ఇంటర్‌బోర్డు ముట్టడి.. విద్యార్థుల అరెస్టు

7 Jun, 2019 11:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటాలాడుతున్న ఇంటర్‌ బోర్డు తీరుపై ఏబీవీపీ కార్యకర్తలు కదంతొక్కారు. ఫలితాల వెల్లడిలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ర్యాలీగా బయల్దేరి ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు దూకి లోపలికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అక్కడి చేరుకున్న పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విద్యార్థులను దారుణంగా ఈడ్చిపారేశారు.  అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఇంటర్మీడియట్‌ బోర్డులో నేటికీ సాంకేతిక తప్పిదాలు దొర్లుతూనే ఉన్నాయి. రోజుకో రకమైన సమస్యలు బయటకు వస్తూనే ఉన్నాయి. వార్షిక పరీక్షల ఫలితాల్లో సాంకేతిక తప్పిదాలతో విద్యార్థుల మార్కుల జాబితాల్లో అనేక తప్పులు ఇచ్చిన ఇంటర్‌ బోర్డు.. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లలోనూ సాఫ్ట్‌వేర్‌ సంస్థ పొరపాట్లు చేసింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకే సబ్జెక్టులో పరీక్ష రాసే ఒకే విద్యార్థికి రెండు వేర్వేరు నంబర్లతో హాల్‌టికెట్లు జనరేట్‌ చేసి పంపడం వంటి తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినా..  ఇంటర్‌బోర్డు అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణి వీడటం లేదు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మారని తీరు.. విద్యార్థి తండ్రి ఆవేదన
నేటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కళ్లు కోల్పోయిన విద్యార్థి పట్ల ఇంటర్‌ బోర్డు వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటి సమస్యతో ఇటీవలే ఆపరేషన్‌ చేయించుకున్న విద్యార్థి శుక్రవారం పరీక్ష రాయాల్సి ఉంది. అయితే నిన్న రాత్రే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సదరు విద్యార్థి పరీక్ష రాసేందుకు తనకు స్క్రైబ్‌ కావాలని కోరాడు. దీనికి బోర్డు అనుమతి లభిస్తేనే స్క్రైబ్‌ను ఇచ్చేందుకు వీలుంటుందని ఎగ్జామ్‌ సెంటర్‌ నిర్వాహకులు చెప్పారు. ఈ క్రమంలో విద్యార్థి తండ్రి ఉదయం ఎనిమిది గంటలకే ఇంటర్‌ బోర్డు వద్దకు చేరుకున్నా.. సిబ్బంది ఆయనను లోపలికి అనుమతించలేదు. అయితే అప్పటికే పరీక్ష ప్రారంభమైనా గంటపాటు గ్రేస్‌ పీరియడ్‌ ఇస్తామని సెంటర్‌ నిర్వాహకులు హామీ ఇవ్వడంతో ఆయన ఇంకా అక్కడే వేచి చూస్తుండటం పలువురి కలచివేస్తోంది.

మరిన్ని వార్తలు