సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్న ఆలయాలు

9 Jun, 2020 02:19 IST|Sakshi
సోమవారం మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులు

ప్రధాన దేవాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు

యాదాద్రిలో తొలిరోజు సిబ్బంది, స్థానికులకే అవకాశం

నేటి నుంచి మరింత పెరగనున్న తాకిడి

కరోనా నిబంధనలు అమలు చేసిన సిబ్బంది

సాక్షి, హైదరాబాద్‌ : భక్తుల రాకతో దేవాలయాలు మళ్లీ కొత్త శోభను సంతరించుకున్నాయి. వేకువ జామున సుప్రభాత సేవ మొదలు రాత్రి పవలింపు సేవ వరకు భక్తుల సమక్షంలో కన్నుల పండువగా జరిగాయి. అసాధారణ రీతిలో 78 రోజుల సుదీర్ఘకాలం స్వామి దర్శనాలు లేక వెలితిగా గడిపిన భక్తులు.. లాక్‌డౌన్‌ మినహాయింపులతో సోమవారం ఆలయాలు తెరుచుకోవటంతో ఇలవేల్పుల దర్శనాలకు తరలివచ్చారు. ఓవైపు కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నా.. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శనాల కోసం దేవాలయాలకు వచ్చారు. కరోనా నిబంధనలు అమలు చేయటంతో భక్తులు వాటిని పాటిస్తూనే దర్శనాలు చేసుకున్నారు. కరోనా సమస్య తీవ్రంగా ఉన్న హైదరాబాద్‌లో కొన్ని దేవాలయాలకు భక్తులు తక్కువగా వచ్చినా.. జిల్లాల్లో ఉన్న ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర సాధారణ దేవాలయాలకు ఎక్కువ సంఖ్యలోనే వచ్చి దర్శనాలు చేసుకున్నారు. తీర్థ ప్రసాదాలు, మొక్కులు తీర్చుకునే అవకాశాలు లేక కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినా.. చాలా రోజుల తర్వాత ఇలవేల్పు దర్శనం జరిగిందన్న సంతృప్తి కన్పించింది.

తెల్లవారుజాము నుంచే..
సోమవారం తెల్లవారుజాము నుంచే చాలా ప్రాంతాల్లో ఆలయాలకు భక్తుల రాక మొదలైంది. అప్పటికే ఆలయాలను శుద్ధి చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయం యాదగిరిగుట్టలో తొలిరోజు ఆలయ ఉద్యోగుల కుటుంబాలు, స్థానికులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. సాయంత్రం 6 గంటల వరకు 400 మంది దర్శించుకున్నారు. మంగళవారం నుంచి ఇతర ప్రాంతాల భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేక సందర్భాల్లో 5 వేలు, సాధారణ రోజుల్లో సగటున 1,500 మంది భక్తులు దర్శించుకునే భద్రాద్రి ఆలయానికి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 1,122 మంది తరలివచ్చి దర్శించుకున్నారు. సాధారణ రోజుల్లో వెయ్యి మంది భక్తులు దర్శించుకునే బాసర ఆలయంలో కూడా భక్తుల రద్దీ కన్పించింది. ఇక 790 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కొండగట్టు ఆలయాన్ని 500 మంది, కొమురవెల్లి మల్లికార్జునుడిని వెయ్యి మంది, కర్మన్‌ఘాట్‌లోని అభయాంజనేయ స్వామిని 840 మంది, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ అమ్మ వారిని 580 మంది, బల్కం పేట ఎల్లమ్మ వారిని 992 మంది, ధర్మపురి ఆలయాన్ని 250 మంది, హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడిని 1,036 మంది, సికింద్రాబాద్‌ గణేశ్‌ దేవాలయాన్ని 200 మంది దర్శించుకున్నారు. ఈ ప్రధాన దేవాలయాలు కాకుండా స్థానికంగా ఉన్న ఇతర ఆలయాలకు కూడా భక్తులు తరలివచ్చారు. మంగళవారం నుంచి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు