ల కాలనీకి చెందిన వెంకటస్వామి(60), కొత్తకోటకు చెందిన వెంకటస్వామి(60), 22న మక్తల్‌ మండ లం సంగంబండకు చెందిన కాలప్ప(28), కోడేరు మండలం మైలారం బాలయ్య(65), 24 గోపాల్‌పేట మున్ననూర్‌కు చెందిన చక్రవర్తి(27), పెద్దచింతకుంటకు చెందిన రాములు(46) వడదెబ్బతో మృతిచెందారు. అయితే వీరు వడదెబ్బతో మృతిచెందినట్లు అధికారిక లెక్కల్లో నమోదు కాలేదు. 

ఉమ్మడి జిల్లాలో గత ఐదేళ్లలో వడదెబ్బతో ఇప్పటి వరకు 1,082 మంది మరణించినట్లు  అంచనా. కానీ వీరిలో కేవలం 75 మంది మాత్రమే వడదెబ్బతో మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ నివేదిక రూపొందించింది. ఓ వైపు వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన చర్యల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఆరు లక్షల వరకు పంపిణీ చేశామని, మరో లక్ష అందుబాటులో ఉంచామని అధికారులు ప్రకటించారు. వడదెబ్బపై కరపత్రాలతో ప్రచారం చేశామని, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటున్నారని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులకు వెళ్తే సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మే నెల చివరి వరకు ఉష్ణోగ్రతల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 
ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వదులైనా కాటన్‌ దుస్తులను ధరించాలి. లవణాలతో కూడిని నీటిని అధికంగా తీసుకోవాలి. 

ముందస్తు చర్యలేవీ..?

ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, ప్రజలు వేడిగాలులకు మరణించడం జరుగుతున్న తంతు. ఈ క్రమంలో వేసవికి ముందే చర్యలు చేపట్టాల్సిందిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. వడదెబ్బ మరణాలు సంభవిస్తే.. తేరుకోవడం లేదన్నది స్పష్టం. వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రధాన కూడళ్లు, ప్రయాణ ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల్లో విస్తృతంగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతోపాటు ఏఎన్‌ఎంల ద్వారా పంపిణీ చేయాలి.  

అర్ధరాత్రి దాకా ఉక్కపోత 

గతేడాదితో పోల్చితే ఈసారి వేసవిలో భానుడు విశ్వరూపం చూపుతున్నాడు. సాయంత్రం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. రాత్రివేళ చల్లగాలులు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ నెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోతుండటంతోపాటు అర్ధరాత్రి వరకు ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా జిల్లాలో వేసవిలో కొనసాగుతున్న అనూహ్య వాతావరణం కారణంగా ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడి ప్రజలు అవస్థలు కాసింత ఎక్కువే ఎదుర్కొంటున్నారు. ఏటా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పరిశోధకులు హెచ్చరించిన విధంగానే మార్పును ప్రజలు అనుభవించారు. 

ఊపిరాడనంత కష్టం 

గత వారం రోజులుగా ఎండ తీవ్రతకు స్వేచ్ఛ గా ఊపిరాడని అనుభవాలను మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌తోపాటు జడ్చర్ల, పేట, దేవరకద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. జిల్లా ఉత్తర దిశలో 19.23 డిగ్రీలు, తూర్పున 81.15 డిగ్రీల స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడెక్కిన ఉపరితలలా నుంచి వెలువడే వాయువులు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇలాంటి స్థితిని ఎదుర్కొనేందుకు విరివిరిగా ఎదుగుతున్న చెట్లు రావాలి. అలా కాకుంటే ఆక్సిజన్‌ శాతం తగ్గి ఉక్కిరిబిక్కిరవ్వడం, ముఖం మండుతున్న అనుభవాలు ఎదురవుతా యని వా తావరణ నిపుణులు వివరిస్తున్నారు. 

ఐదేళ్లలో ఇలా.. 

గతంలో త్రీమన్‌ కమిటీ (ఎస్‌ఐ, తహసీల్దార్, వైద్యాధికారి) నివేదికతోపాటు ఎఫ్‌ఐఆర్, పంచనామా, పోస్టుమార్టం నివేదిక తప్పనిసరి అవసరం ఉండేది. 2014లో 150 మందికిపైగా మరణిస్తే ఎఫ్‌ఐఆర్, పంచనామా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేవలం 10 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారు. ఆ తర్వాత ఆ నివేదికలు అవసరం లేదని త్రీమన్‌ కమిటీ నివేదికే ప్రామాణికమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, 2015లో దాదాపు 200 మంది వరకు వడదెబ్బతో మరణించగా కేవలం 12 మంది మాత్రమే మృతి చెందారని వాళ్ల లెక్కలో రాసుకున్నారు. 2016లో 300 వరకు మృతి చెందితే 22 మంది, 2017లో 245 మందికి గాను 18, 2018లో 187 మందికి గాను 13 మందిని అధికారికంగా గుర్తించారు. ఇక 2019లో ఇప్పటి వరకు దాదాపు 50 మందికిపైగా మృతి చెందగా.. ఒక్కరిని కూడా గుర్తించలేదు. 

వడదెబ్బకు గురైతే.. 

ఎండలో పనిచేసేవారు, తిరిగేవారు దీనికి త్వరగా వడదెబ్బకు గురవుతారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీ ఫారెన్‌హీట్‌ దాటితే వడదెబ్బ సోకుతుంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండెదడ, చెమట ఎక్కువగా రావడం, కిడ్నీలు చెడిపోవడం, ఫిట్స్‌ రావడం తదితర లక్షణాలు బయటపడతాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లొచ్చు. శరీరంలో ప్రొటీన్‌ స్థాయి తగ్గి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. శరీర ఉష్ణోగ్రత మామూలు స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు వేడిగాలి తగిలినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. 

గర్భస్రావం కావొచ్చు.. 
ఎండల తీవ్రతకు గురి కాకుండా గర్భిణులు మరింత జాగ్రత్త తీసుకోవాలి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఎప్పటి కప్పుడు ధ్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. ఇంట్లోనూ మంచి నీటిలో ఉప్పు, చక్కెర వేసుకొని తాగాలి. ఎండ తీవ్రతకు గర్భస్రావమయ్యే ప్రమాదం అధికంగా ఉం టుంది. వేసవిలో గర్భిణులు బయటకు వెళ్లకపోవడమే మంచిది.  బాలింత లు గదిలో ఫ్యాన్‌ తక్కువ వేగంతో తిరిగే లా చూడాలి. కీరదోస, పుచ్చకాయ లాం టి తాజా పండ్లు తీసుకోవడం మంచిది. – డాక్టర్‌ లక్ష్మీపద్మప్రియ, గైనకాలజిస్టు 

విచారణ చేస్తాం 
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ఆశ కార్యకర్తలతో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ప్రస్తు తం జిల్లాలో మూడు లక్షల వరకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఆయా సెంటర్లకు పంపించాం. ఇప్పటి వరకు జిల్లాలో కొంతమంది వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలుస్తుంది. కానీ దానిపై సరైన రిపోర్టు రాలేదు. మృతి చెందిన వారిపై నిర్ధారణ కమిటీ ద్వారా విచారణ చేయిస్తాం. జిల్లా లో వడదెబ్బపై ప్రచారం చేస్తున్నాం. ఎక్క డ ఎలాంటి ఇబ్బంది ఉన్నా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఫిర్యాదు చేయాలి. – డాక్టర్‌ రజని, డీఎంహెచ్‌ఓ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా