సోలార్‌ ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు   

7 Jun, 2018 12:36 IST|Sakshi
 సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎండీ ఎన్‌.శ్రీధర్‌  

ఫేజ్‌–1లో మణుగూరు, ఇల్లందు, రామగుండం–3 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ప్లాంట్లు

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (ఇండియా)తో సీఎండీ సమీక్ష

గోదావరిఖని : సింగరేణి కాలరీస్‌ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించనున్న సోలార్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి మరో పది రోజుల్లో టెండర్లు పిలవాలని, నిర్మాణం పనులకు స్థలాలను సంసిద్ధం చేయాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో బుధవారం ఆయన ‘సోలార్‌ప్లాంట్ల ఏర్పాటు, టెండర్ల ప్రక్రియ’అనే అంశంపై సింగరేణి సలహాదారు కంపెనీ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (ఇండియా)తో చర్చించారు.

తొలి దశలో 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించగా, దీనిలో ఫేజ్‌–1 కింద 4 ఏరియాల్లో వెంటనే నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇల్లందులో 60 మెగావాట్లు, రామగుండం–3లో 50 మెగావాట్లు, మణుగూరులో 30 మెగావాట్లు, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 10 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ ప్లాంట్లను తక్షణమే నిర్మించాలని నిర్ణయించారు.

ఈ ఏరియాల్లో ఏర్పాటు చేసే ప్లాంట్ల సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్క మెగావాట్‌కు 5 ఎకరాల స్థలం చొప్పున ఏరియా జీఎంలు ఇప్పటికే స్థలాలను గుర్తించారు. ఇక మిగిలింది నిర్మాణమే. ఈ నేపథ్యంలో సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ సింగరేణి కన్సల్టెన్సీ కంపెనీతో టెండరు ప్రక్రియ, టెండరు అంశాలపైన విపులంగా చర్చించారు. దేశ వ్యాప్తంగా నిర్మాణదారుల నుంచి టెండర్లు ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.

ఇందుకోసం టెండరులోని అంశాలను సునిశితంగా చర్చించారు. మరో 10 రోజుల్లో టెండర్లు పిలవాలని, ఈలోగా పక్కాగా విధి విధానాలు రూపుదిద్దాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఇండియా డైరెక్టర్‌ మిశ్రా, ఇతర అధికారులు, సింగరేణి నుంచి ఈఅండ్‌ఎం డైరెక్టర్‌ ఎస్‌.శంకర్, ఎస్‌టీపీపీ ఈడీ సంజయ్‌కుమార్‌ సూర్, వోఅండ్‌ఎం చీఫ్‌ జేఎన్‌ సింగ్, పవర్‌హౌజెస్, వర్క్‌షాప్‌ జీఎం శ్యామ్‌సుందర్, చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ లక్ష్మీనారాయణ, మణుగూరు, ఇల్లందు, రామగుండం–3 ఏరియాల జీఎంలు సీహెచ్‌ నర్సింహారావు, కె.లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ, ఎస్టీపీపీ అధికారులు పాల్గొన్నారు. 

ఎస్‌టీపీపీ మరింత మెరుగైన పనితీరు కనబర్చాలి.. 

అంతకముందు సీఎండీ సింగరేణి థర్మల్‌ పవర్‌ప్లాంటు (ఎస్‌టీపీపీ) అధికారులతో మే నెలలో ప్లాంటు పురోగతిని సమీక్షించారు. యూనిట్‌–2 మేలో 93.7 శాతం పీఎల్‌ఎఫ్‌తో 418 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. యూనిట్‌–1 మేలో 86.84 శాతం పీఎల్‌ఎఫ్‌తో 388.23 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసింది.

కాగా రెండు యూనిట్ల నుంచి మొత్తం 806.49 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేయగా, దీనిలో 762.37 మిలియన్‌ యూనిట్లు గజ్వేల్‌లోని పవర్‌ గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా 90.33 శాతం స్టేషన్‌ పీఎల్‌ఎఫ్‌ సాధించింది. విద్యుత్‌ వాడకం గరిష్ట స్థాయిలో ఉన్న మే నెలలో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం తన వంతుగా విద్యుత్‌ను అందించడంపై సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ హర్షం ప్రకటిస్తూ, మరింత మెరుగైన పని తీరును కనపరచాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా