టెండర్లు మరిచారు..

14 Aug, 2018 11:26 IST|Sakshi
ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ కార్యాలయం

సాక్షి, ఆదిలాబాద్‌: కోట్ల రూపాయల పనులిచ్చారు.. టెండర్లు మాత్రం మరిచారు.. ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు.. పనులకు సంబంధించి ఇక్కడి నుంచి అంచనా వ్యయాలు రూపొందించి పంపించినప్పటికీ సాంకేతిక అనుమతి రాలేదు. టెండర్లకు మోక్షం కలగడం లేదు. అప్పట్లో మున్సిపాలిటీ పనులను ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. టెండర్లకు సంబంధించి వివిధ దశల ప్రక్రియలను పూర్తి చేయడంలో జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారుల లోపమా, లేనిపక్షంలో రాష్ట్రస్థాయిలో పనులకు అనుమతినివ్వడంలో ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయం నుంచే జాప్యం జరుగుతుందా.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో మున్సిపాలిటీ పనులు చేపట్టే పరిస్థితి లేదని ఆర్‌అండ్‌బీకి అప్పగించగా ఇప్పుడు ఆర్‌అండ్‌బీ తీరుతో విస్మయం వ్యక్తమవుతోంది.

రూ.28 కోట్ల పనులు..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం బడ్జెట్‌లోనే ప్రత్యేక నిధులు కేటాయించింది. దీనికి సంబంధించి ప్రతీ మున్సిపాలిటీకి కోట్ల రూపాయల పనులను మంజూరు చేసింది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు జీఓఆర్‌టీ నెం.187 ద్వారా 2018 మార్చి 22న రూ.28.30 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు మంజూరై దాదాపు ఐదు నెలలు అవుతోంది. అప్పట్లో ఈ పనులను మున్సిపాలిటీ నుంచి ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. దీనిపై మున్సిపల్‌ కాంట్రాక్టర్లలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మున్సిపాలిటీలో ఈ పనులు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌బీకి అప్పగించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు.

మున్సిపాలిటీ ఈ పనులను చేపట్టలేదని ఒకవేళ భావిస్తే ఇప్పుడు ఆర్‌అండ్‌బీ టెండర్ల దశకు తీసుకొచ్చేందుకే ఆపసోపాలు పడుతోంది. ఐదు నెలల క్రితం మంజూరైన ఈ నిధులను అప్పట్లోనే వినియోగించుకుంటే ఇప్పటికే పనులు కూడా ఓ దశకు వచ్చేవి. ఇప్పుడు వర్షాలు కురుస్తుండడంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ దశలో ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్కా మార్చిలో మంజూరైన ఈ నిధులకు సంబంధించి ఒకవేళ తామే చేపట్టి ఉంటే ఈపాటికి పనులను ప్రారంభించేవారని మున్సిపల్‌ అధికారులు చెబుతుండడం గమనార్హం.

ఎక్కడ లోపం..
జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లో పలు ముఖ్యమైన మార్గాల్లో రోడ్లు, డివైడర్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్, భారీ మురికి కాల్వల నిర్మాణాల కోసం ఈ నిధుల ద్వారా అంచనా వ్యయాలు రూపొందించారు. వీటిని స్థానిక ఆర్‌అండ్‌బీ అధికారులు సీఈ పరిశీలన కోసం పంపించారు. దానికి సంబంధించి సాంకేతిక అనుమతినిచ్చిన పక్షంలో ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లు పిలుస్తారు. అయితే అంచనా వ్యయం రూపొందించి ఇక్కడి నుంచి పంపించామని అధికారులు చెబుతున్నారు. మరి సాంకేతిక అనుమతినివ్వడంలో ప్రధాన కార్యాలయంలో జాప్యం ఎందుకు జరుగుతుందన్నది వారికే తెలియాలి. ప్రధానంగా రోడ్లు, భవనాల నిర్మాణాలు ఉండడంతో వేర్వేరు సీఈలు సాంకేతిక అనుమతులివ్వాల్సి ఉంటుందని, దీనివల్లే ఆలస్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇది వాస్తవమా, కాదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఆర్‌అండ్‌బీలో పోస్టుల ఖాళీ నేపథ్యంలో టెండర్ల నిర్వహణ క్రమాలకు సంబంధించి ఇక్కడే జాప్యం జరిగిందన్న విమర్శలు లేకపోలేదు. ఇవి మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కావడం, కేటాయించిన నిధుల్లో అధిక పనులు, అంచనా వ్యయాలు ఉండడంతోనే ఆర్‌అండ్‌బీ అధికారులు కొంత నిర్లక్ష్యం చేస్తున్నారన్న అపవాదు వ్యక్తమవుతోంది. సాధారణంగా ఆర్‌అండ్‌బీ చేపట్టే పనులు తక్కువ సంఖ్యలో ఉన్నా అవి వందల వేల కోట్ల రూపాయల విలువైనవి ఉంటాయి. అలాంటి సమయంలో మున్సిపాలిటీకి సంబంధించి కేవలం కొన్ని కోట్ల రూపాయల్లోనే వందల సంఖ్యలో పనుల అంచనా వ్యయాలను రూపొందించడంతో దానికి సాంకేతిక అనుమతినివ్వడంలో పైనుంచి ఆల స్యం జరుగుతుందన్న అభిప్రాయం లేకపోలేదు.

117 పనులు..
రూ.28 కోట్లకు సంబంధించి 117 పనుల అంచనా వ్యయాలను రూపొందించారు. అందులో ప్రధానంగా రిమ్స్‌ వెనకాల, మహాలక్ష్మివాడలో డ్రైనేజీల నిర్మాణాలు, వివేకానంద చౌక్‌నుంచి రైల్వే స్టేషన్‌ వరకు, పంజాబ్‌చౌక్‌ నుంచి దేవిచంద్‌చౌక్‌ వరకు డివైడర్, సెంట్రల్‌ లైటింగ్, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు చేపట్టాలి. సిటీ బ్యూటిఫికేషన్‌లో భాగంగా డివైడర్లలో అందమైన మొక్కలు, ఫౌంటేయిన్స్, పెయింటింగ్స్, తదితరవి చేపట్టాలి. అసంపూర్తిగా మిగిలిన కొత్త మున్సిపాలిటీ భవనానికి సంబంధించి మరో మూడున్నర కోట్లు ఈ నిధుల నుంచే కేటాయించారు. పలుచోట్ల బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలు కూడా ఉన్నాయి. 

అంచనా వ్యయాలు రూపొందించి పంపించాం
మున్సిపాలిటీలో రూ.28 కోట్లతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి అంచనా వ్యయాలను రూపొందించి పంపించాం. సాంకేతిక అనుమతులు రాగానే టెండర్లు నిర్వహిస్తాం. ప్రభుత్వం నుంచి ఆర్‌అండ్‌బీకి జీఓ రావడంలోనే ఆలస్యం జరిగింది. ఈ నిధుల్లో రోడ్లతోపాటు భవనాల నిర్మాణాలు కూడా ఉండడంతో హెడ్‌ ఆఫీసులో వేర్వేరు సీఈల నుంచి సాంకేతిక అనుమతి లభించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇవి తుది దశకు వచ్చింది. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తాం. – వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ, ఆదిలాబాద్‌

మరిన్ని వార్తలు