రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగ

25 May, 2020 02:03 IST|Sakshi

వడగాడ్పులతో ప్రజలు విలవిల

ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌లో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత

ఉదయం 9 నుంచే దంచికొట్టిన ఎండ

రాత్రిపూట కూడా ఏమాత్రం తగ్గని వేడి

మరో రెండ్రోజులు ఇంతేనన్న హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

ఉపరితల ద్రోణితో తేమగాలులు వస్తేనే ఎండలు తగ్గే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘అగ్గి’రాజుకుంది! ప్రచండ భానుడి ఉగ్రరూపానికి తెలంగాణ విలవిల్లాడింది. ఎండ వేడికితోడు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాడ్పులతో వివిధ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లోనూ 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడి, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రిపూట కూడా ఆ వేడి తగ్గలేదు. ఎండ తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు అల్లాడిపోయారు. రోహిణి కార్తె కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని, 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత దాటితే ఆయా ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు అధికమవుతున్నందున వడగాల్పుల తీవ్రత సైతం పెరగనున్నట్లు తెలిపింది.

ఉత్తర భారతం నుంచి రాష్ట్రంపైకి వేడిగాలులు, పొడిగాలులు వస్తున్నాయని, ముఖ్యంగా రాజస్తాన్‌ నుంచి ఈ గాలులు వస్తుండటంతో తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. అలాగే ఉంపన్‌ తుపాను వెళ్లిపోవడంతో తేమ కూడా దాంతోపాటు వెళ్లిపోయిందని, ఫలితంగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ రెండు కారణాలతో రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తున్నాయన్నారు. అయితే గతేడాది కంటే ఈసారి వడగాడ్పులు నమోదైన రోజులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈసారి ఇప్పటివరకు మూడు రోజులే వడగాడ్పులు నమోదయ్యాయని వివరించారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీలు అధికంగా నమోదు కావడం లేదా 45–46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగా లెక్కిస్తామన్నారు. 47 డిగ్రీలు, ఆపైన ఉష్ణోగ్రతలు నమోదైతే తీవ్ర వడగాడ్పులుగా లెక్కిస్తామని పేర్కొన్నారు.

నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు...
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పలుచోట్ల వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగనున్నట్లు పేర్కొంది. ఆ ద్రోణి వస్తే తేమ గాలులు వస్తాయని, అప్పుడు కాస్తంత వేడి తగ్గుతుందని తెలిపింది.

కేటీపీపీలో 51 డిగ్రీలు?
గణపురం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఆదివారం 51 డిగ్రీల సెల్సియస్‌ రికార్డు ఉష్ణోగ్రత నమోదైనట్లు కేటీపీపీలోని ఉష్ణోగ్రత పట్టిక చూపింది. కానీ ఈ వివరాలను హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు ధ్రువీకరించలేదు.

మరిన్ని వార్తలు