మధ్య రాతియుగం ‘మోడ్రన్‌ ఆర్ట్‌’!

3 Jul, 2019 02:35 IST|Sakshi

పది వేల ఏళ్ల క్రితంనాటి రాతి చిత్రాల కాన్వాస్‌ భద్రాచలం అడవుల్లో లభ్యం

కొన్ని తరాలపాటు కొనసాగిన మానవఆవాసంలో చిత్రాల సమూహం  

పాకుతున్న ఓ భారీ ఉడుము...ఆ పక్కనే తాబేలు డిప్పలో ఉండే ఆకృతుల సమ్మేళనం.. ఓ పక్కకు చూస్తే కుక్కలాంటి ఆకారం.. దానికి ఎదురుగా క్రమపద్ధతిలో పేర్చినట్టుగా అర్ధ చతురస్రాకారపు గీతల బొత్తి, అద్దంలో ప్రతిబింబంలా ఒకదానికొకటి విరుద్ధ దిశల్లో... మనిషిలాగా కనిపిస్తుంది, కాదు అది మృగమనే భావన ఆ వెంటనే కలిగే వింత ఆకృతి.. చుట్టూ మోహరించిన జలచరాలు, సరీసృపాలు, ఉభయచర జీవులను తలపించే మరిన్ని ఆకారాలు.. దాదాపు 28 అడుగుల పొడవున్న కాన్వాస్‌పై రూపొందించిన చిత్రాలివి. చూడగానే ఓ మోడ్రన్‌ ఆర్ట్‌ను తలపిస్తుందది. చిత్రాల ఆకారాలను సులభంగా పోల్చుకునేలా ఉండవు, కానీ మనసులో మెదిలే ఏవేవో భావాలకు ప్రతిరూపాలన్నట్టుగా తోస్తాయి. ఒకదాని కొకటి పొంతన ఉండవు, వేటికవే ప్రత్యేకం. ఇంతకూ ఆ చిత్ర విచిత్ర చిత్రాల సమాహారంగా ఉన్న కాన్వాస్‌ వయసెంతో తెలుసా? దాదాపు పది వేల నుంచి పదిహేను వేల ఏళ్లు
- సాక్షి, హైదరాబాద్‌

ఆదిమానవుల చిత్రాలతో కూడిన గుహలు అడపాదడపా కనిపిస్తుంటాయి. దట్టమైన అడవులే కాదు, ఊరి పొలిమేరల్లో ఉండే గుట్ట రాళ్లపై ఎరుపురంగు చిత్రాలు అప్పుడప్పుడూ వెలుగు చూస్తూనే ఉంటాయి. నాటి మానవులు ఆవాసంగా మార్చుకున్న గుహ గోడలు, పైకప్పుపై రెండుమూడు చిత్రాలు, కొన్ని అంతుచిక్కని గీతలుంటాయి. కానీ, ఓ కాన్వాస్‌ తరహాలో ఎక్కువ సంఖ్యలో చిత్రాల సమూహం వెలుగు చూడటం మాత్రం అరుదు. అలాంటి అరుదైన రాక్‌ పెయింటింగ్స్‌ ఇప్పుడు భద్రాచలం అడవుల్లో బయటపడ్డాయి. పాల్వంచ సమీపంలోని ముల్కలపల్లి మండలం నల్లముడి గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో అడవిలో వెలుగుచూసింది. గతంలో సమీపంలోని అక్షరలొద్దిలో ఆదిమానవుల చిత్రాలు వెలుగు చూసిన నేపథ్యంలో స్థానిక ఉపాధ్యాయుడు కొండవీటి గోపివరప్రసాద్‌రావు వీటిని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కట్టా శ్రీనివాస్, శ్రీరామోజు హరగోపాల్, రాక్‌ఆర్ట్‌ సొసైటీ సభ్యులు డాక్టర్‌ మరళీధర్‌రెడ్డిలు వాటిని పరిశీలించి మధ్య రాతి యుగం నాటివి అయి ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

కొన్ని తరాల చిత్రాలు..
ఒంటి గుండుగా పేర్కొనే ఈ గుహలోని చిత్రాలు ఒకేసారి వేసినవి కావు. కొన్ని తరాలుగా వాటిని వేరువేరు మనుషులు గీస్తూ వచ్చారు. రంగు కొంత వెలిసిపోయి పాత చిత్రాలుగా కనిపిస్తుండగా, వాటిపై కొత్తగా వేసినట్టుగా మరికొన్ని చిత్రాలు ఎర్రటి రంగుతో మెరుస్తున్నాయి. ఈ గుహ కొన్ని తరాలపాటు మానవ ఆవాసంగా ఉందనటానికి ఇదో నిదర్శనం. చుట్టూ నీటి వనరులు ఉండటం, సమీపం అంతా మైదాన ప్రాంతంగా ఉండటం, గుండు ఎక్కితే దూరం నుంచే జంతువుల జాడ తెలుసుకునే వీలుండటంతో ఇది మానవ ఆవాసంగా చాలాకాలంపాటు వాడుకున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో వీలు చిక్కినప్పుడల్లా కొన్ని తరాల జనం ఆ గుహ గోడలను బొమ్మలతో నింపేశారు. సాధారణంగా ఆదిమానవుల చిత్రాల్లో మనుషులకు మచ్చికయ్యే పశువుల చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి.

వ్యవసాయాన్ని ప్రారంభించిన తర్వాత తరం వారు ఎక్కువగా ఎద్దుల చిత్రాలు గీసేవారు, కొన్ని చోట్ల శునకాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ పశువుల చిత్రాలు లేకపోవటం విశేషం. దీన్నిబట్టి వ్యవసాయ విధానం ప్రారంభించకపూర్వంనాటి మనుషులు ఈ చిత్రాలు గీసి ఉంటారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. ఇక మన దగ్గర కనిపించే చిత్రాలు ఎరుపు రంగులోనే ఉంటాయి. కానీ ఇక్కడ దాదాపు అన్ని చిత్రాలు ఎరుపు రంగుతోనే వేసినా, కొన్నింటికి తెలుపు రంగుతో అంచులు అద్దారు. మధ్య మధ్య తెలుపు రంగు చుక్కలతో ముస్తాబు చేసినట్టు ఉండటం విశేషం. ఆఫ్రికాలోని సాన్‌ థామస్‌ రివర్‌ ప్రాంతంలో కనిపించిన చిత్రాలను పోలి ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో రాళ్లపై గీతలతో చెక్కిన పెట్రో గ్లివ్స్‌ చిత్రాలు కూడా కనిపించాయి. కొన్ని అసంపూర్తి శిల్పాలు కూడా కానవచ్చాయి. తరువాతి పాలకులు ఇక్కడ ఏదో నిర్మాణం చేపట్టాలనుకుని కొంత పనిచేసి వదిలేసినట్టు అనిపిస్తోంది. ఈ రాతి చిత్రాల గుహ ఆదిమానవులపై ఎన్నో పరిశోధనలకు వీలుగా ఉన్నందున అది ధ్వంసం కాకుండా ప్రభుత్వం కాపాడాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు