వచ్చేది వడగాల్పుల సీజన్

29 Apr, 2019 01:21 IST|Sakshi

ముందస్తుగానే వేసవి.. ఆలస్యంగా వర్షాలు

భూ తాపంతో వాతావరణంలో పెనుమార్పులు

రాష్ట్రంలో గత 4 నెలల్లో నాలుగుసార్లు అకాల వర్షాలు

ఫిబ్రవరి నుంచే ఠారెత్తిస్తున్న ఎండలు.. ఏప్రిల్‌లోనే తీవ్రతరం

జూన్‌ నుంచి కాకుండా జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు

వ్యవసాయ, ఆధారిత రంగాలపై తీవ్ర ప్రభావం

హీట్‌వేవ్‌ డేంజర్‌ జోన్‌లో తెలంగాణ.. పెరుగుతున్న వడగాడ్పులు

జనజీవనం అతలాకుతలం.. ఆందోళనలో అన్నదాత

సాక్షి, హైదరాబాద్‌:  మొన్నటి శీతాకాలంలో ఎన్నడూ లేనంత చలిని రాష్ట్ర ప్రజలు చవిచూశారు. మూడు, నాలుగు రోజులపాటు తీవ్ర చలిగాలులతో జనం అసౌకర్యానికి గురయ్యారు. మార్చి మధ్యలో ప్రారంభం కావాల్సిన వేసవి.. ఫిబ్రవరి నుంచే ఎండలతో ఠారెత్తిం చింది. ఎండలు దంచుతుండగానే వాతావర ణంలో మార్పులతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వడగళ్ల వానలు కురిశాయి. అంతలోనే పరిస్థితి మారి ఇప్పుడు మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా జూన్‌ నుంచే వర్షాకాలం షురూ కావాల్సి ఉండగా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురుస్తున్నాయి.

ఇలా రుతువులు గతి తప్పి జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. వాతావరణం ఎప్పు డెలా మారుతుందో అంతుబట్టడం లేదు. ఈ పరిస్థితి వాతావరణ అధికారులను కూడా తికమక పెడుతోంది. వారిచ్చే హెచ్చరికలు ఒక్కోసారి అటు–ఇటు అవుతున్నాయి. ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు గ్లోబల్‌ వార్మింగే కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. తీవ్రమైన కాలుష్యం, చెట్లను తెగ నరకడం, పట్టణీకరణ తదితర కారణాల వల్లే పరిస్థితి మరింత దిగజారిందనేది వారివాదన. రెండు, మూడు దశాబ్దాలుగా వాతావరణంలో ఊహించలేని మార్పులు సంభవిస్తున్నాయి. వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అకాలవర్షాలు (గాలివానలు, వడగండ్లు) ఇబ్బందికరంగా మారాయి. వాతావరణంలో వేడి ఎక్కువవడం కారణంగానే ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. సీజన్‌లో వచ్చే మార్పులు పంట కాలంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. రైతులు జూన్‌ నుంచే సాగుకు సిద్ధమవుతుంటారు. కానీ వర్షాలు ఆగస్టు, సెప్టెంబర్‌లలో పడుతుండటంతో అప్పటికే పంట చేజారిపోతోంది. రబీ కాలాన్ని ఖరీఫ్‌ ఆక్రమిస్తుంది. గతి తప్పిన రుతువులతో పంటల దిగుబడిపైనా ప్రభావం చూపుతోంది. దీంతో తెలంగాణలో వ్యవసాయం అదుపుతప్పింది.

ఎండలు, అకాల వర్షాలతో రైతన్న కుదేలు
వాతావరణ మార్పుల వల్ల ఒక్కోసారి అధిక ఎండలు, ఆ వెంటనే అకాల వర్షాలు తెలంగాణ వ్యవసాయాన్ని కుదేలు చేశాయి. సీజన్లు సరైన సమయాల్లో రానందున ఎప్పుడేం జరుగుతుందో రైతుకు అంతుబట్టడంలేదు. 2018–19 వ్యవసాయ సీజన్‌ను పరిశీలిస్తే జూన్‌ నెలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక చివరి రెండు వారాల్లో సాధారణం కంటే 15% అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. అవి మొక్క దశలో ఉండగా జులైలో 30% లోటు వర్షాపాతం నమోదైంది. దీంతో వేసిన పంటలు ఎండ తీవ్రతకు మాడిపోయాయి. ఆగస్టులో మళ్లీ 18% అధిక వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు వరి నాట్లకు ఉపక్రమించారు. కానీ అప్పటికే వేసిన పత్తి పంటపై తీవ్రమైన ప్రభావం పడింది. సెప్టెంబర్‌ నాటికి సరికి మళ్లీ వర్షాలు 35% అధికంగా కురిశాయి. దీంతో తెలంగాణలో దాదాపు సగం విస్తీర్ణంలో సాగు చేసిన పత్తి పంటకు గులాబీరంగు పురుగు సోకింది. అసందర్భంగా కురుస్తున్న వర్షాలతో పత్తి దిగుబడి 30% తగ్గింది. మొత్తంగా చూస్తే 2018–19లో 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రబీ అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. పైగా సాగునీటి వనరులున్న చోట.. ఇటీవల కురిసిన అకాల వర్షాలు వరిపంటను నాశనం చేశాయి. రబీ మొదలయ్యాక గత 4నెలల కాలంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు పంటలను దెబ్బతీశాయి. గత డిసెంబర్‌లో పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా రాష్ట్రంలో 42 మండలాల్లో పంటనష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఆవాలు, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జనవరిలో వచ్చిన అకాల వర్షాలతో కరీంనగర్, పెద్దపల్లి, వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 14 మండలాల్లోని 104 గ్రామాల్లో వేసిన పంటలకు నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో వివిధ జిల్లాల్లో కురిసిన అకాల, వడగండ్ల వర్షాలకు 12,990 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తాజాగా ఈ నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలకు లక్ష ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఇవన్నీ వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన పరిణామాలే కావడం గమనార్హం. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి అకాల వర్షాలు, వడగళ్ల వానలు సంభవిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు.

డేంజర్‌ జోన్‌లో తెలంగాణ
దేశంలో వడగాడ్పులు అధికంగా వచ్చే డేంజర్‌ జోన్‌లో తెలంగాణ ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొన్నిచోట్ల 47–49 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గతేడాది కంటే అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్ల 48–49 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముంది. అంతేకాదు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వడగాడ్పులు వచ్చే రోజుల సంఖ్య పెరుగుతోంది. వేసవిలో ఏదో ఒక నిర్దిష్టమైన రోజున సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే.. ఐదారు డిగ్రీలు అధికంగా ఉంటే వాటిని వడగాడ్పులు అంటారు. సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకు అధికంగా నమోదైతే తీవ్రమైన వడగాడ్పులుగా పరిగణిస్తారు. కొన్నిసార్లు 45 డిగ్రీలు ఆపైన ఉష్ణోగ్రతలు నమోదైతే కూడా వడగాడ్పులుగానే పరిగణిస్తారు. 47 డిగ్రీల వరకు చేరుకుంటే తీవ్రమైన వడగాడ్పులుగా గుర్తిస్తారు. ఇలాంటి వడగాడ్పులు తెలంగాణలో ఈసారి 20 రోజుల వరకు నమోదయ్యే అవకాశముంది. 2016 వేసవిలో ఏకంగా 27 రోజులుపాటు తెలంగాణలో వడగాడ్పులు ప్రతాపం చూపించాయి. వీటి కారణంగా రాష్ట్రంలో భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. 2015లో అత్యధికంగా 541 మంది వడదెబ్బతో చనిపోయారు.

తేమశాతం పెరగడంతోనే భగభగ
ఇక ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నా గాలిలో తేమ శాతం పెరిగితే ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత 34 డిగ్రీలు నమోదై, గాలిలో తేమ 75% ఉంటే, దాని ప్రభావం 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. 31 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండి.. తేమ 100% ఉంటే అది కూడా 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. కాబట్టి ఉష్ణోగ్రత సాధారణమైన తేమ శాతాన్ని బట్టి కూడా వేసవి తీవ్రతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు పట్టణీకరణ వల్ల కాలుష్యం, కాంక్రీటు, తారు రోడ్లు, సిమెంటు భవనాలు, ఇతరత్రా నిర్మాణాల వల్ల కూడా వేడి తీవ్రత మరింత పెరుగుతుంది. ఎంత ఎండాకాలమైనా ఒకప్పుడు హైదరాబాద్‌ చల్లగానే ఉండేదన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎండలతో మండిపోతుంది. తెలంగాణలో ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది సాధారణం కంటే 0.5 నుంచి 1 డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రతలుంటాయి.

అంటువ్యాధుల విజృంభణ
2030 నాటికి వాతావరణఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు పెరిగితే జరిగే విధ్వంసం ఊహకందదని ఐక్యరాజ్యసమితి గతేడాది స్పష్టం చేసింది. దాని ప్రభావం వల్ల భారత్‌లో వాతావరణ మార్పులతో అతివృష్టి, అనావృష్టి సంభవిస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల కీటకాలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటి జ్వరాలు తీవ్రరూపం దాలుస్తాయని హెచ్చరించింది. ఒకవైపు ఆహార కొరత, మరోవైపు అనారోగ్యం కారణంగా లక్షలాది మంది మృత్యువాతపడతారు. అంతేకాదు ఎండ తీవ్రతకు కిడ్నీ వ్యాధులు పెరుగుతాయి. చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశముంది. ఎండల నుంచి, వడగాడ్పుల నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు, పెద్దల్లో ఇతరత్రా అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి.

పంట దిగుబడులపై పెను ప్రభావం

  • వాతావరణ మార్పులు, భూతాపం వల్ల వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెను విపత్తు ముంచుకురానుంది. కొన్ని దశాబ్దాలుగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో వ్యవసాయ పంట దిగుబడులు, పంటల ఉత్పాదకత, పశు సంపద, పాల దిగుబడిపై ప్రభావం పడిందని కేంద్రం ఒక నివేదికలో వెల్లడించింది. 2030 నాటికి దేశంలో వరి, గోధుమ దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నివేదికలో ప్రస్తావించిన ముఖ్యంశాలు..
  • ఖరీఫ్‌లో వర్షానికి, వర్షానికి మధ్య ఎక్కువ రోజుల అంతరాయం (డ్రైస్పెల్‌) ఏర్పడటం, రబీ సీజన్‌లో సగటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటల దిగుబడి తగ్గుతుంది.
  • ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2 డిగ్రీలు పెరిగితే వరి ధాన్యం దిగుబడి హెక్టారుకు 10 క్వింటాళ్ల వరకు తగ్గుతుంది.
  • వడగాడ్పులు వీచే ప్రాంతాల్లో పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గి రైతులు ఆదాయం కోల్పోతారు. వడదెబ్బ కారణంగా కోళ్లు చనిపోయి పౌల్ట్రీ రంగంలో నష్టాలు పెరుగుతాయి.
  •  వాతావరణకాలాలు మారే కొద్దీ సముద్రంలో చేపల ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుంది.
  • కరువు, వరదల వల్ల ఉద్యాన పంటలైన పళ్లు, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.
  •  కోస్తా, తీరప్రాంతాల్లో సముద్రమట్టం పెరగడం, తుఫాన్లు, పెనుతుఫాన్ల వల్ల ఉప్పునీరు సారవంతమైన భూముల్లోకి వచ్చి చౌడు నేలలుగా మారుస్తోంది.
  •  పంటలకు వచ్చే చీడపీడల బాధ అంతకంతకు పెరుగుతుంది.
  •  చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పుదినుసుల దిగుబడి గణనీయంగా తగ్గనుంది. చిరుధాన్యాల కొరత 2025 నాటికి 33%, 2050 నాటికి 43 శాతానికి పెరగనుంది. పప్పుధాన్యాల కొరత 7శాతానికి పెరగనుంది.
  •  2050 నాటికి దేశంలో సగటున ఉష్ణోగ్రతలు 2–4 డిగ్రీల వరకు పెరుగుతాయి.
  • 2020 నాటికి అనేక పంటల ఉత్పాదకత స్వల్పంగా తగ్గుతుంది. 2100 నాటికి 10 నుంచి 40 శాతానికి తగ్గుతుంది.

పదేళ్లలో మరిన్ని మార్పులు
గత పదేళ్లలో వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయి. ప్రతీ ఏడాదీ మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. సాధారణం కంటే కనీసం మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో వడగాడ్పుల దినాలు మరింతగా పెరిగే అవకాశముంది. వాతావరణంలో వేడి పెరగడం వల్లే గాలివానలు, వడగండ్లు పెరుగుతున్నాయి. సీజన్లలో మార్పులు వస్తున్నాయి. అయితే ఏమేరకు వచ్చాయన్న దానిపై పరిశీలించాలంటే వందల ఏళ్ల వాతావరణ మార్పులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. – వైకే రెడ్డి, డైరెక్టర్, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

మరిన్ని వార్తలు