ఆన్‌లైన్ టెండర్ల విధానాల్లో మార్పులు!

7 Sep, 2014 01:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ టెండర్ల విధివిధానాలను పునః సమీక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్ల ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు టెండర్ల నియమనిబంధనల్లో సైతం మార్పులు చేర్పులు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఐటీ శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ సర్వీసెస్(ఏపీటీఎస్) ఎండీతో పాటు నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, పబ్లిక్ హెల్త్ తదితర ఇంజనీరింగ్ శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 9న ఏపీటీఎస్ ఎండీ కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమై ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది.

 

ఈ విషయుంలో సలహాలు, సూచనలు అందించాలని ముఖ్య ఇంజనీర్లకు ఐటీ శాఖ ఆహ్వానం పంపింది. ఆన్‌లైన్‌లో టెండర్ బిడ్లు తెరుచుకోకపోవడం, టెక్నికల్ బిడ్‌ను తెరిస్తే ఫైనాన్షియల్ బిడ్ తెరుచుకోవడం, ఒక్కోసారి ఆన్‌లైన్ నుంచి టెండర్ బిడ్లు అదృశ్యం కావడం తదితర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఇంజనీరింగ్ శాఖలు తరుచుగా ఫిర్యాదు చేస్తున్నాయి. ఇలాంటి సాంకేతిక లోపాల పరిష్కారంతో పాటు విధానపర మార్పులపై కమిటీ నిర్ణయం తీసుకోనుందని అధికారవర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు