మౌత్‌ పీస్‌

3 Oct, 2019 11:02 IST|Sakshi

హార్మోనికా లవర్స్‌కి పదేళ్లు

సిటీలో పెరుగుతున్న మౌత్‌ ఆర్గాన్‌ సాధన

అదో బుల్లి పరికరం...చేతుల్లో ఇమిడిపోతుంది. నోటికి చేర్చితే రాగాలు చిలుకుతుంది. హీరోల మనసులోని భావాలను హీరోయిన్ల మనసులకు వీనుల విందుగా చేర్చింది. వారిద్దరి ప్రేమ‘చిత్రాల’కు రాగాలు జత చేసింది. గతకాలపు వైభవంగా మిగిలిపోతున్న మౌత్‌ ఆర్గాన్‌ వురఫ్‌ హార్మోనికా సిటీలో తిరిగి సందడి చేస్తోంది. ఆధునికుల అభిరుచిలో కొత్తగా వినిపిస్తోంది.

సాక్షి, సిటీబ్యూరో:‘మేరీ సప్నోంకీ రాణీ కబ్‌ ఆయేగీ తూ’ రాజేష్‌ ఖన్నా పాడుతుంటే సుజిత్‌ కుమార్‌ ఓ చేత్తో కార్‌ నడిపిస్తూ మరో చేత్తో ఓ చిరు సంగీత పరికరాన్ని పలికిస్తాడు. షోలే సినిమాలో అమితాబ్‌బచ్చన్, మైనే ప్యార్‌ కియాలో సల్మాన్‌ఖాన్, సాజన్‌ సినిమాలో సంజయ్‌దత్, మన దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (నర్సింహా)... ఇలా మేటి స్టార్స్‌ చేతుల్లో ముద్దుగా ఒదిగిపోయి ముచ్చటైన ప్రేమ పలుకులకు తందాన పాడిన మౌత్‌ ఆర్గాన్‌ (సాంకేతిక నామం హార్మోనికా). దీనికి పునర్వైభవం తేవడానికి సినిమాలకే పరిమితం కాదని ప్రతి ఒక్కరూ పలకించి, ఆలకించి ఆస్వాదించదగ్గ  వాయిద్యమని అంటున్న హార్మోనికా లవర్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ హార్మోనికా వాడకం విస్త్రుతికి కృషి చేస్తోంది.   

10న వార్షికోత్సవం
నగరంలో గత నెల 14 నుంచి ఇండియన్‌ మౌత్‌ ఆర్గాన్‌ ప్లేయర్స్‌ మీట్‌ నిర్వహించారు. బేగంపేట్‌లోని ది మనోహర్‌ హోటల్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ మీట్‌కు నగరానికి చెందిన భిన్న రంగాలకు చెందిన మహిళలు, పురుషులు హాజరై మౌత్‌ ఆర్గాన్‌ సంగీతంతో అలరించారు. ఈ నెల 10 వ తేదీన హోర్మోనికా లవర్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ 10వ వార్షికోత్సవం జరుపుకోనుంది. మౌత్‌ ఆర్గాన్‌కు సంబంధించిన విశేషాలు కోరుకునేవారు లాగిన్‌ కావచ్చు..  www. harmonicahyderabad. blogspot. in

పాడు... పాడించు...   
హార్మోనికా, అకార్డియన్‌ లాంటి వాటిని రీడ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న హార్మోనికా ఫ్యాన్స్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో  ఏటేటా హార్మోనికా అండ్‌ రీడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఫెస్టివల్‌ పేరుతో నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా రోజంతా కొనసాగే ఈ ఈవెంట్స్‌  నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్స్‌లో హార్మోనికాతో పాటుగా సాక్సాఫోన్, అకార్డియన్, మెలొడికా... వంటివి ప్రస్తుతం కనుమరుగయ్యే దశలో ఉన్నవన్నీ ఇందులో భాగం అవుతున్నాయి.  ఈ పరికరాలకు సంబంధించిన  బ్రాండ్‌ విశేషాలు, తయారీ, స్కేల్‌... తదితర సమాచారం అందిస్తున్నారు. ‘ఈ గ్రూప్స్‌ పుణ్యమాని రీడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఆర్టిస్ట్స్‌కి మళ్లీ ఊపు వస్తోంది. ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ని అభిమానిస్తున్న వాళ్లలో     ఇంజనీర్లు, డాక్టర్లు, ఐటీ నిపుణులు ఉన్నారు’ అని హార్మోనికా లవర్స్‌ క్లబ్‌ నిర్వాహకులు రమణ చెప్పారు.

బెస్ట్‌ఇన్‌స్ట్రుమెంట్‌ ఇది...
మా సంస్థను  పదేళ్ల క్రితం అక్టోబరు 8న ఏర్పాటు చేశాం.  హార్మోనికాను పలకించే అభిమానించే వారెవరైనా సభ్యులు కావచ్చు. మేం ప్రతి వారం ఇందిరాపార్క్‌ వేదికగా సమావేశమవుతాం. ఇది ఎవరైనా సరే నేర్చుకోగలిగిన ఎక్కడైనా సరే ప్లే చేయగలిగిన బెస్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌. మేం ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా ప్లే చేయడం నేర్పిస్తాం.– కె.రమణ, హార్మోనికా లవర్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌

మరిన్ని వార్తలు