ఈఎన్‌టీ, దంత పరీక్షలకు తాత్కాలిక సిబ్బంది  

9 Jan, 2019 01:10 IST|Sakshi

వైద్యులు, ఇతర సిబ్బంది కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌!

సాక్షి, హైదరాబాద్‌: చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) సహా దంత వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమైన వైద్యుల తాత్కాలిక నియామకానికి సర్కారు సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్యులు సరిపోరన్న భావనతో తాత్కాలిక పద్ధతిలో తీసుకోవాలని భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వ వైద్యులను ఈ ప్రత్యేక పరీక్షలకు కేటాయిస్తే సంబంధిత ఆస్పత్రుల్లో సేవలకు అంతరాయం కలిగే అవకాశమూ ఉంది.

ఈ రెండు కారణాలతోనే ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ జరపాలని భావిస్తోంది. వచ్చే నెల నుంచే పరీక్షలకు ఏర్పాట్లు చేస్తుండటంతో ఆగమేఘాల మీద భర్తీ ప్రక్రియ చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం పచ్చజెండా ఊపిన తర్వాత జిల్లాల వారీగా ఎంపిక చేసే అవకాశముందని తెలిసింది. అయితే సమయం తక్కువగా ఉండటంతో ఎలా చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

రెండు విడతలుగా పైలట్‌ ప్రాజెక్టు.. 
ఈఎన్‌టీ, దంత పరీక్షలు ఎలా చేయాలన్న దానిపై ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ పైలట్‌ ప్రాజెక్టులు చేపట్టింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొదటి విడత పూర్తయింది. రెండో విడతలో హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, జనగాం జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద శిబిరాలు జరుగుతున్నాయి. ఈ శిబిరాల నుంచి వచ్చిన అనుభవాల ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తా రు. ఆ మేరకు మార్గదర్శకాలను తయారు చేసి సీఎం కేసీఆర్‌ ఆమోదానికి పంపిస్తారు. అక్కడినుంచి వచ్చే నిర్ణయానుసారం ఈ కొత్త కార్యక్రమం ప్రారంభం కానుంది. కంటి వెలుగు 6 నెలల్లోపే పూర్తి చేయగలిగితే, ఈఎన్‌టీ పరీక్షలు పూర్తి చేయడానికి ఏడాది పడుతుందని అంటున్నారు. ఆ మేరకే కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు