28, 29 తేదీల్లో జాగ్రత్త!

27 Apr, 2019 01:28 IST|Sakshi

తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఉత్తరదిశ నుంచి వీచనున్న వేడిగాలులు

గాలిలో అనూహ్యంగా తగ్గపోనున్న తేమశాతం

తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం నిప్పుల కుంపటిలోకి వెళ్లిపోయింది. ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో తెలంగాణలో వడగాడ్పులు వీస్తున్నాయి. మరోవైపు గ్రేటర్‌ను కూడా మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. ఈనెల 28, 29 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు తీవ్రంగా వీచే ప్రమాదం పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ‘గ్రేటర్‌’ నగరంపైనా వడగాల్పులు పంజా విసురుతాయని స్పష్టం చేసింది. పగటి వేళల్లో వీచే వేడి గాలులు తీవ్ర స్థాయిలో ఉంటాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా గాలిలో తేమ 43 శాతం కంటే తగ్గడంతో వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని పేర్కొంది.

ఇదిలా ఉండగా, శుక్రవారం నగరంలో 41 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవడంతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. వడగాడ్పులు, అధిక ఎండల నేపథ్యంలో పగటి వేళ ఇంటి నుంచి బయటికి వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. పగటి వేళల్లో వృద్ధులు, రోగులు, చిన్నారులు అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని పేర్కొంది. కాగా ఇటీవల హైదరాబాద్‌ గాలిలో తేమ శాతం 50 శాతానికి పైగా నమోదైందని, అందుకే మధ్యాహ్నం గాలుల్లో వేడి తీవ్రత అంతగా లేదని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. కానీ వచ్చే ఆది, సోమవారాల్లో వేడిగాలులు తీవ్రంగా వీచే అవకాశాలున్న నేపథ్యంలో అప్రమత్తం ఉండాలని సూచించారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
చిన్నారుల విషయంలో..:  పిల్లలు ఎక్కువసేపు ఎండలో ఆడకుండా చూడాలి. ఎండలో తిరిగితే వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే బయటకు అనుమతించాలి. సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి. ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లితే ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్‌ కాకుండా తేలికైన తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. రోజు రెండుసార్లు చన్నీటితో స్నానం చేయించాలి. వేసవిలో పిల్లలకు చికెన్‌ఫాక్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలి.

మంచినీరు తాగాలి...  
నగరంలో చాలామంది ప్రతిరోజు టూవీలర్‌పై ప్రయాణిస్తుంటారు. దీంతో అతినీలలోహిత కిరణాలు నేరుగా ముఖానికి తగలడం వల్ల ముఖం, చేతులు నల్లగా వాడిపోయే ప్రమాదం ఉంది. చలివేంద్రాలు, హోటళ్లలో కలుషిత నీరు తాగితే వాంతులు, విరేచనాల బారినపడాల్సి వస్తుంది. శరీరానికి వేడిమినిచ్చే నల్లని దుస్తులు కాకుండా తేలికైన తెల్లని కాటన్‌ దుస్తులు ధరించడం, తలకు టోపీ పెట్టుకోవడం ఉత్తమం.  

సొమ్మసిల్లితే...
వడదెబ్బ కొట్టి పడిపోయిన వారిని వెంటనే నీడ ప్రదేశానికి తీసుకెళ్లి నీటితో ముఖం శుభ్రం చేయాలి. నిమ్మకాయ, ఉప్పు కలిపిన నీళ్లు లేదా కొబ్బరి బొండం తాగించాలి. అత్యవసరమైతే ఆస్పత్రికి తరలించాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్లు, తలకు టోపీ ధరించాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగి జావ తదితర తీసుకోవడం మంచిది.  

వీధి కుక్కలతో జాగ్రత్త...  
ఎండ ప్రభావం వీధి కుక్కలపై ఎక్కువగా ఉంటుంది. సరిపడా ఆహారం లభించకపోతే కుక్కల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. అందుకే అవి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. వేగంగా వచ్చిపోయే వాహనదారులు, వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులు, వృద్ధులపై దాడికి పాల్పడతాయి. ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో కుక్కకాటు కేసులు ఎక్కువ నమోదు అవుతుండటానికి ఇదే కారణమిదే. కుక్కకాటుకు గురైనప్పుడు కట్టు కట్టకుండా నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత యాంటీ రేబీస్‌ ఇంజక్షన్‌ వేయించుకోవాలి.  

నిజామాబాద్‌లో అత్యధికంగా 45 డిగ్రీలు...
ఈ సీజన్‌లోనే అత్యధికంగా శుక్రవారం నిజామాబాద్‌లో ఏకంగా 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం, ఆదిలాబాద్‌లలో 44 డిగ్రీల రికార్డు అయింది. మహబూబ్‌నగర్‌లో 43 డిగ్రీలు, భద్రాచలం, హన్మకొండ, ఖమ్మంలో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

కొనసాగుతున్న వాయుగుండం..
హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 1,720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా.. ఆ తరువాత 12 గంటలకు తుపానుగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. ఏప్రిల్‌ 30 తేదీ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాల దగ్గరకు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని వార్తలు