చెరువుల పనులు టెండర్లపైనే..

27 Oct, 2014 02:40 IST|Sakshi
చెరువుల పనులు టెండర్లపైనే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
     
నియోజకవర్గానికి ఒక చెరువును ‘మినీ ట్యాంక్‌బండ్’లా తీర్చిదిద్దాలి
చెరువుల దత్తతకు ఎన్నారైలు ముందుకు రావాలని సీఎం పిలుపు
దత్తత తీసుకుంటే చెరువులకు వారు సూచించిన పేరు పెడతామని వెల్లడి

 
హైదరాబాద్: తెలంగాణలో డిసెంబర్ నుంచి చేపట్టదలచిన చెరువుల పునరుద్ధరణ పనులన్నింటినీ టెండర్ విధానంలోనే జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయిం చారు. ఇందుకు ఇ-ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అవలంబించాలని చిన్న నీటిపారుదల శాఖను ఆదేశించారు. నామినేషన్లపై పనులు ఇచ్చే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టంచేశారు. అధికారులకు ఇబ్బంది లేకుండా టెండర్లు పిలిచే పరిమితిని పెంచాలని సైతం ముఖ్యమంత్రి నిర్ణయించారు. చీఫ్ ఇంజనీర్‌లకు రూ.కోటికి పైగా విలువ చేసే పనుల టెండర్లు పిలిచే అధికారం అప్పగించాలని, ఎస్‌ఈలకు రూ.కోటి వరకు, ఈఈలకు రూ.50 లక్షల వరకు టెండర్లు పిలిచే అధికారం ఇచ్చేందుకు సమ్మతించారు. ఆదివారం చిన్ననీటిపారుదల పునర్‌వ్యవస్థీకరణ, చెరువుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి.హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు నాగిరెడ్డి, ఎస్‌కే జోషి, నీటి పారుదల ఈఎన్‌సీ మురళీధర్‌లు ఇందులో పాల్గొన్నారు. డిసెంబర్ మొదటివారం నుంచి చేపట్టబోయే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న 265 టీఎంసీల నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అనుగుణంగా చెరువుల పునరుద్ధరణ పనులు జరగాలని చెప్పారు. మొదటి దశలో 9 వేల చెరువులు పునరుద్ధరించాలని నిర్ణయించామని, ఇందుకు సుమారు రూ.4,500 కోట్ల ఖర్చు అవుతుందని వెల్లడించారు.

 పునర్‌వ్యవస్థీకరణకు సీఎం ఆమోదం..

 చిన్ననీటి పారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ మేరకు గోదావరి, కృష్ణా బేసిన్‌లకు వేర్వేరు సీఈలను నియమిస్తారు. జిల్లాకో ఎస్‌ఈ, రెవెన్యూ డివిజన్‌కో ఈఈ, నియోజకవర్గానికో డీఈ, మండలానికో ఏఈలను నియమించనున్నారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా అధికారుల నియామకం చేపట్టేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సర్వే పనులకు అవసరమైన పరికరాలు, ల్యాప్‌టాప్‌లు సమకూర్చేందుకు ఆమోదం తెలిపారు.

ఎన్‌ఆర్‌ఐలను భాగస్వామ్యం చేయాలి..

చెరువుల పునరుద్ధరణ ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా కొనసాగాలని, దీని ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. ఇందులో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్కౌట్స్, గైడ్స్, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా చెరువులను దత్తత తీసుకోవాలని ఎన్నారైలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అలా దత్తత తీసుకుంటే వారు చెప్పిన వారి పేరును చెరువుకు పెడతామని సీఎం ప్రకటించారు.
 
 

>
మరిన్ని వార్తలు