పగటి పూట గజగజ

18 Dec, 2018 02:09 IST|Sakshi

వణికిస్తున్న చలిగాలులు..పడిపోయిన ఉష్ణోగ్రతలు

సాక్షి, హైదరాబాద్‌: పెథాయ్‌ తుఫాన్‌ ప్రభావం రాష్ట్రంపై పడింది. రెండ్రోజులుగా రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తుపాన్‌ కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. చలిగాలుల తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 24 గంటల్లో హన్మకొండలో సాధారణం కంటే ఏడు డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో ఆరు డిగ్రీలు తక్కువగా 24 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, నిజామాబాద్, రామగుండంలలో సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా 25–26 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌ నగరంలోనైతే పగటిపూట స్వెట్టర్లు, జర్కిన్లు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 

పలుచోట్ల భారీ వర్షాలు..
పెథాయ్‌ తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అశ్వారావుపేట, సత్తుపల్లిలలో 9 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షం కురిసింది. ముల్కలపల్లి, చంద్రుగొండ, ఏన్కూరులలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. కొత్తగూడెం, జూలూరుపాడు, మణుగూరు, పాల్వంచ, బూర్గుంపాడులలో 7 సెంటీమీటర్ల చొప్పున.. తల్లాడ, టేకులపల్లి, భద్రాచలంలలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.  

మరిన్ని వార్తలు