జల ప్రళయానికి పదేళ్లు

2 Oct, 2019 11:34 IST|Sakshi
2009 వరదల్లో మునిగిన జోగుళాంబ,  బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ సముదాయం

కృష్ణా..తుంగభద్ర వరదలతో అలంపూర్‌ అతలాకుతలం

కొన్ని రోజుల పాటు జల దిగ్బంధంలోనే 43 గ్రామాలు 

అన్నీ కోల్పోయిన నదీ తీర గ్రామాలు 

ఎవరినీ కదిలించినా కన్నీళ్లే.. 

ఇంకా నెరవేరని ప్రభుత్వ పునరావాస హామీ

సాక్షి, అలంపూర్‌: కృష్ణా.. తుంగభద్ర నదీ తీర గ్రామాలవీ... జనమంతా ప్రశాంత జీవితం కొనసాగిస్తున్న ఆయా గ్రామాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోగా వరద ఉప్పెనలా ముంచుకొచ్చింది. ఇళ్లు, వాకిలి, వస్తువులు, పొలాలన్నీ జలమయమయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు నెల రోజుల పాటు ఆయా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో బయటపడ్డారు. రెండు నదులు కలిసి సుమారు 43 గ్రామాలపై ముప్పేట దాడి చేసిన ఈ జలప్రళయంలో వేలాది ఇళ్లు జలమయం కాగా.. లక్షకు పైగా ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అపార ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ జల ప్రళయ సంఘటనకు నేటికి సరిగ్గా పదేళ్లు అవుతుంది. అయినా.. ఆ వరదలను ఊహించుకుంటే ఇప్పటికీ బాధిత గ్రామాల ప్రజలు ఉలిక్కిపడతారు. పదేళ్ల క్రితం ముంచెత్తిన వరదల గురించి ఎవరిని అడిగినా కన్నీటిధారలే.. కోలుకునే వరకు పడ్డ ఇబ్బందులు.. పడ్డ కష్టం ఇలా ఎవరిని తట్టినా దీనగాథలే వినిపిస్తాయి. పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ ఎప్పుడు ఉగ్రరూపం దాలుస్తుంది? ప్రశాంతంగా ప్రవహిస్తోన్న తుంగభద్ర ఎప్పుడు పోటెత్తుతుందో అనే ఆందోళన ఇప్పటికీ ఆయా గ్రామాల ప్రజలను వెంటాడుతూనే ఉంది.  కృష్ణా, తుంగభద్ర నదులు ఉమ్మడి జిల్లాలో సృష్టించిన ప్రళయంతో జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ, వడ్డేపల్లి, రాజోలి, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్, ఇటిక్యాల, గద్వాల పట్టణం, ధరూర్‌ మండలం నాగర్‌దొడ్డి, మక్తల్‌ నియోజకవర్గ పరిధిలోని కృష్ణ మండలంలోని 43 గ్రామాలు జలమయమయ్యాయి. పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆయా గ్రామాలకు వరదలు ముంచెత్తాయి.  

కోలుకోని పల్లెలు.. 
చేనేతకు పుట్టినిల్లుగా ఉన్న అలంపూర్, రాజోలి, మద్దూరు, కొర్విపాడు గ్రామాలు వరద ధాటికి కుదేలయ్యాయి. ఆయా గ్రామాల్లో పునరావాసం కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. మళ్లీ ఇళ్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న కొందరు పూరి గుడిసెలు.. బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు.అలంపూర్, వడ్డేపల్లి మండలంలోని రాజోలి, తుమ్మలపల్లి, పడమటి గార్లపాడు, తూర్పుగార్లపాడు, తుమ్మిళ్ల, నసనూరు, ఇటిక్యాల మండలంలోని ఆర్‌.గార్లపాడు, అయిజ మండలంలోని కూటక్కనూరు, మానవపాడు మండలంలోని మద్దూరు గ్రామాల్లో పునరావసం కల్పించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేవలం అయిజ మండలం కూట్కనూరు, ఇటిక్యాల మండలం ఆర్‌.గార్లపాడులో పునరావసం కల్పించారు. వడ్డేపల్లి మండలంలో పునరావసం అసంపూర్తిగా ఉండగా అలంపూర్, మద్దూరులో మాత్రం పునరావసం ఊసే లేదు. వడ్డేపల్లి మండలంలోని పడమటి గార్లపాడులో 69 మందికి, మానవపాడు మండలం మద్దూరు గ్రామంలో 500 మందికి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినా.. స్థలమే ఎంపిక చేయలేదు. 

అలంపూర్‌లోని ప్రధాన కాలనీలో ముంచెత్తిన వరద (ఫైల్‌)

వడ్డేపల్లి మండలం రాజోలిలో వరద బాధితుల పునరావసం కోసం సేకరించిన 212 ఎకరాల్లో 3,048 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణాల కోసం ప్లాట్లుగా మార్చారు. 3,048 ఇండ్లను నిర్మించడానికి దశల వారీగా స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఇప్పటి వరకు 2,175 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయగా, 45ఇళ్ల వరకు ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. 500 ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. తూర్పుగార్లపాడులో169 ఇళ్లు, తుమిళ్ల గ్రామంలో 499, నసనూరులో సుమారు 290 ఇళ్ల నిర్మాణాలు కొలిక్కి రాలేదు. చేనేత కార్మికులకు ఇళ్లతో పాటు మగ్గాల కోసం అదనంగా షెడ్‌ల నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 750 మందికి షెడ్‌లు నిర్మించడానికి సన్నాహాలు చేశారు. కానీ ఇప్పటికే చేనేత మగ్గాల షెడ్‌లు మాత్రం నిర్మాణం జరగలేదు.  

ఊరు మొత్తం మునిగింది
పదేళ్ల క్రితం వచ్చిన వరదలను తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తది. నాకు బాగా గుర్తు.. అప్పుడు నేను నా దోస్తులతో కలిసి బయటే ఉన్న.. వరద అప్పుడే మొదలైంది. అందరం చూస్తుండగానే ఊరు మొత్తం మునిగిపోయింది. ఊళ్లోకి నీళ్లొస్తున్నాయని అంతకు ముందు రోజు రాత్రి నుంచే గ్రామంలో మేమెవ్వరం కూడా నిద్రపోలేదు. ఉదయం 5 గంటలకు మెల్లగా నీరు ఊర్లోకి రావడం మొదలైంది. 9 గంటలకంతా ఊరు మొత్తం నీరు చేరుకుని చుట్టు ముట్టింది. అప్పటికే బియ్యం, కొంత సామాను బయటికి తెచ్చినం. మమ్మల్ని రోడ్డు మీద పడేసిన ఆ ఘటన తలుచుకుంటే కంట్లో నీళ్లు ఆగవు. 
– లింగన్‌ గౌడ్, తుమ్మిళ్ల, రాజోలి మండలం  

మరిన్ని వార్తలు