గ్రేటర్‌లో పెరిగిన ఉక్కపోత..!

31 Jul, 2018 03:35 IST|Sakshi

పెరిగిన పగటి ఉష్ణోగ్రత.. తగ్గిన గాలిలో తేమ శాతం  

సాక్షి, హైదరాబాద్‌: రుతుపవనాల ప్రభావం తగ్గడంతో గత 2 రోజులుగా గ్రేటర్‌ పరిధిలో పగటి ఉష్ణోగ్రతలతోపాటు ఉక్కపోత పెరగడంతో సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతోన్న ఉష్ణోగ్రతలతోపాటు గాలిలో తేమ శాతం 67 నుంచి 52 శాతానికి తగ్గడంతో ఉక్కపోత, పొడి వాతావరణంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. మరో 5 రోజులు నగరంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని.. అక్కడక్కడా తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని.. ఈ సీజన్‌లో రుతుపవనాల ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడకపోవడం వంటివే దీనికి కారణమని విశ్లేషించారు. సోమవారం నగరంలో గరిష్టంగా 33.2 డిగ్రీలు, కనిష్టంగా 23.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.  

మరిన్ని వార్తలు