పదేళ్లు నివాసముంటేనే లోకల్‌!

13 Jul, 2017 02:15 IST|Sakshi
పదేళ్లు నివాసముంటేనే లోకల్‌!

కనీసం పేరెంట్స్‌ ఇక్కడున్నా పర్వాలేదు
మెడికల్‌ అడ్మిషన్లపై ఆరోగ్య వర్సిటీ వెల్లడి
స్థానికతపై నోటిఫికేషన్‌లో స్పష్టత


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు నివాసం ఉంటేనే ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల్లో స్థానికులుగా పరిగణిస్తారు. సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణలో చదువుకోని పరిస్థితుల్లో.. కనీసం అభ్యర్థి తల్లిదండ్రులు పదేళ్లపాటు తెలంగాణలో నివాసం ఉన్నా స్థానికులుగానే పేర్కొంటారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో సీట్ల భర్తీపై 2024 వరకు ఉమ్మడి ప్రవేశాలు ఉండాలనే నిబంధన నేపథ్యంలో వైద్య విద్య సీట్ల భర్తీలో స్థానికతపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం స్పష్టత ఇచ్చింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సమయంలో అభ్యర్థులు.. స్థానికత, కులం వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించింది.

ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సందర్భంలోనే అభ్యర్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అలాగే అభ్యర్థులు తెలంగాణలో కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో చదివితే స్థానికతను గుర్తించేందుకు వర్సిటీ మరిన్ని వివరాలు కోరుతోంది. అభ్యర్థిగానీ, అభ్యర్థి తల్లిదండ్రులుగానీ పదేళ్లపాటు తెలంగాణలోనే నివసించినట్లుగా తహసీల్దారు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని పేర్కొంటోంది. తెలంగాణలో నివసించినట్లుగా ధ్రువీకరించే పత్రంలో సంవత్సరాల వివరాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది.

 అభ్యర్థులు కులాన్ని, స్థానికతను ధ్రువీకరించే సర్టిఫికెట్లతోపాటు తాము జత చేసే సర్టిఫికెట్ల వివరాలన్నీ సరైనవేనని పేర్కొంటూ రూ.100 స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ సమర్పించాలని తెలిపింది. సర్టిఫికెట్లలో పేర్కొన్న వివరాలు తప్పుగా ఉంటే అభ్యర్థులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు