కాలగర్భంలో కళా వైభవం!

25 Aug, 2018 02:24 IST|Sakshi
శిథిలావస్థలో కాకతీయుల కాలం నాటి ప్రార్థనా మందిరం

కాకతీయుల కాలం నాటి ఆలయాలు ధ్వంసం.. గుప్త నిధుల కోసం తవ్వకాలు.. శిల్ప సంపద మట్టిపాలు

అద్భుత శిల్పకళా సంపద మట్టిలో కలిసిపోతోంది. నిత్యం పూజలు, అభిషేకాలతో విలసిల్లిన దేవాలయాలు, శిల్పాలు రాళ్ల కుప్పలవుతున్నాయి. గుప్త నిధుల వేటలో రాతి కట్టడాలు ధ్వంసమవుతున్నాయి. చరిత్ర కాలగర్భంలో సమాధి అవుతోంది. తెలంగాణలో గుప్తనిధుల తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పురాతన దేవాలయాల్లోని విగ్రహాల కింద బంగారం, వజ్రాలు ఉన్నాయన్న ఆశతో కొందరు దుండగులు నేరాలకు పాల్పడుతున్నారు. జంతు బలులు చేయడానికీ వెనుకాడటం లేదు. దీంతో కాకతీయులు, రాష్ట్ర కూటులు, చాళుక్యుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న అనేక ఆలయాలు, ఉప ఆలయాలు శిథిలమైపోయాయి. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా పేర్కొనే వరంగల్‌ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆలయాల ప్రస్తుత పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం.
– సాక్షి, హైదరాబాద్‌

శిథిలావస్థలో రామప్ప ఆలయాలు 
కాకతీయుల కళావైభవానికి, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం రామప్ప ఆలయం. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రముఖ ఆలయాల్లో రామప్ప ఒక్కటి. రామప్ప ఆలయంతోపాటు దాని చుట్టు పక్కల కిలోమీటర్‌ దూరంలో 20 ఉప ఆలయాలను కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయాలు ఆదరణ కరువై శిథిలమవుతున్నాయి. ఘనకీర్తి గల చారిత్రక ఆలయంలోని స్తంభాలు కూలిపోతున్నాయి. కొన్ని కట్టడాలపై మొలచిన పిచ్చి మొక్కల మధ్య శిల్పాలన్నీ వెలవెలబోతున్నాయి.

అప్రమత్తమవ్వాలి
దేవాలయాలను పరిరక్షించుకోవడంలో ప్రజల పాత్ర ముఖ్యమైంది. గ్రామాల్లోని యువత ఆలయాల్లో తవ్వకాలు వంటి చర్యలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు తెలియజేయాలి. అప్రమత్తంగా ఉండాలి. ఒక కమిటీగా ఏర్పడి దేవాలయాలను సంరక్షించుకోవాలి. పండుగలు, జాతరలు వచ్చినప్పుడు మాత్రమే దేవాలయాల వైపు చూడటం కాదు.. నిత్యం వాటిపై పరిశీలన ఉండాలి. పురాతన సంపద పరిరక్షణ కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్‌ 

కూలిన 36 మీటర్ల ప్రాకారం
కేంద్ర పురావస్తు శాఖ అధీనంలోని రామప్ప ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. కట్టడాలు కూలిపోతున్నా పురావస్తు శాఖలో చలనం కనిపించడంలేదు. దీంతో గత రెండేళ్లుగా రామప్ప ఆలయం శిథిలమవుతోందని పలువురు చరిత్రకారులు వాపోతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తూర్పు ద్వారాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం 36 మీటర్ల వరకు కుప్పకూలింది. ఇటీవల సిబార (సున్నము, ఇసుక, బెల్లం, కరక్కాయల మిశ్రమం) పద్ధతిలో ప్రహరీ గోడ మరమ్మతులు చేపట్టారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న 16 ఉప ఆలయాలు కూడా పూర్తిగా శిథిలమైపోయాయి. వీటిలో కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం కోసం కూలగొట్టి.. శిలలను కుప్పలుగా పోశారు. యాకూబ్‌సాబ్‌ స్థలంలో ఉన్న శివాలయం పూర్తిగా కూలిపోయింది. గుప్తనిధుల కోసం గర్భగుడిని గునపాలతో తవ్వేశారు. చాలా చోట్ల గుప్తనిధుల కోసం పురాతన ఆలయాల్లో రాత్రిళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. గ్రామాల్లో నివాసం ఉండేవారే ఇలాంటి వారికి సహకరిస్తున్నారని పలు కేసుల్లో జరిగిన విచారణలో తేలింది.

శిల్ప సౌందర్యానికి ప్రతీకలు
కాకతీయుల కాలంలో రామప్ప ఆలయంతోపాటు దాన్ని ఆనుకుని కాటేశ్వర, కామేశ్వర, నరసింహస్వామి, నంది మంటపం నిర్మించారు. రామప్ప చుట్టూ ఉన్న కోటగోడ లోపల గొల్లగుడి, యాకూబ్‌సాబ్‌ గుడి, త్రికూ ట ఆలయంతోపాటు అడవిలో మరో రెండు శివాలయాలు ఉన్నాయి. రామప్ప సరస్సు కట్టపై కల్యాణ మంటపం, కాటేజీల పక్కన త్రికూటాలయం, మరో రెండు చిన్న ఆలయాలు కనిపిస్తాయి. రామప్ప ఆలయం ఉన్న పాలంపేటలో మరో రెండు శివాలయాలు శిథిలమవుతున్నాయి. లక్ష్మీ దేవిపేట, పెద్దాపురం, రామాంజాపురం, నర్సాపురం గ్రామాల్లోని ఆలయాలు శిల్ప సౌందర్యానికి, కాకతీయుల కళా వైభవానికి అద్దం పడుతాయి. ప్రస్తుతం ఆ శిల్పాలు ఎండకు ఎండుతూ వానకు తడు స్తూ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. గణపురంలోని కోటగుళ్లు, కటాక్షపూర్‌లోని ఆలయాలు శిథిలమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు