నిప్పుల కుంపటి

27 May, 2020 02:39 IST|Sakshi

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

పలుచోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రత

నేడు బంగాళాఖాతంలోకి ‘నైరుతి’ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వడగాడ్పులు, ఎండల తీవ్రత తగ్గడంలేదు. మంగళవారం మళ్లీ పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. అనేకచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ సహా ఆ జిల్లాలోని జైనాడ్, బేలా, తలమడుగు, తంసి, నిర్మల్‌ జిల్లా మమ్‌డా, లక్ష్మణ్‌చంద, మంచిర్యాల జిల్లా వెల్గనూర్, జన్నారం, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు మండలం ఇస్సపల్లెలలో 46 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచడంతో జనం విలవిల్లాడిపోయారు. నిజామాబాద్, రుద్రంగి, కొల్లూరు, సోన్‌ఐబీ, భోరాజ్, మెట్‌పల్లి, శ్రీరాంపూర్‌లలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడా వడగాడ్పులు వీయడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రామగుండం, నల్లగొండ, మెదక్‌లలో 44 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

రాగల మూడ్రోజులు వడగాడ్పులు..
రాగల మూడ్రోజులు ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు వెల్లడించారు. బుధవారం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ఉన్న మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. మరోవైపు దక్షిణ చత్తీస్‌గఢ్‌ నుంచి ఇంటీరియర్‌ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు