పెండింగ్‌ బిల్లులు రూ.10 వేల కోట్లకు పైనే..

26 Nov, 2019 04:39 IST|Sakshi

నీటి పారుదల శాఖలో పేరుకుపోతున్న బకాయిలు

బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురు చూపులు

సాక్షి, హైదరాబాద్‌: సాగు నీటిశాఖ పరిధిలో ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులన్నీ పేరుకుపోతున్నాయి. ఆర్థిక మాంద్యం, ఇతర ప్రజా ప్రాయోజిత పథకాలకు నిధుల అవసరాలు బాగా పెరగడంతో ప్రాజెక్టు పనుల బిల్లులు చెల్లింపు కావడం లేదు. రుణ సంస్థల ద్వారా భారీ ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నా, ఇప్పటికీ సాగు నీటి శాఖ పరిధిలో రూ.10,216 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పడటంతో కాంట్రాక్టు ఏజెన్సీలన్నీ ఆ శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి.

రూ.8 వేల కోట్లకు కుదింపు.. 
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మార్చి నెలలో పెట్టిన బడ్జెట్‌లో రూ.14 వేల కోట్ల మేర కేటాయించగా, తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌లో దాన్ని రూ.8 వేల కోట్లకు కుదించారు. ఏప్రిల్‌ నుం చి ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర పద్దుల నుంచి రూ.6,756.41 కోట్లు చెల్లింపు చేశారు. కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, తుపాకులగూడెం వంటి ప్రాజెక్టులకు రుణ సంస్థల ద్వారా మరో రూ.8,432.84 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు నీటి పారుదల శాఖ నివేదికలు చెబుతున్నాయి. కాళేశ్వరం కిందే రుణాల ద్వారా రూ.5,351 కోట్లు ఖర్చు చేశారు. అయినా ప్రస్తుతం రూ.10 వేల కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులున్నాయి. ఇందులో భారీ ప్రాజెక్టుల కిందే రూ.9,329 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల కిందే అధికంగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇందులో భూసేకరణ అవసరాలకు రూ.వెయ్యి కోట్ల మేర తక్షణ అవసరాలున్నాయి. ఈ నిధులను విడుదల చేసినా కొంత మేర ప్రాజెక్టులను వేగిరం చేసే అవకాశముంది. ఇక మిషన్‌ కాకతీయ చెరువులకు సంబంధించి రూ.700 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఆ కాంట్రాక్టర్లు నీటిపారుదల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా తూముల నిర్మాణ పనులకు టెండర్లు వేసేందుకు వెనకాడుతున్నారు.

మరిన్ని వార్తలు