రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలు

21 May, 2019 01:06 IST|Sakshi

వడగాడ్పులతో తల్లడిల్లుతున్న ప్రజలు

ఇప్పటివరకు 100 మంది మృతి చెందినట్లు అంచనా..

జ్వరాలు, డయేరియాతో ఆస్పత్రుల్లో పెరుగుతున్న కేసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది! తెలంగాణవ్యాప్తంగా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోపాటు తీవ్ర వడగాడ్పులు వీస్తుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటితే చాలు ఎండ తీవ్రతకు బెంబేలెత్తుతున్నారు. కూలీలు, కార్మికులు, ఉద్యో గులు వడదెబ్బల బారినపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20 వడగాడ్పు రోజులు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొనగా అనధికారికంగా పలుచోట్ల 47–48 డిగ్రీలు కూడా నమోదవుతోందని ప్రైవేటు వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ ఎండల తీవ్రత, వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజధాని హైదరాబాద్‌లో సాధారణంగా ఇతర ప్రాంతాల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఉండగా ఈసారి మాత్రం ఇప్పటివరకు 43 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రియల్‌ ఎస్టేట్‌ కోసం నగర శివార్లలో చెట్ల నరికివేత పెరగడం, చాలా వరకు చెరువులు కబ్జాకు గురికావడం, అనేక చోట్ల సిమెంటు నిర్మాణాలు జరుగుతుండటం, రేడియేషన్‌ పెరగడం వంటి కారణాలు ఎండల తీవ్రతకు కారణమవుతున్నాయని వాతావరణశాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 

వడదెబ్బతో ఆసుపత్రులపాలు... 
ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా రోజువారీ పనులు, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రజలు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఎక్కువ మంది ప్రజలు ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తుంటారు. ఉపాధి కూలీలు ఎండలు దంచికొడుతున్నా పని మానే పరిస్థితి ఉండదు. దీంతో వేలాది మంది ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, విరేచనాలకు గురవుతున్నారు. ఆహారం, తాగునీరు కలుషితమైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలా అనేక ఆసుపత్రులకు వడదెబ్బ బాధితులు క్యూ కడుతున్నారు. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో దాదాపు వంద మంది మరణించినట్లు చెబుతున్నా ఇంకా కలెక్టర్ల నుంచి తమకు నివేదిక రాలేదని విపత్తు నిర్వహణశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

అటకెక్కిన వేసవి ప్రణాళిక...  
వేసవిలో ఎండల తీవ్రత నుంచి రక్షణ కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ అవేవీ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ వేసవి ప్రణాళిక అమలుకు నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంబంధిత కమిషనర్లు నోడల్‌ ఆఫీసర్లుగా ఉంటారు. మార్చి నుంచి జూన్‌ వరకు కీలకమైన వేసవి సీజన్‌లో ప్రణాళిక అమలు చేస్తారు. తీవ్రమైన వడగాడ్పులు, ఎండలుండే హైరిస్క్‌ ప్రాంతాలను ఈ కమిటీలు గుర్తించాలి. తద్వారా వడదెబ్బ ద్వారా కలిగే అనారోగ్య సమస్యలను నివారించాలి. ఆరోగ్య కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు వడదెబ్బ నివారణపై శిక్షణ ఇవ్వాలి. ఆస్పత్రులు, వృత్తి సంఘాలకు స్థానిక భాషలో కరపత్రాలు ముద్రించి ఇవ్వాలి. వాతావరణ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు జిల్లాలవారీగా ఎండల తీవ్రతపై హెచ్చరికలు జారీ చేయాలి. సినిమా హాళ్లలో స్లైడ్లను ప్రదర్శించాలి.

వైద్య విధాన పరిషత్, వైద్యవిద్య సంచాలకుల ఆధ్వర్యంలో సంబంధిత ఆస్పత్రుల్లో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలి. కానీ ఒకట్రెండు జిల్లాలు, ప్రాంతాలు మినహా ఎక్కడా వేసవి ప్రణాళిక అమలుపై యంత్రాంగం దృష్టి పెట్టడంలేదన్న విమర్శలున్నాయి. ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. కానీ అవి కొన్నిచోట్ల మినహా అమలు కావడంలేదు. బస్టాండ్లలో ప్రయాణికుల కోసం తాగునీటి వసతి కల్పించాలి. కరపత్రాలు పంచాలి. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో చల్లని తాగునీరు, ఐస్‌ ప్యాక్‌లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు ఆర్టీసీ చర్యలు తీసుకోవాలి. కానీ ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి. 

నేడు వడగాడ్పులు, కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు... 
దక్షిణ అంతర కర్ణాటక, దాన్ని ఆనుకొని ఉన్న రాయలసీమలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌ నుంచి దక్షిణ అంతర కర్ణాటక వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా 0.9 కిలోమీటర్‌ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. అలాగే ఉత్తర అంతర కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్‌ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా తెలంగాణలో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ. వేగం)తోపాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

మరిన్ని వార్తలు